ఎమ్మెల్యేలు చెప్పిన వారికే సబ్సిడీ రుణాలు !
ఎమ్మెల్యేల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదర్శనలు
అనుచరుల ద్వారా ఎమ్మెల్యేల ప్రసన్నానికి ప్రయత్నాలు
బిసి కార్పోరేషన్ 1,800 యూనిట్లకు 21,317 దరఖాస్తులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఐదు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ, ఈ బీసీ, కమ్మ కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ లకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందడానికి జిల్లాలో భారీగా అర్హులు దరఖాస్తులు చేశారు. పలు మండలాల్లో ఇప్పటికే లబ్ధిదారులలో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. అయితే లబ్ధిదారుల ఎంపికలో అర్హతలు పక్కనపెట్టి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికే ఈ సబ్సిడీ రుణాలను అందజేయాలని ఆయా కార్పొరేషన్ లు నిర్ణయించాయి. ఈ నిర్ణయం నిరుద్యోగులకు శాపంగా పరిగణించింది. దీంతో ఇప్పటివరకు రుణాల కోసం కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రజలు ప్రస్తుతం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. వారి అనుచరుల ద్వారా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకొని సబ్సిడీ రుణాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించారు.
జిల్లాలో బీసీల ఆర్థికాభివృద్ధికి 38.41 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 19.20 కోట్ల రూపాయలు, బ్యాంకర్లు రుణాల కింద మరో 19.20 కోట్లను సమకూర్చుతారరు.ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 2020 మంది బీసీలు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ పథకాలను మూడు స్లాబ్ లుగా విభజించి, మొదటి స్లాబ్ లో యూనిట్ ధర రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో 75 వేల రూపాయలు సబ్సిడీ, 1.25 లక్షల రూపాయలు బ్యాంకులు రుణంగా ఇస్తారు. రెండవ స్లాబ్ లో యూనిట్ ధర మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో 1.25 లక్షలు సబ్సిడీ, 1.75 లక్ష రూపాయలు బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. మూడవ స్లాబ్ లో యూనిట్ ధర 5 లక్షల రూపాయలు. ఇందులో రెండు లక్షల రూపాయలు సబ్సిడీ, మూడు లక్షల రూపాయలను బ్యాంకులకు తిరిగి చెల్లించాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ కింద జిల్లాకు 16 యూనిట్లు 33 లక్షల రూపాయలతో మంజూరయ్యాయి. ఈబీసీ కార్పొరేషన్ కింద 89 యూనిట్లకు 1.75 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు 73 మంది లబ్ధిదారులకు 1.46 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. క్షత్రియ కార్పొరేషన్ కింద 11 మంది లబ్ధిదారులకు 23 లక్షలతో, రెడ్డి కార్పొరేషన్ కింద 65 మందికి 1.30 కోట్ల రూపాయలతో, వైశ్య కార్పొరేషన్ కింద 13 మంది లబ్ధిదారులకు 28.5 కోట్ల రూపాయలతో రుణాలు అందచేయనున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ కు 14.96 కోట్ల రూపాయలతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కాపు కార్పొరేషన్ కింద 445 మంది లబ్ధిదారులు లబ్ధి పొందనున్నారు. 14.96 కోట్ల రూపాయలలో 7.48 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. మరో 7.48 కోట్ల రూపాయలను బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలుగా అందచేస్తారు. కాపు కార్పొరేషన్ కింద నాలుగు స్లాబులుగా ఈ పథకాలను విభజించారు. స్లాబ్ 1 లో యూనిట్ ధర రెండు లక్షల రూపాయలు. ఇందులో లక్ష రూపాయలు సబ్సిడీ కాగా మరో లక్ష రూపాయలను బ్యాంకులు రుణంగా అందజేస్తాయి. స్లాబ్ 2 లో యూనిట్ ధర 3 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో 1.50 లక్షలు సబ్సిడీ కాగా, మరో 1.50 లక్షల రూపాయలు బ్యాంకు రుణం. స్లాబ్ 3లో యూనిట్ ధర ఐదు లక్షల రూపాయలు. ఇందులో సబ్సిడీ 2.5 లక్షల రూపాయలు గాక, బ్యాంకు రుణం 2.5 లక్షల రూపాయలు. ఇవి కాకుండా స్లాబ్ 4 లో యూనిట్ ధరను 25 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 10 లక్షల రూపాయలు. బ్యాంకు రుణం మరో 10 లక్షలు రూపాయలు. ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులు తన కాంట్రిబ్యూషన్ గా జత చేయాల్సి ఉంటుంది. కాపు కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల రూపాయల పథకాలను 99 మందికి, మూడు లక్షల రూపాయల పథకాలను 216 మందికి, ఐదు లక్షల రూపాయల పథకాలను 130 మందికి మొత్తం 445 మందికి రుణాలను అందజేయాలని నిర్ణయించారు. స్లాబ్ 1 కింద 99 లక్షల రూపాయలు, స్లాబ్ 2 ద్వారా 3.24 కోట్ల రూపాయలు, స్లాబ్ 3 ద్వారా 3.25 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తారు. స్లాబ్ 4 కింద నలుగురు లబ్ధిదారులకు 80 లక్షల రూపాయలను అందజేస్తారు. అలాగే జిల్లాలో ఎస్సిల ఆర్థికాభివృద్ధికి 27.43 కోట్ల రూపాయలతో వార్షిక ప్రణాళికను రూపొందించారు. ఇందులో కార్పొరేషన్ సబ్సిడీగా 12.52 కోట్ల రూపాయలను అందజేస్తుంది. బ్యాంకర్లు రుణాల కింద మరో 13.53 కోట్లను సమకూర్చుతారు. లబ్దిదారులు తమ వాటాగా 1.37 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు కేటగిరీలుగా రుణాలను అందజేయనున్నారు. రవాణా, పశుసంవర్ధక, చిన్న తరహా వ్యాపారం, వ్యవసాయం కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులకు రుణాలను అందజేస్తారు. రవాణా రంగంలో సబ్సిడీ 50 శాతం, బ్యాంకు రుణం 45 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుంది. ఈ స్కీములో ప్యాసింజర్ ఆటోలు, ప్యాసింజర్ కార్లు, రవాణా ట్రక్కులకు రుణాలను 77 మందికి 7 కోట్ల రూపాయలను అందజేస్తారు. పశుసంవర్థక శాఖ రంగంలో సబ్సిడీ 60 శాతం, బ్యాంకు లోను 35 శాతం, లబ్ధిదారుల వాటా 5 శాతం ఉంటుంది. ఈ కేటగిరీలో లబ్ధిదారులకు గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు సరఫరా చేస్తారు. మొత్తం 280 మందికి 3.6 కోట్ల రూపాయలతో వీటిని అందజేస్తామన్నారు. చిన్న తరహా వ్యాపారం కింద తిరిగి రెండు కేటగిరీలుగా ప్రభుత్వం రుణాలను అన్న్దచేస్తుంది. మొదటి కేటగిరీలో 3 లక్షల వరకు రుణాలు అంద చేస్తారు. ఇందులో 60 శాతం సబ్సిడీ, 35 శాతం బ్యాంకు లోను, 5 శాతం లబ్ధిదారుని వాటా ఉంటుంది. ఇందులో లక్ష రూపాయలు వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండవ కేటగిరీ కింద మూడు లక్షలు, ఆపై పడిన వ్యాపారాలకు రుణాలను అందజేస్తారు. ఇప్పటివరకు బీసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల నిమిత్తం ఆన్లైన్ ఓపెన్ కాలేదు. బీసీ కార్పొరేషన్ కు 1800 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 21,317 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా రావడంతో జిల్లా అధికారులు ఈ బాధ్యతలను సంబంధిత ఎమ్మెల్యేలకు అప్పగించారు. మండల, నియోజకవర్గ వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను విభజించారు. ఈ మేరకు జాబితాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేశారు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి మాత్రమే సబ్సిడీ రుణాలు అందనున్నాయి.

