జిల్లాలో సమగ్ర భూ సర్వే ప్రారంభం
31 మండలాల్లో 31 రెవెన్యు గ్రామాల ఎంపిక
ప్రయోగాత్మకంగా ఈ గ్రామాల్లో భూముల సర్వే
120 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్దేశం
లోటుపాట్లు సరిచేసుకొని పూర్తి స్థాయి సర్వే
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
జిల్లాలోని భూములను సమగ్రంగా సర్వే చేసి, రాళ్లను నాటి, రైతులకు భూమి హక్కు పత్రాలను పంపిణీ చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ప్రతి మండలంలో ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసుకుని భూముల సమగ్ర సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. ఈ సర్వేను 120 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఇప్పటివరకు సర్వే జరగని భూములను సర్వే చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించి ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 31 రెవెన్యూ గ్రామాలలో భూముల సమగ్ర సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఇది పూర్తయిన తర్వాత లోటుపాట్లను సరిచేసుకుని రైతులకు భూమి హక్కు పత్రాలను పంపిణీ చేయనున్నారు. వైసీపీ పాలనలో జగనన్న భూ సురక్ష పేరుతో 28 మండలాల్లో 329 గ్రామాలలో రీ సర్వే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మీద కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించింది. అనంతరం జిల్లాలోని 31 మండలాల్లో 31 గ్రామ పంచాయతీలో సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గత ప్రభుత్వం జగనన్న భూ సురక్ష పేరుతో చేపట్టిన సమగ్ర భూ సర్వే విధానం చిత్తూరు జిల్లాలో అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. జిల్లాలో 50 శాతం భూములు కూడా సర్వే జరగలేదు. గత ఏడాది డిసెంబర్ నాటికీ జిల్లాలో భూముల సర్వే పూర్తి కావాలని భావించినా 31 శాతం భూ సర్వే మాత్రమే పూర్తి అయ్యింది. ప్రభుత్వం మారడంతో సమగ్ర భూ సర్వే పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ పధకాన్ని కొన్ని మార్పులు చేర్పులతో తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు సర్వే రాళ్ల మీద అప్పటి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉండగా దాన్ని తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సమగ్ర భూ హక్కు చట్టంలో భారీగా మార్పులను తీసుకుని వచ్చింది. వైసిపి ప్రభుత్వం తీసుకొని వచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దుచేసి, భూమి మీద పూర్తి హక్కులను రైతులకు కల్పించింది. సర్వే తర్వాత జారీ చేసే భూమి హక్కు పాస్ పుస్తకాలలో జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించి, ప్రభుత్వ రాజముద్రతో భూమి హక్కు పత్రాలను రైతులకు అందజేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 31 మండలాల్లోని 31 రెవెన్యూ గ్రామాలలో ప్రయోగాత్మకంగా భూ సర్వే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. చిత్తూరు రెవిన్యూ డివిజన్ లో చిత్తూరు మండలం పాలూరు, గుడిపాల మండలం శ్రీరంగంపల్లి, గంగాధర నెల్లూరు మండలం గరిగలపల్లి, ఎస్ఆర్ పురం మండలం 50 కన్యకాపురం, వెదురుకుప్పం మండలం గారంపల్లి, పెనుమూరు మండలం నంజరపల్లి, యాదమరి మండలం సిద్ధారెడ్డిపల్లి, తవణంపల్లి మండలం చెర్లోపల్లి, ఐరాల మండలం పుల్లూరు, పూతలపట్టు మండలం వడ్డేపల్లి, పులిచెర్ల మండలం వల్లివేటివారి పల్లి, రొంపిచర్ల మండలం బడికింద పల్లెలలో ఈ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే నగిరి రెవెన్యూ డివిజన్ లో నగిరి మండలం సరస్వతివిలాస పురం, నిండ్ర మండలం నెట్టేరి, విజయపురం మండలం ఆలపాకం, కార్వేటినగరం మండలం కాటేరపల్లి, పాలసముద్రం మండలం కేజే పురంలలో సర్వే జరుగుతోంది. పలమనేరు రెవిన్యూ డివిజన్ పరిధిలో పలమనేరు మండలంలోని రంగనాయని పల్లి, బైరెడ్డిపల్లి మండలం మూలతిమ్మేపల్లి, వి. కోట మండలం టిపిజి పల్లి, గంగవరం మండలం కలగటూర్, పెద్దపంజాణి మండలం చలమంగళంలో, కుప్పం రెవిన్యూ డివిజన్ పరిధిలోని కుప్పం మండలం వెంకటేశ పురం, రామకుప్పం మండలం గిడ్డపల్లి, శాంతిపురం మండలం బి ఎం గొల్లపల్లి, గుడిపల్లి మండలం వేంగేపల్లిలలో సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు. గత ప్రభుత్వం 28 మండలాల్లో సమగ్ర భూ సర్వే పథకం ప్రారంభించింది. రొంపిచర్ల, సోముల, చౌడేపల్లి మండలాల్లో మాత్రం ఈ కార్యక్రమంలో ప్రారంభం కాలేదు. చిత్తూరు జిల్లాలో 822 గ్రామాల్లో ఉండగా ఇప్పటివరకు 329 గ్రామాలలో మాత్రమే సర్వే పూర్తయింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 13,02,229 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 3,02,255 ఎకరాల భూములు మాత్రమే సర్వే జరిగింది. అంటే 31 శాతం పూర్తి అయ్యింది. సర్వే జరిగిన తర్వాత భూమిలో సరిహద్దులను నిర్ణయించడానికి 3,33,066 సర్వే రాళ్లను వివిధ గ్రానైట్ ఫ్యాక్టరీ లో నుంచి తెప్పించారు. 2023 డిసెంబర్ నాటికల్లా సమగ్ర భూ సర్వే విధానాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. వంద సంవత్సరాల తర్వాత జరుగుతున్న భూ సర్వే ను పకడ్బందీగా అత్యంత సాంకేతిక శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలని భావించారు. తద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, భూముల విషయంలో రైతులు ధైర్యంగా ఉండవచ్చని భావించారు. ఒకరి భూమిని మరొకరు అమ్ముకోవడం, అక్రమ రిజిస్ట్రేషన్ల బెడద ఉండదని ఊహించారు. శాశ్వత భూ రక్ష పథకం కింద ఇప్పటికే జిల్లాలో అన్ని రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేసింది. గ్రామాలలో సమగ్రంగా భూ సర్వేలను నిర్వహించి, సరిహద్దురాళ్లు నాటి భూ యజమానులకు భూమి హక్కు పత్రాలను గ్రామ సభ ద్వారా అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించారు. జిల్లాస్థాయిలో, మండల, పంచాయతీ స్థాయిలో సర్వేయర్ల నియామకం జరిగింది. ఈ విషయంలో వారికి శిక్షణ కూడా ఇచ్చారు. భూమిని సర్వే చేసి కొలతలు వేసి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క కమతానికి ఒక నిర్దిష్టమైన యూనిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు కూడా ఈ సర్వే ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి కమతానికి డిజిటల్ గా ఫిజికల్ గా హద్దులు నిర్ణయించి క్యూఆర్ కోడ్ తో ల్యాండ్ మ్యాపింగ్ చేయాలని భావించారు. దీంతో తమ భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారని భయం పూర్తిగా తొలగిపోతుందని, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని, లంచాలకు అవకాశం లేకుండా పూర్తిగా ప్రయోజనం జరుగుతుందని ప్రభుత్వం భావించింది. కమతం ఒకే సర్వే నెంబర్ కింద ఉండి కార్యక్రమంలో విభజన జరిగినా, మారినా కూడా సర్వే రికార్డుల అప్డేట్ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారం యాజమాన్య పత్రాలు జారీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పూర్తయిన తర్వాత భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ సేవలను కూడా గ్రామ సచివాలయాల్లో తీసుకురావాలని భావించారు. ఒకసారి సర్వే చేసిన భూమికి ఏదైనా వివాదాల్లో ఉంటే అందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో వాటిని పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని భావించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనేది దీని ప్రధాన ఉద్దేశం కానీ, శాశ్వత సమస్య లను తెచ్చిపెట్టింది. సమస్యలే కాదు, ఏకంగా గొడవలతో అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వారితో బాహాబాహీకి దిగాల్సి వచ్చింది. తద్వారా ఒక కుటుంబంగా కలిసిమెలసి ఉన్న గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడు విరోధలుగా మారారు. దీంతో శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం రీ సర్వేలో తీవ్ర గందరగోళం నెలకొంది. 2020 డిసెంబరులో మొదలైన ఈ సర్వే తతంగం కొలిక్కి రాలేదు. మార్పులు చేర్పులతో కూటమి ప్రభుత్వం మళ్ళి సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రికార్డులలో ఉన్న మేరకు ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా భూములను సమగ్ర సర్వే చేసి రైతులకు భూమి హక్కు పత్రాలను అందజేయనున్నారు.

