1, ఫిబ్రవరి 2025, శనివారం

పెద్దిరెడ్డి అడ్డాలో గర్జించనున్న మెగా బ్రదర్


కందూరులో నేడే జనసేన భారీ బహిరంగ సభ

పెద్దిరెడ్డి అవినీతి, అక్రమాల మీద ధ్యజమెత్తనున్న  నాగబాబు 

సోమల మండలంలో టెన్షన్ టెన్షన్ 

భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు) 

మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు జనగర్జనకు సిద్ధమవుతున్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజక వర్గం సోమల మండలం కందూరులో ఆదివారం జరిగే జనసేన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట సమీపంలో అడవి భూములను ఆక్రమించాలని వివాదము చెలరేగుతున్న నేపథ్యంలో జరుగుతున్న జనసేన బహిరంగ సభకు ప్రాధాన్యత చేకూరింది. మెగా బ్రదర్ గా పేరొందిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పెద్దిరెడ్డి అవినీతి అక్రమాల మీద ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. పెద్దిరెడ్డికి కంచుకోట అయిన సోమల మండలంలో భారీ ఎత్తున జనసేన బహిరంగ సభ జరగనుండడంతో ఆ మండలంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నాగబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసైనికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకడా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. భారీగా పోలీసు బలగాలను మోహరిస్తోంది.

 సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, తిరుపతి ఎమ్మేల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఇతర నాయకులు పాల్గొంటారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అటవీ భూములు ఆక్రమణ వ్యవహారంలో ప్రభుత్వం విచారణ చేస్తున్న నేపథ్యంలో నాగబాబు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. పుంగనూరు నియోజక వర్గం, పులిచర్ల మండలం, మంగళం పేట సమీపంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 75 ఎకరాలు అటవీ భూముల ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మార్కెట్ శాఖ 2.2 కిలో మీటర్ల రోడ్డు వేశారు. దీనిపై సిఎం చంద్రబాబు విచారణ కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేసారు. ఇందులో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కన్సరవేటర్ ఆఫ్ ఫారెస్ట్స్  సభ్యులుగా ఉన్నారు.  శుక్రవారం సంయుక్త కలెక్టర్ విద్యాధరి, డీ ఎఫ్ ఓ భరణి ఆధ్వర్యంలో సర్వే చేశారు. రెండు వారాలలో పూర్తి నివేదిక అందిస్తారని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 2009లో పుంగనూరు నియోజక ఏర్పడినప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వరుసగా వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. ఇందులో ఒక సారి కాంగ్రెస్ టికెట్టుపై, మూడు సార్లు వైసిపి అభ్యర్థిగా గెలిచారు.
 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేసారు. 2014 నుంచి 2019 వరకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో కీలక పాత్ర పోషించారు. నియోజక వర్గాన్ని తన స్వంత సామ్రాజ్యంగా నిర్మించుకున్నారు. 2024 లో రాష్ట్రం వీచిన కూటమి గాలిలో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి  బిజెపి అభ్యర్ధి మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై రాజంపేట లోక్ సభ సభ్యునిగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన తమ్ముడు ద్వారకనాథ రెడ్డి రెండవ సారి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. దీనితో ఈ ప్రాంతంలో ఆయనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. గతంలో కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ పుంగనూరు మీదుగా వెళ్ళడానికి వెనుకడుగు వేశారని వార్తలు వచ్చాయి. పలమనేరు నుంచి పుంగనూరు మీదుగా వెళ్ళడం మానేసి నియోజక వర్గం చివరిలో ఉన్న పులిచర్ల మీదుగా పీలేరు వాళ్ళారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన కోసం పుంగనూరుకు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. చంద్రబాబు నాయుడును పుంగనూరులోకి రాకుండా వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు టిడిపి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు జీవో ఒకటి అగ్నికి ఆహుతి అయింది. పలువురు పోలీసులు, టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. ఆ సమయంలో చంద్రబాబు సహా వందల మంది టిడిపి నేతలు కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. వందలాది మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. చివరకు చంద్రబాబు నాయుడు పుంగనూరు పట్టణంలోకి ప్రవేశించకుండా బైపాస్ రోడ్డు మీదగా చిత్తూరు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో శ్రీకాకుళం నుంచి కప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో బెదిరించి, దూషించారు. ఆనాటి నుంచి పుంగనూరు ప్రతి పక్షాలు సభలు సమావేశాలు పెట్టడానికి వెనకడుగు వేస్తుంటారు. గతంలో రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డిని ఎదిరించే ప్రయత్నం చేసి చాలా నష్టపోయారు. ఆయన ఇంటి మీద దాడులు జరిగాయి. పుంగనూరు సమీపంలో రామచంద్ర యాదవ్ బహిరంగ సభను ఏర్పాటు చేయగా పోలీసులు దానిని అడ్డుకున్నారు. ఇలాంటి నియోజక వర్గంలో నాగబాబు భారీ బహిరంగ సభలో మాట్లాడటానికి ప్రయత్నించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోమల మండలంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నాగబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసైనికులు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ బహిరంగ సభలో నాగబాబు పెద్ద రెడ్డి అవినీతి, అక్రమాల మీద తీవ్ర స్థాయిలో గళమెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *