జిల్లాలో జీబీఎస్ వ్యాధి భయం భయం
అప్రమతమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఇటీవల గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి కేసులు ఎక్కడైనా ఉన్నాయా అని అరా తీస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశారు. వ్యాధి లక్షణాలను, తిసుకోవల్చిన జాగర్తల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి వివరించారు. మహారాష్ట్ర నుంచి వ్యాపించిన ఈ వ్యాధిని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ తెలంగాణ, ఏపీలో ఇద్దరు మహిళలు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీబీఎస్ వ్యాధి తీవ్రత, మందులు, వైద్యంపై సమీక్ష నిర్వహించారు. కేసుల తీవ్రత, చికిత్స అందుబాటులో ఉందా లేదా అనే విషయం ఆరా తీశారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 5 కేసులు, కాకినాడలో 4 కేసులు, విజయనగరం, అనంతపురం, విజయవాడలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహారాష్ట్రలో కలకలం సృష్టించిన గీయాన్ -బరే సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధితో ఆంధ్రప్రదేశ్‌లో తొలి మరణం నమోదైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రకాశం జిల్లా అలసందల పల్లికి చెందిన కమలమ్మ (45) ఈ వ్యాధితో చికిత్స పొందుతూ మూడు రోజుల కిందట మృతి చెందింది. మూడు రోజుల కిందట తీవ్రమైన జ్వరంతో కాళ్లు చచ్చుబడిపోయి ఆసుపత్రికి వచ్చిన కమలమ్మకు జీబీ సిండ్రోమ్ ఉన్నట్లు గుర్తించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందది. జాన్ అనే మరొక మహిళ కూడా వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదే వ్యాధి లక్షణాలతో మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరినప్పటికీ కోలుకొని ఆదివారంనాడు డిశ్చార్జ్ అయ్యారు. జీబీ సిండ్రోమ్ మృతి కేసు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే ప్రధమమని ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని పుణేలో వెలుగుచూశాయి. ఒక్క వారం వ్యవధిలోనే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి. జీబీఎస్ వ్యాధి తొలుత పాదాలు, చేతుల్లో తిమ్మిరి, మొద్దుబారడంతో మొదలవుతుంది. ఆ తర్వాత కండరాలు బలహీనపడి, కీళ్లు కదిలించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రెండు లేదా నాలుగు వారాల్లో లక్షణాలు మరింత ముదురుతాయి. ఈ వ్యాధి తీవ్రత, వారికి అందే ఆరోగ్య సంరక్షణ కారణంగా ఈ వ్యాధి సోకినవారి మరణాల రేటు 3 నుంచి 13 శాతం మధ్యలో ఉంటుంది. పుణేలో విజృంభించిన ఈ వ్యాధిలో ఆహార పదార్థాల ద్వారా ఇన్‌ఫెక్షన్ సోకే క్యాంపిలోబ్యాక్టర్ జీజుని అని పిలిచే సూక్ష్మజీవి ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ సోకేందుకు ఇదే అతిపెద్ద కారకంగా నిర్ధారించారు. జీబీ సిండ్రోమ్ అనేది అంటు వ్యాధి కాదు.. వంశపారం పర్యంగా కూడా రాదని,, ప్రజలు ఈ విషయం అవగాహన చేసుకోవాలని జీజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి తెలిపారు. ఈ వ్యాధికి బర్డ్ ఫ్లూతో సంబంధం లేదు.. జీబీఎస్ కేసులు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. 95 శాతం రికవరీ అవుతారని చెప్పారు. ఇన్ఫెక్షన్స్. డయేరియా, గ్యాస్ట్రో ఎంట్రైసిటీస్. జలుబు దగ్గు, ఇన్‌ఫ్లుయెంజా వల్ల ఈ ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే... ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. శుభ్రమైన నీరు తాగాలి. పోషకాహారం తీసుకోవాలి. ఈ వ్యాధి సోకితే, నరాలు ఒక్కసారిగా చచ్చుబడిపోవడం లేదంటే.. ఒకొక్కటిగా పనిచేయకపోవడం.. కండరాల బలహీనతతో తీవ్రమోతాదులో పక్షవాతం వస్తుంది. ఈ సమస్య చేతులు, కాళ్లల్లో జలదరింపు లేదా తిమ్మిరితో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత కండరాల బలహీనతతో కీళ్లను కదిలించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాలలో తీవ్రమవుతాయి. ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి మనిషిని బలహీన పరుస్తుంది. చివరికి కండరాల బలహీనతతో పక్షవాతం వస్తుంది. ఒక్కోసారి చేతులు, కాళ్లు చచ్చుబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాధి రావచ్చు, కానీ త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు, వైరల్ ఇన్‌ఫెకన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్న వారు,. గతంలో ఏవైనా వైరస్ జబ్బులు బారినపడి కోలుకున్న వారికి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ ఫీవర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. చిన్న పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. బలహీనంగా ఉండేవారిపై త్వరగా ప్రభావం చూపిస్తుంది. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, తాజా, శుభ్రమైన ఆహారం తినాలని సూచిస్తున్నారు. పాడైపోయిన, ఉడికీ ఉడకని కోడి లేదా మాంసం కూరలను తినొద్దని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన చాలా జీబీఎస్ కేసుల్లో సరిగ్గా వండని కోడి మాంసం నుంచే వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే, నీరు ద్వారా కూడా ఇది వ్యాపిస్తున్నట్లు తెలిపారు. కలుషితమైన నీటిని గిన్నెలు కడిగేందుకు, రోడ్డుపై ఆహారం తయారు చేసేందుకు వాడటం వల్ల బ్యాక్టీరియా సలుభంగా వ్యాపిస్తున్నట్లు తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్ళడం మంచిది. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ .. జిల్లాలో ఇప్పటివరకు కేసులు ఏమి నమోదు కలేదన్నారు. జిల్లాలో డాక్టర్లు అందరిని అప్రమత్తం చేసామని, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామని వివరించారు.