ఎస్సిల అభివృద్ధికి రూ. 27.43 కోట్లతో ప్రణాళిక
కార్పొరేషన్ సబ్సిడీగా రూ. 12.52 కోట్లు
బ్యాంకర్ల రుణాలు రూ. 13.53 కోట్లు
లబ్దిదారుల వాటాగా రూ.1.37 కోట్లు
జిల్లాలోని 786 మంది ఎస్సీలకు లబ్ధి
ఆంధ్రప్రభ బ్యూరో తో ఎస్సీ కార్పొరేషన్ ఇడి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జిల్లాలో ఎస్సిల ఆర్థికాభివృద్ధికి 27.43 కోట్ల రూపాయలతో వార్షిక ప్రణాళికను రూపొందించామని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యు. చిన్నయ్య వెల్లడించారు. ఇందులో కార్పొరేషన్ సబ్సిడీగా 12.52 కోట్ల రూపాయలను అందజేస్తుందని, బ్యాంకర్లు రుణాల కింద మరో 13.53 కోట్లను సమకూర్చుతారని, లబ్దిదారులు తమ వాటాగా 1.37 కోట్ల రూపాయలు చెల్లించాలని వివరించారు. శుక్రవారం చిత్తూరులో చిన్నయ్య 'ఆంధ్రప్రభ బ్యూరో'తో మాట్లాడుతూ ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 786 మంది ఎస్సీలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇందుకు దరఖాస్తులకు సంబంధించి ఇంకా ఆన్ లైన్ ఓపెన్ కాలేదని, ఓపెన్ అయిన తర్వాత ఆన్ లైన్ ద్వారా ఏపిఓబిఎంఎంఎస్ పోర్టరు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు కేటగిరీలుగా రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు. రవాణా, పశుసంవర్ధక, చిన్న తరహా వ్యాపారం, వ్యవసాయం కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులకు రుణాలను అందజేస్తామన్నారు. రవాణా రంగంలో సబ్సిడీ 50 శాతం, బ్యాంకు రుణం 45 శాతం, లబ్ధిదారుని వాటా 5 శాతం ఉంటుందని తెలిపారు. ఈ స్కీములో ప్యాసింజర్ ఆటోలు, ప్యాసింజర్ కార్లు, రవాణా ట్రక్కులకు రుణాలను 77 మందికి 7 కోట్ల రూపాయలను అందజేస్తామన్నారు. పశుసంవర్థక శాఖ రంగంలో సబ్సిడీ 60 శాతం, బ్యాంకు లోను 35 శాతం, లబ్ధిదారుల వాటా 5 శాతం ఉండాలన్నారు. ఈ కేటగిరీలో లబ్ధిదారులకు గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు సరఫరా చేస్తామన్నారు. మొత్తం 280 మందికి 3.6 కోట్ల రూపాయలతో వీటిని అందజేస్తామన్నారు. చిన్న తరహా వ్యాపారం కింద తిరిగి రెండు కేటగిరీలుగా ప్రభుత్వం రుణాలను విభజించిందని చెప్పారు. మొదటి కేటగిరీలో 3 లక్షల వరకు రుణాలు అంద చేస్తామని, ఇందులో 60 శాతం సబ్సిడీ, 35 శాతం బ్యాంకు లోను, 5 శాతం లబ్ధిదారుని వాటా ఉంటుందన్నారు. ఇందులో లక్ష రూపాయలు వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. రెండవ కేటగిరీ కింద మూడు లక్షలు, ఆపై పడిన వ్యాపారాలకు రుణాలను అందజేస్తామన్నారు. ఈ కేటగిరీలో హోటళ్లు, శారీ పాలిషింగ్, బ్యూటీ పార్లర్, ఫోటో స్టూడియో, కూరగాయల షాపు, సెల్ ఫోన్ రిపేర్, కిరాణా షాపులు, మినీ డైరీ, ఈవెంట్ మేనేజ్మెంట్, లెదర్ జువెలరీ, ఐస్ క్రీమ్ పార్లర్, మెటల్ బ్రాస్ యూనిట్, జెనెటిక్ మెడికల్ షాప్స్, మొబైల్ ఫుడ్ స్టాల్స్, లెదర్ బెల్ట్ మేకింగ్ యూనిట్స్, గన్నీ బ్యాగుల తయారి, టెక్స్టైల్ యూనిట్స్ వస్తాయని వివరించారు. ఈ కేటగిరీ కింద 327 మందికి 11 కోట్ల రూపాయలను రుణాలుగా అందచేస్తామని వివరించారు. వ్యవసాయం కేటగిరీ కింద బహుళ పంట నూర్పిడి యంత్రాలు, పవర్ ట్రీల్లర్లు, కలుపు మొక్కలు తీసే యంత్రాలు, ట్రాక్టర్ టైలర్స్, మినీ రైస్ మిల్, మినీ దాల్ మిల్, ట్రాక్టర్, రోటావేటర్ అన్న్దచేస్తామని చిన్నయ్య తెలిపారు. ఈ కేటగిరిలో 102 మందికి 5.78 కోట్ల రూపాయలను అందజేస్తామని వివరించారు. దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకుపాసు బుక్ తో పాటు ఫోన్ నెంబరు జత చేయాల్సి ఉంటుందని వివరించారు. రుణాలకు దరఖాస్తు చేయదలచుకున్న లబ్దిదారులు వీటిని సిద్దం చేసుకొని రెడీగా ఉండాలన్నారు. జిల్లాలోని ఎస్సీ లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నయ్య విజ్ఞప్తి చేశారు.
.

