27, ఫిబ్రవరి 2025, గురువారం

నెలన్నర ఆలస్యంగా విరగబూసిన మామిడి పూత

వచ్చిన పూత నిలచేనా? రైతుకు ఆదాయం వచ్చేనా?


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

నెలన్నర ఆలస్యంగా చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం మామిడి పూత విరగపూసింది. ఎక్కడ చుసిన మామిడి పూత విపరీతంగా కనిపిస్తోంది. గత ఏడాది దిగుబడులు తగ్గినా, ఈసారి భారీగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందం  వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం దిగుబడి రాకపోవడంతో పాటు గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి పూత ఆలస్యం అయినా, భారీగా వచ్చింది. భారీగా దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర వస్తుందా అన్న ఆందోళన రైతులల్లో వ్యక్తం అవుతుంది. గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేసిన పల్ప్ నిల్వలు ఎక్కడికక్కడ పెరుకుపోయాయి. విదేశాల్లో జరుగుతున్న యుద్దాల కారణంగా జిల్లాలో మామిడి పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. దీంతో ఈ పర్యాయం మామిడి రేట్లు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.


జిల్లాలో ప్రధాన ఉద్యాన పంట అయిన మామిడి వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం కూడా  సహకరించడం లేదు. ప్రతీయేటా డిసెంబరు మూడో వారం, జనవరి తొలి, మలి వారం నాటికి పూర్తి స్థాయిలో పూత వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో పిందెలు ఏర్పడుతాయి. శివరాత్రికి శివలింగం అంత మామిడి వస్తుందని నానుడి. అయితే, ప్రస్తుత సీజన్‌లో అధిక వర్షాలు పడడం, రాత్రి వేళలో చలితీవ్రత పెరగడం, తెగుళ్ల ప్రభావం వల్ల ప్రస్తుతం  ఆశించిన మేరకు తొలుత పూత  రాలేదు. అధిక వర్షా లు, తీవ్రమైన చలి పరిస్థితులు మామిడిపై ప్రభావం చూపాయి. మామిడి పంటకు వేడి వాతావరణం అవసరం. ఈ సీజన్ లో  నవంబర్ నెల ఆఖరి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ నెలలో కూడా వర్షాలు పడ్డాయి. దీంతో జిల్లాలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. జిల్లాను చలి గడగడలాడిస్తోంది. ఉదయం 8 గంటలైన మంచు కురస్తూనే ఉంటుంది. మళ్లీ సాయంకాలం నాలుగు గంటలకే మంచు ప్రారంభమవుతోంది. జిల్లాలో మారిన వాతావరణ  పరిస్థితుల దృష్ట్యా 45 రోజుల పాటు ఆలస్యంగా మామిడి పూత రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. వారి అంచనా మేరకు ప్రస్తుతం జిల్లాలో మామిడి పూత భారీగా కనిపిస్తోంది. సాధారణంగా ఈపాటికి జిల్లాలో మామిడి పిందెలు కనిపిస్తూ ఉండాలి. అయితే నెలన్నర ఆలస్యంగా మామిడి పూత ప్రారంభమైంది. జిల్లాలో పగటిపూట ఎండలు మండుతున్న, రాత్రిపూట చల్లని వాతావరణం కొనసాగుతోంది. దీంతో మామిడి చెట్లలో వచ్చిన పిందెగా మారుతుందా లేదా అన్న అనుమానం మామిడి రైతులలో  వ్యక్తమవుతోంది. సాధారణంగా వేయి పుతకు  ఒక మామిడి పిందే దిగుతుంది. ఇది సాధారణంగా వాతావరణం బాగున్న రోజులలో. అయితే, ఇప్పుడు కూడా జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మామిడి చెట్లకు భారిగా పూత వచ్చింది. వచ్చిన పూత  నిలుస్తుందా లేదా అన్న సందేహం రైతులలో  కలుగుతుంది. ఈ సందేహాన్ని ఉద్యానవన శాఖ అధికారులు సైతం నివృత్తి చేయలేకపోతున్నారు. చిత్తూరు జిల్లాలో 1.50  లక్షల ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా, ఉమ్మడి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న మామిడి తోటల నేపద్యంలో మామిడికాయలను పల్ప్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 47 మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవి 2023లో 8 లక్షలు మెట్రిక్ టన్నుల మామిడికాయలను కొనుగోలు చేసి తద్వారా నాలుగు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. 2024 సంవత్సరంలో మామిడి పంట గణనయంగా తగ్గింది. దీంతో నాలుగు లక్షల మామిడి కాయలను క్రస్సింగ్ చేసి రెండు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అయిన పల్ప్ ఎక్కువగా యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాగే కొంత గల్ఫ్ దేశాలకు,  సింగపూర్ కూడా ఏగుమతి అవుతుంది. జిల్లాలో తయారయ్యే మామిడి పల్పు మనదేశంలో వినియోగం చాలా తక్కువ. మన దేశంలోని స్లైడ్, మాజా, రియల్, ఫ్రూటీ, గల్లా  వంటి జ్యూస్ లు తయారు చేస్తారు. గత సంవత్సరంగా జరుగుతున్న అమాస్ ఇజ్రాయిల్ యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్దాల కారణంగా ఇతర దేశాలకు చిత్తూరు నుండి మ్యాంగో పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. గత రెండు సంవత్సరాలలో తయారైన మామిడి పల్ప్ ఇంకా 2.85 లక్షల టన్నుల నిల్వ ఉంది. ఒకవైపు జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకుండా రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరో వైపు ప్రపంచంలో జరుగుతున్న యుద్దాల కారణంగా మామిడి గుజ్జు ఎగుమతికి నోచుకోకుండా రైతులు నష్టపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా వచ్చిన మామిడి పూత ఎంతవరకు నిలుస్తుందో, రైతులకు ఎంత ఆదాయం తెస్తుందో  వేచి చూడాలి. 

పో రై గంగ 1 మామిడి పూత 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *