7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 34 శాతం

ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

బిసి కూటమి నేతలలో ఆనందోత్సవాలు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం 

జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేతలు

నెలలోపు భర్తీ చేస్తామన్న మంత్రి లోకేష్


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

రాష్ట్ర రాజధానిలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది. మొత్తం పదవులలో ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 శాతం పదవులను కట్టబెట్టాలని నిర్ణయించారు. దీంతో  జిల్లాలోని బీసీ నాయకులలో ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. త్వరలోనే భారీ ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో నామినేటెడ్ పోస్టులపైన జిల్లాలోని బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకమైన ఆశలను పెట్టుకుంటున్నారు. తమకు భారీగా అవకాశాలు ఉంటాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశంతో పాటు బిజెపి, జనసేన పార్టీలలోని వెనుకబడిన తరగతుల నాయకులకు కూడా ఆశాభవంతో ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినా, కొన్ని అవాంతరాల వల్ల పోస్టులు భర్తీ వాయిదా పడుతూ వచ్చింది.  ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఎలాంటి అవాంతరాలు లేవని కొందరు అంటున్నారు. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ - గుంటూరు పట్టభద్ర నియోజకవర్గాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించింది. వీటికి ఫిబ్రవరి మూడో తారీఖున నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల కారణంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ సందేహమని మరికొందరు అంటున్నారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు న్యాయ సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆ జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లో నామినేట్ పోస్టుల భర్తీకి ఎటువంటి అవాంతరాలు లేవని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే 60 కార్పొరేషన్ లతో కూడిన ఒక జాబితా సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ జాబితాను బిజెపి జనసేన నాయకులు కూడా ఆమోదించారని సమాచారం. దీంతో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగనుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. తొలుత రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పోస్టుల భర్తీ వాటికి డైరెక్టర్ల నియామకం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన కొన్ని కార్పొరేషన్లకు కూడా ఇప్పటివరకు డైరెక్టర్లను నియమించలేదు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మూడు నెలలలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల తరువాత జిల్లాస్థాయిలోని సహకార సంస్థలు, మార్కెట్‌ కమిటీల పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ వందలాది పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కనున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.  చిత్తూరు జిల్లాలో 76 సహకార సొసైటీలో ఉన్నాయి. వీటిలో ఒక్కోదానికి చైర్మన్‌తో పాటు, ఇద్దరు సభ్యులను నామినేట్‌ చేయడం ద్వారా జిల్లాలో 228 మందికి అవకాశం లభించనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించాలని సర్కారు సూచించింది. ఈ పోస్టుల భర్తీకి శాసనసభ్యులు తగిన అభ్యర్థుల పేర్లను సూచించాల్సిందిగా అధిష్టానం ఇప్పటికే కోరింది. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. రెండు నెలలలో  ఈ పదవులను కూడా భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నారు. రెండోదశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్‌ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు చేసి నామినేట్‌ చేస్తారు. జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సహకార సంస్థల్లో సింగిల్ విండోల  పదవులు కూడా భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. వందల సంఖ్యలో మత్స్యకార సొసైటీలకు కూడా నామినేటెడ్‌ పాలక వర్గాలు నియమించే కసరత్తును సహకార శాఖ చేపట్టింది. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపైనా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు.  వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలక వర్గాల నియామక కసరత్తు ప్రభుత్వ స్థాయిలో జరుగుతోంది. వీటికి ఎన్నికలు ఉండవు. రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమిస్తారు. చిత్తూరు జిల్లాలో 10 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ మార్కెట్ కమిటీలు చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, బంగారుపాలెం, నగిరి, సోమల, కుప్పం, పెనుమూరు రొంబిచర్ల, ఎస్ఆర్ పురం లలో ఉన్నాయి. ఒక్కో కమిటీలో చైైర్మన్‌తో కలిపి 15 మంది సభ్యులను నియమిస్తారు. ఈ కమిటీల చైర్మన్‌ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్‌లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్‌లో ఉన్న చైర్మన్‌ పదవులు జనరల్‌ అవుతాయి. ఇప్పుడు జనరల్‌లో ఉన్నవి రిజర్వేషన్‌లోకి వస్తాయి. జిల్లాలో కాణిపాకం, బోయకొండ దేవస్థానంలో పాలక మండలితో పాటు చాలా ఆలయాలకు పాలకమండళ్లను నియమించాల్సిన అవసరం ఉంది. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం కూడా పలువురు ఆశగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గస్థాయి అసైన్మెంట్ కమిటీలు, మండల, డివిజన్, జిల్లాస్థాయి ఆహార సలహా కమిటీలను నియమించాల్సి ఉంది. వీటితోపాటు ఇంకా పలు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం చేపట్టలేదు. ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ లను కూడా భర్తీ చేయాల్సి ఉంది. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ను నియమించినా, ఇంతవరకు పాలకమండలి సభ్యులను నియమించలేదు. గత ఎన్నికలలో చిత్తూరు జిల్లా నుంచి ఒక బీసీ నేతలకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. పలువురు నాయకులు టిక్కెలను ఆశించారు. కావున నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆ వర్గ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నేపథ్యంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరుకు భాగా నామినేటెడ్ పదవులు లభించే అవకాశం కనిపిస్తున్నాయి.

పో రై గంగ 1 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. (ఫైల్ ఫోటో) 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *