19, ఫిబ్రవరి 2025, బుధవారం

రూ. 15 వేల రూపాయల పించాన్లలో 60 శాతం బోగస్

జిల్లాలో 1100 మంది అనర్హులుగా గుర్తింపు 

1930లో 830 మందే నిజమైన లబ్దిదారులు 

725 మంది రూ.6 వేల పించన్లకు మాత్రమే అర్హులు 

నిక్షేపంగా, ఆరోగ్యంగా ఉన్న 357 మందికీ పించన్లు 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

 దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల కారణంగా మంచాలకు, మూడు చక్రాలకు పరిమితమైన దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం చిత్తూరు జిల్లాలో పూర్తయింది. డాక్టర్ల బృందాల పరిశీలనలో విస్తుపోయే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 వేల రూపాయలు పింఛన్లు తీసుకుంటున్న వారిలో 60 శాతం మంది అనర్హులుగా డాక్టర్ల బృందాలు తేల్చాయి. ఇందులో 725 మంది 6000 పింఛన్లకు మాత్రమే అర్హులుగా నిర్ధారించాయి. మరో 357 మంది బోగస్ సర్టిఫికెట్లతో ఎలాంటి అంగవైకల్యము వ్యాధి లేకుండా పూర్తి ఆరోగ్యముతో ప్రభుత్వ పింఛన్లను మెక్కుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు జిల్లాలో 15 వేల రూపాయల పింఛన్లను పరిశీలించిన డాక్టర్ల బృందం నివేదికను అందజేసింది. దీంతో మార్చి నెల నుంచి అనర్హులు అయిన 1100 మందికి  పింఛన్లు కట్ కానున్నాయి. 

జిల్లాలో  పక్షవాతం కారణంగా చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం అయిన వారు 1010 మంది,  తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితులు 920 మంది, మొత్తం 1930 మంది పించన్లు తీసుకుంటున్నారు. వీరు  నెలకు రూ.15,000 పెన్షన్ అందుకుంటున్నారు. ఈ పించన్ల మీద అందిన ఫిర్యాదుల మేరకు వీటి పరిశీలనకు   జిల్లా స్థాయిలో 10 డాక్టర్ల బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జిల్లాల్లో 15 వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తనిఖీ చేశాయి. రోజుకు 25 నుంచి 30 మంది పెన్షనర్ల వివరాలను యాప్ లో నమోదు చేశారు. ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్స్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వీరిని వెరిఫికేషన్ చేశారు.  ప్రతి మెడికల్ టీంతో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌ను  జత చేశారు. జిల్లా స్థాయిలో షెడ్యూల్‌ను జిల్లా స్థాయి సమన్వయ కమిటీ రూపొందించింది. మండల, మున్సిపాలటీ స్థాయిల్లో షెడ్యూల్‌ మేరకు మెడికల్ టీంను కూడా జిల్లాస్థాయి సమన్వయ కమిటీనే నియమించింది. ఒక మెడికల్ టీం ప్రతి రోజు కనీసం 25 పెన్షనర్లను వెరిఫై చేసింది.  తేదీల వారీగా ఆయా పెన్షనర్ల మ్యాపింగ్ జరిగేలా చూసుకోవల్సిన బాధ్యత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. పెన్షన్స్‌ను మొబైల్ అప్లికేషన్ ద్వారా వెరిఫికేషన్ చేశారు. ఈ పరిశీలనలో  1190 పెన్షన్లలో 1100 మంది అనర్హులుగా తేలారు. 830 మంది మాత్రమే అర్హులుగా నిర్ధారణ అయింది. ఇందులో 725 మంది 6000 రూపాయలకే రూపాయల పెన్షన్లకు అర్హత ఉండగా, వారికి 15 వేల రూపాయలు అందచేస్తున్నట్లు నిర్ధారించారు. మరో 357 మందికి ఎలాంటి అంగవైకల్యం, అనారోగ్యము లేదని సంపూర్ణ ఆరోగ్యవంతులని ఈ బృందాలు తేల్చాయి.ఈ వెరిఫికేషన్ అయిన తరువాత 5 శాతం పెన్షన్లను ర్యాండమ్‌గా వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఒక టీంను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కూడా అనర్హులు తీరితే ఆ టీంలోని డాక్టర్ల మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. పెన్షన్లు, రాయితీల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఏదోలా సదరం సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు. అక్రమ సర్టిఫికెట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండిపడుతోంది. వీటిపై ఆనేక ఫిర్యాదులు అందడంతో కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. తనిఖీలకు ఆదేశించడంతో ఈ కేటుగాళ్లలో భయం నెలకొంది. ఈ సర్టిఫికెట్లు ఎక్కువుగా చెవిటితనానికి సంబంధించినవే ఉన్నాయి. గతంలో వినికిడిలోపం ఉంటే ఇట్టే తెలిసి పోయేది. సరిగ్గా వినిపించేందుకు చెవులకు మిషన్లు పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు చెవి లోపల పెట్టుకునే చిన్న మిషన్లు వచ్చాయి. ఇవి బయటకు కనిపించవు. చాలామంది ఈ లోపం లేనప్పటికీ ఈ మిషన్లు పెట్టుకుని సర్టిఫికెట్ల కోసం లోపం ఉన్నట్లు నటిస్తున్నారు. ఆడియోగ్రాఫ్‌ రికార్డు తీసుకొచ్చి వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. వారి దగ్గర మిషన్లు బయటకు తీసి నటిస్తున్నారు. చిన్న లోపం ఉన్నప్పటికీ దాన్ని పెద్దగా చూపించి రాజకీయ ఒత్తిళ్లు, కాసులిచ్చి సర్టిఫికెట్‌లను పట్టేస్తున్నారు. ఇక రైల్వే రాయితీల కోసం కేటుగాళ్లు ఎన్నో ఆడ్డదారులు తొక్కుతున్నారు. సదరం సర్టిఫికెట్‌ లేకుండానే ఆస్పత్రుల సూపరిడెండ్‌ంట్‌లను సంప్రదించి రైల్వే రాయితీ ఫారాల మీద సంతకాలు పెట్టిస్తున్నారు. ఇలాంటి సర్టిఫికెట్లు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి తీసుకొచ్చి రైల్వే టిక్కెట్లలో రిజర్వేషన్‌ పొందడంతో పాటు దర్జాగా ఏసీ కోచ్‌లలో ప్రయాణం చేస్తున్నారు. మేనరికం, జన్యు లోపం, పౌష్టికఅహార లోపం వల్ల చాలామందికి పుట్టికతోనే వైకల్యం వస్తుంది. మరికొందరికి ప్రమాదాల్లో, ఇంకొందరికి పక్షవాతం వల్ల, కీళ్ల సంబంధిత వ్యాధుల కారణంగా వైకల్యం ఏర్పడుతుంది. ఇలాంటి వారిని పరీక్షించి ఎంతశాతం వైకల్యం ఉందన్నది వైద్యులు నిర్ధారించి సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. గతంలో ఈ సర్టిఫికెట్‌ల జారీలో పెద్ద ఎత్తున అవి నీతి జరిగింది. అయితే సదరం విధానం రావడంతో వీటికి గండిపడింది. వైద్యులు అన్ని పరీక్షలు చేసిన తరువాతే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ సర్టిఫికెట్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న వాదనలు వినిపించాయి. వైసీపీ నాయకుల ఒత్తిళ్ళ వల్ల కొంత మంది వైద్యులు ఎక్కువశాతం వెకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు ఇచ్చారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇందుకు కారణం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల కోసమే. 20 నుంచి 30 శాతం వైకల్యం ఉన్నప్పటికీ 45 శాతం దాటి సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. ఈకారణంగా దివ్యాంగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా లోకోమోటర్/ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, దృష్టి లోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, మల్లీపుల్ డిజిబులిటీ,  మల్టీడిఫార్మిటీ లెప్రసీ 35,277 మంది పెన్షనర్లు ఉన్నారు. గతంలో పెన్షన్‌ రూ. 1000 ఉండేది. 2014లో ప్రభుత్వం దీన్ని రూ.2వేలు చేసింది. గత ప్రభుత్వం రూ.3 వేలు చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీన్ని రూ.6వేలకు పెంచింది. దీంతో కొంత మంది కేటు గాళ్లు అక్రమమార్గాల వైపు వెళ్లుతున్నారు. కొంతమంది లంచం ఇచ్చి సర్టిఫికేట్‌ పొందితే, మరికొందరు రాజకీయ నేతల ఆండదండలతో సర్టిఫికెట్లను సంపాదిస్తున్నారు. వీటిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తనిఖీలకు ఆదేశించింది. వాస్తవాలు పరిశీలించి అర్హులైన లబ్థిదారుల్ని మాత్రమే ఎంపిక చేయాలని ఆదేశించింది. 6 వేల రూపాయల  పింఛన్ లబ్ధిదారులలో అనర్హులను తేల్చడానికి చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుత్తూరు ఏరియా ఆసుపత్రులలో రోజుకు 50 మంది వంతున వికలాంగుల పరిశీలన కార్యక్రమం జోరుగా సాగుతోంది. దీంతో బోగస్ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్న కేటుగాళ్లలో గుబులు ప్రారంభమైంది.




 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *