మాతృభాషను కాపాడుకోవడం మనందరి భాద్యత
నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవ రాయలు చెప్పిన.. చెయ్యేతి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా.. అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.
నీతి, నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాష లేనిదే మానవజాతికి వికాసం లేదు. అన్యభాషలు ఎన్ని నేర్చినప్పటికీ.. మాతృభాషలో ప్రవీణుడు కానివాడు… విజ్ఞాన సముపార్జన చేయలేడు. అలాంటి తల్లిభాష నేడు తల్లడిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా వేలకొద్ది మాతృభాషలు కనుమరుగయ్యే స్థితిలో వున్నాయంటూ యునెస్కో హెచ్చిరిస్తోంది. ఆంగ్లభాష అనే రోడ్డు రోలర్ కిందపడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగు అయ్యాయని ఇటీవలి యునెస్కో సర్వే తేల్చింది. ఈ మధ్య ప్రతి పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం. తెలుగు భాష మాతృ భాషను పాఠశాలల్లోనూ సజీవంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష కనుమరుగు కాకుండా ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ సందర్బంగా వేమన, సుమతీ శతకాలు వంటి పద్యాలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మరో వైపు అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేల స్థానిక భాషలున్నా.. కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. ఈ రోజును ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ, వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే, తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి నాలుగేళ్లపాటు సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం.. మేధావుల్ని, అధ్యాపకులను జైళ్లలో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులైపారింది. మాతృభాష పరిరక్షణ కోసం నలుగురు యువ కులు అసువులు బాశారు. చివరికి దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలు చేసింది. అయితే, 1953 నుంచే బంగ్లాదేశ్ ప్రజలు ఫిబ్రవరి 21ని మృతవీరుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఆ దేశ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాష దినోత్సవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు భారత్, పాక్ సహా 28 దేశాలు మద్దతిచ్చా ఆ సంఘటనను పురస్కరించుకుని యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినో త్సవంగా ప్రకటించింది. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు అంతర్థానమయ్యే స్థితిలో వున్నాయి. ఆంగ్లభాష అనే రోడ్డు రోలర్ కిందపడి ఇప్పటికే బక్కచిక్కిన మాతృభాషలెన్నో నలిగి కనుమరుగైపోయాయని.. ఇటీవలి యునెస్కో సర్వే తేల్చింది. ప్రపంచంలో సుమారు ఏడు భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 3 వేల భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఈ భాషల జాబితాలో తెలుగు భాష ఉందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో ముప్ఫై శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగుకు ఆ పరిస్థితి రాబోతుందని ప్రకటించింది. ఇది తెలుగు భాషాభిమానులను కలవరపర్చే విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోందట. భారత్‌లో నలభైకి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గదబ, నైకీ అనే గిరిజనతెగల భాషలున్నాయి. పదివేల మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసి పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. నీతి, నియమాలు, నడవడిక నేర్పే మాతృ భాషలు అంతరిస్తే.. మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సైన్స్, కంప్యూటర్, గణితం.. ఇలా ఏ సబ్జెక్టు కూడా మంచి చెడుల గురించి చెప్పవు. మంచి, చెడు విడమరిచి చెప్పేది మాతృభాష ఒక్కటే. మన తెలుగు భాషనే తీసుకుంటే.. మనిషి వికాసానికి కావాల్సిన నీతి నియమాలన్నీ పురాణేతిహాసాల రూపంలో మన మాతృభాషలోనే మిళితమై వున్నాయి. అలాంటి మాతృభాష అంతర్థానమైతే.. మన మనగడే ప్రశ్నార్థకం అవుతుంది. భాష.. కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది. సమాజం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అయితే.. భాషలు అంతరించిపోతున్నాయి. భాష అంతరించిదంటే.. ఆ భాష మాట్లాడే సమూహం అంతరించినట్లేనని భావించాలి. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుందని,.. స్వభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని’ గాంధీజీ 1938లోనే చెప్పారు. మొదట నేర్చుకునే మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషల్ని అంత గట్టిగా నేర్చుకోగలరని మెకంజి, వాకర్ లాంటి భాషా శాస్తవ్రేత్తలు చెప్పిన మాట. సాథియాసీలన్, కీసర్ ఎట్ ఆల్ లాంటి పరిశోధకులు కూడా ఇతర భాషలకన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్ధ్యం ఎవరికైనా ఎక్కువగా వుంటుందన్నారు. మాతృభాషలోనే ఆలోచించగలరు, కలలు కనగలరు, ఆ పునాదితోనే భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు కదలగలరని చెప్పారు. మాతృభాషలో విద్యను బోధిస్తే మానసిక వికాసానికి, సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదం చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి పరమావధి కావాలి. ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష 40 సంవత్సరాల్లో నశించి పోతుందని యునెస్కో అధ్యయనం శాస్త్రీయంగా చాటింది. ఆర్థిక, సాంకేతికాభివృద్ధుల కారణంగా విదేశాల్లో అవకాశాలు పెరుగుతూ, విదేశాల్లోని అవసరాలు మన దగ్గరకు వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుధైక కుటుంబంలా తయారవుతూ, ఒకే భాషా, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతోంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం అంతా మనకు దగ్గరవుతోండగా, మన భాష మాత్రం మనకు దూరమవుతోంది. భాషాసంస్కృతులు ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి మారుతోన్న మన సంస్కృతితో బాటుగా మన భాష కూడా మారుతోంది. ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడితే, ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులను చూస్తున్నాం. అమ్మభాష అంటే అందరికీ ఇష్టమే! తెలుగు మాటలూ, పాటలూ కూడా మనకు మక్కువే! తెలుగు భాష మనుగడను కాపాడుకుందాం. మన పిల్లలకు తెలుగు నేర్పుదాం. తెలుగులోనే మట్లాడుకుందాం. తెలుగు దిన, వార, పక్ష, మాస పత్రికలను ఆదరిద్దాం. ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులోనే చేద్దాం. ప్రభుత్వం కూడా జీవోలను తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించడం అసదాయకం. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా తెలుగులోనే జరపడం శ్రేయస్కరం. కవులను, కళాకారులను ప్రోత్సహించాలి. కవిత్వాన్ని, అవదాన ప్రక్రియను ఆదరించాలి. మన పిల్లలకు పురాణాలు, ఇతిహాసాల గొప్పతనాన్ని గురించి తెలియచెప్పాలి. కోర్టులలో వాదోపవాదాలు, తీర్పులు కూడా తెలుగులో ఉంటే మరింత బాగుంటుంది. ప్రభుత్వం పౌరులకు జారీ చేయు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు కూడా తెలుగులోనే జారీ చేస్తే తెలుగు భాషను ప్రోత్సహించినట్లు అవుతుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెబ్సైట్ కూడా ఆంగ్లంలోనే ఉన్నాయి. వాటిని కూడా తెలుగులో రూపొందించడం అవసరం.

