5, ఫిబ్రవరి 2025, బుధవారం

సంక్షోభంలో జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు



ఆగిపోయిన మామిడి పల్ప్ ఎగుమతులు  

పేరుకుపోతున్న మామిడి పల్ప్ నిల్వలు

మామిడి రైతులకు ఇంకా అందని బిల్లులు 

పునః ప్రారంభానికి ఫాక్టరీలకు పెట్టుబడి కొరత 

మామిడి మిద ఎక్కువ ఖర్చు వద్దని సమాఖ్య విజ్ఞప్తి 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

సుబ్బి పెళ్లి ఎంకి  చావుకు వచ్చింది అన్నట్లు  చిత్తూరు జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల పరిస్థితి తయారయింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా చిత్తూరు జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు సంక్షోభంలో కొరుకుపోయాయి. జ్యూస్ ఫ్యాక్టరీలలో తయారైన మామిడి పల్ప్ నిల్వలు ఎగుమతికి నోచుకొక పేరుకుపోతున్నాయి. మామిడి పల్ప్ అమ్మకాలు ఆగిపోవడంతో జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు కొన్ని గత సంవత్సరం రైతుల నుంచి తీసుకున్న మామిడి కాయలకు  ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న సీజన్ లో మామిడి గుజ్జు పరిశ్రమల పునః ప్రారంభం సందేహంగా మారుతోంది. గత సంవత్సరం జిల్లాలో మామిడి పంట చాలా తక్కువ వచ్చింది. ఈ సంవత్సరం మామిడిపంట భారీగా వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడి గుజ్జు పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోవడంతో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

చిత్తూరు జిల్లాలో 1.50  లక్షల ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా, ఉమ్మడి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న మామిడి తోటల నేపద్యంలో మామిడికాయలను పల్ప్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 47 మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవి 2023లో 8 లక్షలు మెట్రిక్ టన్నుల మామిడికాయలను కొనుగోలు చేసి తద్వారా నాలుగు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. 2024 సంవత్సరంలో మామిడి పంట గణనయంగా తగ్గింది. దీంతో నాలుగు లక్షల మామిడి కాయలను క్రస్సింగ్ చేసి రెండు లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అయిన పల్ప్ ఎక్కువగా యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అలాగే కొంత గల్ఫ్ దేశాలకు,  సింగపూర్ కూడా ఏగుమతి అవుతుంది. జిల్లాలో తయారయ్యే మామిడి పల్పు మనదేశంలో వినియోగం చాలా తక్కువ. మన దేశంలోని స్లైడ్, మాజా, రియల్, ఫ్రూటీ, గల్లా  వంటి జ్యూస్ లు తయారు చేస్తారు. వీటిల్లో వాడకం అంత ఆశాజనకంగా లేదు. ఇదివరకు ఈ జ్యూస్ లో మామిడి పల్పును18 నుంచి 20 శాతం ఉపయోగించేవారు. ప్రస్తుతం సగానికి పైగా మ్యాంగో బల్బును తగ్గించారు. ప్రస్తుతం పది నుంచి 12 శాతం మాత్రమే ఉపయోగించి ఈ జ్యూస్ లను తయారు చేస్తున్నారు. గత సంవత్సరంగా జరుగుతున్న అమాస్ ఇజ్రాయిల్ యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్దాల కారణంగా ఇతర దేశాలకు చిత్తూరు నుండి మ్యాంగో పల్ప్ ఎగుమతి ఆగిపోయింది. గత రెండు సంవత్సరాలలో తయారైన మామిడి పళ్ళు ఇంకా 2.85 లక్షల టన్నుల నిల్వ ఉంది. ప్రస్తుతం శీతాకాలం కొనసాగుతున్నందున శీతల పానీయాల అమ్మకం పెద్దగా లేదు. శీతల పానీయాల అమ్మకాలు పెరిగిన మామిడి జ్యూస్ తాగే వారి శాతం చాలా తక్కువ. తంసప్, కోకోకోలా, స్పైట్ వంటి శీతల పానీయాలకే డిమాండ్ ఎక్కువ. రానున్న వేసవిలో 10 శాతం వరకు మామిడి పల్ప్ వినియోగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇతర దేశాలకు రెడ్ సీ ద్వారా మామిడి పల్ప్ ఎగుమతి జరిగేది. యుద్ధాల కారణంగా రెడ్ సీలో నాలుగు కంటైనర్లను బాంబులు వేసి ధ్వంసం చేశారు. దీంతో అటువైపు కంటైనర్ల రాకపోకలు ఆగిపోయింది. ప్రస్తుతం శ్రీలంక మీదుగా గల్ఫ్, యూరప్ దేశాలకు మామిడి పల్పును ఎగుమతి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎగుమతి వ్యయం భారీగా అంటే ఎనిమిది రెట్లు వరకు పెరిగింది. గల్ఫ్ లోని యామన్ పోర్టు యుద్ధం కారణంగా ధ్వంసం అయింది. ప్రస్తుతం ఆ పోర్టు ద్వారా దిగుమతి దిగుమతి ఆగిపోయాయి. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లే పల్ప్ ఎక్కువగా యామన్ పోర్టు ద్వారా ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం నిల్వ ఉన్న మామిడి పల్ప్ కు ఎగుమతి ఆర్డర్లు వచ్చిన, ఎగుమతి చేయడానికి తగినన్ని కంటైనర్లు అందుబాటులో లేవు. మన దేశంలో నుంచి గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లిన కంటైనర్లకు తిరుగు బాడుగ లభించకపోవడంతో అక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో పేరుకుపోతున్న మామిడి పల్ప్ నిల్వలు మరోవైపు జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులకు భారంగా మారాయి. వాటికి గోడౌన్ల అద్దెను చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు మామిడి సరఫరా చేసిన రైతులకు బిల్లులు చెల్లించాలని ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమ సమైఖ్య ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకువెళ్లారు. జూస్ ఫ్యాక్టరీలకు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను రెన్యువల్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఈ విషయమై జిల్లా కలెక్టర్ రెండు మూడు సార్లు బ్యాంకు అధికారులకు లేఖలు రాసిన, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలలో ఉన్న మామిడి పల్ప్ ఖాళీ అయితే తప్ప రానున్న సీజన్ లో జ్యూస్ ఫ్యాక్టరీలు తిరిగి మామిడి ప్రారంభించే అవకాశాలు తక్కువ. మరోవైపు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ప్రారంభానికి పెట్టుబడి  లేకుండా యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. మామిడికాయలు సరఫరా చేసిన రైతులకు  వెంటనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద జ్యూస్ ఫ్యాక్టరీలు అప్పులు తీసుకొని రైతులకు చాలావరకు చెల్లించారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించలేక సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితులలో రానున్న  సీజన్ లో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల పునః ప్రారంభం సందేహంగా మారింది. ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో మామిడిపంట గణనీయంగా రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం జిల్లాలో 4 వేల మెట్రిక్ టన్నులు క్రస్సింగ్ చేశారు. ఈ సంవత్సరం పై మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు 8వేల మెట్రిక్ టన్నులకు పైగా  కాయలు వచ్చే అవకాశం ఉంది. వాటిని పల్పుగా తయారుచేసి నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా కొన్ని ఫ్యాక్టరీలకు లేదు. దీంతో జిల్లాలోని మామిడి రైతుల భవిష్యత్తు ఆందోళనకరంగా, అగమ్యగోచరంగా తయారైంది. 


*జ్యూస్ పరిశ్రమల పరిస్థితి బాగాలేదు* 


 జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రానున్న సీజన్లో మామిడి గుజ్జు పరిశ్రమల పునః ప్రారంభానికి తగిన పెట్టుబడి కూడా లేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల పల్ప్ నిల్వలు పేరుకుపోయాయి. బ్యాంకులు గతంలో ఇచ్చిన రుణాల చెల్లించాలని వత్తిడి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప జిల్లాలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు గడ్డు పరిస్థితి నుంచి  గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు రోజుకు ఒకసారి పాలకు బదులుగా మామిడి జ్యూస్ ను సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. అలాగే ప్రసిద్ధ దేవాలయాల్లో, టూరిజం ప్రాంతాలలో తమకు స్టాల్స్  కేటాయించాల్సిందిగా కోరాము. మధ్యాహ్న భోజన పథకంలో ఒకరోజు విద్యార్థులకు మామిడి జ్యూస్ సరఫరా చేయాలని మనవి చేశాం. ఇలా చేస్తే కొంతవరకు మామిడి గుజ్జు పరిశ్రమకు చేయూత ఇచ్చిన వాళ్ళు అవుతారు. మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది.  ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద రానున్న సీజన్ కు మామిడి రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మామిడి రైతులు ఈ సీజన్లో మామిడి మీద ఎక్కువ ఖర్చు చేయవద్దని జిల్లా పండ్ల పరిశ్రమ సమాఖ్య తరఫున మామిడి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

*గోవర్ధన బాబి,* 

*సౌత్ జోన్ చైర్మన్, ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెస్ అసోసియేషన్,* 

*ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య.*

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *