క్యాన్సరుకు చికిత్స కన్నా, నివారణ మిన్న
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2025లో ‘క్యాన్సర్ నియంత్రణలో ఆటంకాలను అధిగమిద్దాం’ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నియంత్రణ కృషి జరుగుతోంది. మన రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో క్యాన్సర్ సంపూర్ణ నివారణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అనుమానితులను ఆరోగ్యశాఖ గుర్తించి, పరీక్షలు చేయగా ఈ పరీక్షల్లో ప్రతి వంద మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా నిర్థారణ అయ్యింది. హెచ్‌బిసి వ్యాక్సిన్ ద్వారా కూడా క్యాన్సర్‌ను నియంత్రించొచ్చు. క్యాన్సర్ వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవటం కాకుండా రాకముందే నివారణా చర్యలు తీసుకోవటం మంచిది. 50 సంవత్సరాలు పైబడిన పురుషులకు ఏడాదికి ఒకసారి రక్తనమూనా పరీక్ష ద్వారా క్యాన్సర్ ఉందో, లేదో తెలుసుకోవడం చాలా మంచిది.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా క్యాన్సర్ చికిత్సలు పొందేవారు 15 ఏళ్లలో 70 శాతం పెరిగారు. 2009-10లో 27,097 మంది, 2024-25లో 46,223 మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఏటా సగటున 45-50 వేల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. క్యాన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువ. వీరిలో బ్రెస్ట్, సర్వేకల్, ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం. 2009-10లో 67,218 కేసులు నమోదు కాగా, 2024-25లో 2,22,605 వచ్చాయి. పురుషులకు ఎక్కువగా తల, మెడ, నోరు, గొంతు, ప్రొస్టేట్, ఊపిరితిత్తులు, పొట్ట చిన్నపేగు, పురుషాంగం, పెద్దపేగు క్యాన్సర్లు వస్తున్నాయి. వీరు సర్జికల్, కీమో, రేడియోథెరపీ లాంటి చికిత్సలు పొందుతున్నారు. కొందరికి రెండుసార్లు శస్త్రచికిత్సలు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో క్యాన్సర్ సంపూర్ణ నివారణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పది నెలలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ 19,447 మంది నోటి క్యాన్సర్, 15,401 మంది రొమ్ము క్యాన్సర్, 17,373 మంది గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అనుమానితులను ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ పరీక్షల్లో ప్రతి వంద మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా తేలారని గుర్తించింది. ఇప్పటివరకూ 53,07,448 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, వారిలో 52,221 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించింది. ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు వీలుగా ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారికి నోటి, రొమ్ము క్యాన్సర్, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతోంది.
కారణాలు..
పొగాకు ఉత్పత్తుల వాడకం, స్థూలకాయం, కుటుంబ చరిత్ర, క్రమం తప్పిన జీవనశైలి, గాలి, నీరు, ఆహార కాలుష్యం అనేవి చాలా రకాల క్యాన్సర్లకు సాధారణ కారకాలుగా పరిగణించబడుతున్నాయి. మారుతున్న జీవనశైలి కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, గాలిలో కాలుష్యం గణనీయంగా దోహదం చేస్తుంది. సూక్ష్మ నుసి ప్రభావానికీ ఊపిరితిత్తుల క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల ముప్పు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. వాయు కాలుష్యంతో కొందరిలో మూత్రాశయ, ప్రొస్టేట్, రక్త క్యాన్సర్ల ముప్పు పెరుగుతోంది. మనదేశంలో వాహనాలు, పరిశ్రమల వల్ల, కలప వంటివి మండించటంతో గాలి కాలుష్యానికి దారితీస్తున్నాయి. వీటి నుంచి వెలువడే పొగలో బెంజీన్, పార్మల్‌డీహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి క్యాన్సర్ కారకాలుంటాయి. దీర్ఘకాలం వీటి ప్రభావానికి గురైతే కణాల్లో మార్పులు సంభవిస్తాయి. ఇవి చివరికి క్యాన్సర్‌గా పరిణమిస్తాయి. పిల్లలు, వృద్ధులు, జబ్బులతో బాధపడేవారి మీద ఈ కాలుష్యం మరింత ప్రభావం చూపుతుంది. కాబట్టి గాలి కాలుష్యాన్ని తగ్గించటం, దీని ప్రభావానికి గురికాకుండా చూసుకోవటం అందరి తక్షణ కర్తవ్యం. సాధారణంగా రోడ్లపై అమ్మే చిరుతిళ్లు తింటుంటారు. పునుగులు, బజ్జీలను ఆరగిస్తుంటారు. నూనెలను ఎక్కువసార్లు మరిగించటం, వాడిందే వాడటం వల్ల అందులో కెమికల్స్ కొన్ని అనారోగ్యానికి, మరికొన్ని హానికరమైన క్యాన్సర్ కారకాలు తయారవుతాయి. వీటితో తయారైన ఆహారపదార్థాలను తినటం ద్వారా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. వ్యవసాయంలో భాగంగా రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పరిమితికి మించి పురుగుమందులను పిచికారీ చేస్తుంటారు. తద్వారా భూమి, నీటిలోకి ఆయా క్రిమిసంహారకాలు చేరతాయి. వర్షపునీటి ద్వారా కూడా చేరతాయి. రైతులు వ్యవసాయ మోటార్లను వాడే క్రమంలో భూమిలో నీరే కదా అని తాగేస్తుండటం వల్ల క్రిమిసంహారకాలు నీటిలో ఉండటంతో అవి తాగి అనారోగ్యం పాలవుతారు. అలాగే పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్య కారకాలు, వ్యర్థాలు కూడా భూగర్భ జలాల్లో కలవటం వల్ల క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. ఇలాంటి క్రిమిసంహారకాలు కలిగిన నీటిని తాగినా క్యాన్సర్ కణాలు వ్యాపిస్తాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. మనదేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఒక ఎత్తయితే, వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి. రసాయన చికిత్స కీమోథెరపీ క్యాన్సర్ చికిత్సలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, లక్ష్యిత చికిత్స, ఇమ్యూనోథెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్ సంరక్షణలో సర్వైవల్ రేటును మెరుగుపరచడం ద్వారా అత్యంత ప్రభావవంతమయ్యాయి.
చికిత్సా పద్ధతులు..
క్యాన్సర్ చికిత్సలు మూడు పద్ధతుల్లో జరుగుతాయి..1. సర్జరీ 2. కీమోథెరపీ, 3. రేడియేషన్. అన్ని క్యాన్సర్లకు ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. క్యాన్సర్‌ను బట్టి పేషెంట్ శారీరక స్థితిగతులు బట్టి, అవయవాల తీరును బట్టి, క్యాన్సర్ దశను బట్టి చికిత్స విధానం మారుతూ ఉంటుంది. కొన్ని క్యాన్సర్లకి సర్జరీ, మరికొన్ని కేసులకు కీమోథెరపీ, ఇంకొన్నింటికి రేడియేషన్ అనేది ముఖ్యమైన చికిత్స అవుతుంది. చాలామంది రోగుల్లో ఈ మూడు పద్ధతులు కలిపి చేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల రోగుల్లో ఏదో ఒక రెండు పద్ధతుల చేయాల్సి ఉంటుంది. మూడింట ఒక వంతులో ఏదో ఒక పద్ధతి ద్వారా మాత్రమే చికిత్స చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. రేడియేషన్ అవసరమవ్వొచ్చు. రెండూ కలిపి చేయాల్సి రావొచ్చు. కొంతమంది రోగులకు అసలు సర్జరీయే లేకుండా రేడియేషన్ చికిత్స, ఇంకా కీమోథెరపీ కలిపి చేయాల్సి వస్తుంది. మరికొంత మందికి మూడు పద్ధతులూ కలిపి చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించటం అన్నింటికన్నా ముఖ్యం. తద్వార పూర్తిగా నయం చేయటానికి వీలుంటుంది.
క్యాన్సర్ వ్యాక్సిన్లు
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా హెచ్‌పివి సర్వైకల్ వ్యాక్సిన్ దోహదపడు తుంది. 99 శాతం క్యాన్సర్లు రాకుండా ఆపొచ్చు. ఫీమేల్ మామోగ్రఫీ ద్వారా బ్రెస్ట్ ఎక్సరేతో రొమ్ముల్లో ఉండే గడ్డలను గుర్తించొచ్చు. హెచ్‌బిసి వ్యాక్సిన్ ద్వారా కూడా క్యాన్సర్‌ను నియంత్రించొచ్చు. క్యాన్సర్ వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవటం కాకుండా రాకముందే నివారణా చర్యలు తీసుకోవటం మంచిది. 50 సంవత్సరాలు పైబడిన పురుషులకు ఏడాదికి ఒకసారి రక్తనమూనా పరీక్ష (పిఎస్‌ఎ) ద్వారా క్యాన్సర్ ఉందో, లేదో తెలుసుకోవచ్చు.
క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి?
ప్రమాదకర క్యాన్సర్ సంకేతాలను ఇలా గుర్తించవచ్చును. శరీరంలో ఎక్కడైనా పుండు ఏర్పడి, అది తగ్గకపోవడం, పుట్టుమచ్చలు రంగు మారడం, మచ్చల పరిమాణంలో మార్పులు, మల, మూత్ర సమయాల్లో మార్పులు. రక్తం పడటం, విరేచనం నల్లగా కావడం, మింగడం కష్టంగా అనిపించడం. అరుగుదల సరిగ్గా లేకపోవడం, మహిళల్లో అసాధారణ రక్తస్రావం, తెలుపు అధికంగా కావడం, శరీరంలో ఏభాగంలోనైనా వాపుగానీ, ముఖ్యంగా మహిళలకు రొమ్ముల్లో గడ్డలు, అలసటగా అనిపించడం, బరువు తగ్గటం, గొంతు బొంగురు పోవడం, రక్తహీనత, ఎడ తెగని దగ్గు ఉంటే, క్యాన్సర్ కావచ్చు. వాటిని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. అక్కడ పరీక్ష చేయించుకొని నిర్ధారణ చేసి, తగిన చికిత్స తీసుకుంటే క్యాన్సర్ నయం అవుతుంది.
పో రై గంగ 1 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం లోగో

