7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

జిల్లాలో ప్రయగాత్మకంగా కోకో పంట

క్యాడ్బరీ చాక్లెట్లు, బేకరీ పదార్థాలలో  వినియోగం 

కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటగా 

హెక్టారుకు రూ 30 వేల సబ్సిడీ 

ఇప్పటికే కార్వేటి నగరం, గొల్లపల్లిలో పంట 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా కోకో పంటను పండించడానికి ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై రైతులను అవగాహన కలుగజేస్తున్నారు .చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలు ఇందుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని బంగారుపాళ్యం, తవణంపల్లి, గంగాధర నెల్లూరు, ఎస్ఆర్ పురం, కార్వేటి నగరం, పాలసముద్రం మండలాల్లో ప్రయోగాత్మకంగా కోకో పంటను పండించనున్నారు. జిల్లాలో ఇప్పటికే కార్వేటి నగరంలో 8 సంవత్సరాల కోకో పంట ఉంది. అలాగే బంగారుపాళ్యం మండలం గొల్లపల్లిలో ఐదు సంవత్సరాల కోకో పంట ఉంది. 


మన దేశంలో లక్ష టన్నుల కోకో విత్తనాల డిమాండ్  ఉంది. అయితే మన దేశంలో 25 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇవి కూడా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మాత్రమే లభ్యమవుతున్నాయి. కోకో గింజలను క్యాడ్బరీ చాక్లెట్లు, బేకరీ పదార్థాలు గోధుమ వర్ణం, మాధుర్యం రావడానికి వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో  ఈ పంటను ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో పండించారు. పంట అద్భుతంగా వచ్చింది. అత్యధిక నాణ్యత కలిగిన కోకో విత్తనాలు దిగుబడి అయ్యాయి. దీంతో రాష్ట్రం మొత్తం  మీద ఈ పంటనువిస్తరించాలని ఉద్యానవన శాఖ అధికారులు ప్రతిపాదించారు.  ఈ పంట కొబ్బరి తోటల, ఆయిల్ ఫామ్ మొక్కలు మధ్యలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కోకో పంట సాగుకు తేమతో కూడిన ఉష్ణమండల ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. ఒక వరుస పద్ధతి గాని రెండు వరుస పద్ధతుల్లో కొబ్బరి తోటలో అంతరపంటగా హెక్టారుకు 500 మొక్కలు  నాటుకోవచ్చు. కోకో పంట మూడు సంవత్సరాలకు దిగుబడి వస్తుంది. పిందె దశ నుంచి కాయలు కోతకు రావడానికి 5 నెలల సమయం పడుతుంది. ప్రతి కాయలోను 25 నుంచి 40 విత్తనాలు ఉంటాయి. 5 ఏళ్లు పైబడిన తోటల నుంచి స్థిరమైన దిగుబడులు పొందవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడు ఒక్క కోకో మొక్క నుంచి ఏడాదికి 1-2 కిలోల గింజలు పొందవచ్చు. 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. పంట నాటిన మూడవ సంవత్సరం నుంచి కాయలు కాయడం ప్రారంభం అవుతుంది. అయితే ఐదవ సంవత్సరం నుంచి స్థిరమైన పంట వస్తుంది. ఎకరాకు 400 నుంచి 600 కేజీల వరకు  దిగుబడి వస్తుంది.  మార్కెట్లో కోకో విత్తనాల ధర 600 నుంచి 1000 రూపాయల వరకు పలుకుతుంది. క్యాడ్బరీ సంస్థ విత్తనాలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. అలాగే రైతులు కావసరనమైన కోకో మొక్కలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్యాడ్బరీ సంస్థ రైతులకు అందజేస్తుంది. బాగా పక్వానికి వచ్చిన కోకో కాయలను కోసి వారం రోజులపాటు మగ్గ పెట్టాలి. అవి మగ్గిన తర్వాత కాయలను పిసికితే గింజలు వెలుపలికి వస్తాయి. ఆ గింజలను బాగా ఎండబెట్టి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా ఏలూరు నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఒక్క మొక్క ధర 12 రూపాయలు ఉంది. మనకు రవాణాతో కలిసి 20 రూపాయలు పడే అవకాశం ఉంది. అవసరమైన వాళ్ళు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదిస్తే వారు కోకో మొక్కలను తెప్పించి ఇస్తారు. రైతులు అవసరం అనుకుంటే కార్వేటి నగరంలో, బంగారు పాలెం మండలం గొల్లపల్లిలో సాగుతున్న కోకో పంటను పరిశీలించవచ్చు. సాగు దిగుబడి మార్కెటింగ్ వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో భారీగా మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోటలలో లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుంది. కావున రానున్న రోజుల్లో రైతులు మామిడి మొక్కలకు బదులు కొబ్బరి, ఆయిల్ మొక్కలను నాటి, వాటి మధ్యలో కోకో మొక్కలు నాటితే అంతరపంటగా ఉపయోగపడుతుంది. ఆ పంటలకు అదనంగా కోకో మంచి ఆదాయాన్ని ఇస్తుంది రైతుకు లాభసాటిగా ఉంటుంది

రూ. 30 వేల సబ్సిడీ 

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, తవణంపల్లి గంగాధర నెల్లూరు, గుడిపాల, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలు కోకో పంటకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాము. ఈ పంట సాగు చేసుకుంటే హెక్టారుకు 30,000 రూపాయలు సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వ అందచేస్తుంది. కోకో పంట వేసిన రైతులకు మొదటి సంవత్సరం 18 వేల రూపాయలు, రెండు, మూడు సంవత్సరాలలో 6000 రూపాయల వంతున సబ్సిడీ అందజేస్తాము. మూడవ సంవత్సరం నుంచి పంట ప్రారంభమవుతుంది. అవసరమైన రైతులకు మొక్కలను తెప్పించి ఇస్తాము. క్యాడ్బరీ సంస్థ నేరుగా రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంది. అవసరమైన రైతులు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించవచ్చును. 


మధుసూదన రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యానవన  శాఖ


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *