కవర్లు కట్టిన మామిడికి బలే డిమాండ్
సాధారణం కంటే రెట్టింపు ధర వస్తుంది
కంపెనీలు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తాయి
కోడి గుడ్డు సైజు వచ్చిన తరువాత కవర్లు కట్టాలి
50 శాతం సబ్సిడీతో రైతులకు మామిడి కవర్లు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
సాధారణంగా కాపుకు వచ్చిన టేబుల్ రకం మామిడి కంటే మామిడికాయలకు కవర్లు కట్టి సంరక్షిస్తే వాటికి మంచి డిమాండ్ పలుకుతుంది. ఇటివల కాలంలో ప్రయోగాత్మకగా చిత్తూరు జిల్లాలో పలువురు రైతులు మామిడికి కవర్లు కట్టారు. తద్వారా ఈ కాయలకు మంచి ధర పలికింది. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. సాధారణ మామిడికాయలు కంటే కవలలు కట్టిన వాటికీ రెట్టింపుకు పైగా ధరతో వివిధ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. కవర్లు కట్టిన మామిడికాయలు చాలా ఆకర్షణీయగా ఉంటాయి. షైనింగ్ ఉంటుంది. వీటికి దోమ కాటు నుంచి, చీడపీడల రక్షణ ఉంటుంది. మంచి రుచి కూడా వస్తుంది. తద్వారా ఈ మామిడికాయలకు సాధారణ మామిడికాయల కంటే రెట్టింపు ధర మార్కెట్లో వస్తోంది.
జిల్లాలో టేబుల్ రకాలు అంటే, బెర్నిష, ఇమామ్ పసంద్, మల్లిక, ఆల్ఫాన్ష, మల్గూబా కేసరి రకాలను తినడానికి ఉపయోగిస్తారు బెంగుళూర లేక తోతాపురి మామిడిని పల్ప్ కోసం వినియోగిస్తారు. టేబుల్ రకాలకు మంచి ధర కావాలంటే కాయలకు కవర్లు కట్టాలి. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల, వాటికి మంచి రక్షణ లభిస్తుంది. దీంతో పంట దిగుబడి నాణ్యంగా ఉంటుంది. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల, వాటికి వడగళ్లు, ఊజీ ఈగలు, మచ్చలు, తెగుళ్లు సోకవు. మామిడి కాయలకు కవర్లు కట్టడంతో మామిడి కాయలకు మంచి రక్షణతో పాటు పంట దిగుబడి బాగా వస్తుంది. మార్కెట్‌లో కాయలు రెట్టింపు ధర పలుకుతాయి. పల్ప్‌ఫ్యాక్టరీలు ఇచ్చే ధరకంటే ఎక్కువ ధర వస్తుంది. మామిడి కాయలకు కవర్లు కట్టడానికి గోధుమ రంగు కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటక్షన్ బేగ్స్ ఉపయోగిస్తారు. వాటర్ ప్రూఫ్ కలిగి ఉంటాయి. తద్వారా వడగళ్లు, ఊజీ ఈగల నుంచి మామిడి కాయలను రక్షణ ఉంటుంది. అలా కవర్లు కట్టి భద్రం చేసుకుంటే పల్ప్‌ఫ్యాక్టరీలు ఇచ్చే ధరకంటే వీటికి ఎక్కువ పొందవచ్చు. చిత్తూరు జిల్లాలో దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితి మామిడి కాపు బాగా ఆలస్యం అవుతుంది జిల్లాలో ఇప్పటివరకు పూత కూడా పూర్తిస్థాయిలో రాలేదు. అక్కడక్కడ కొత్త మేరకు మాత్రమే మామిడి పూత కనిపిస్తోంది. ఈ సంవత్సరం మామిడి పంట గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగుబడి వచ్చిన కలర్ కాయలకు కవర్లను కట్టి సంరక్షించుకుంటే మంచి ధర పలికే అవకాశం ఉంది. పక్వానికి వచ్చిన మామిడిని ఈగ కాటు వేస్తోంది. ఈగ కాటు వల్ల మామిడికాయ మీద మచ్చలు వస్తాయి. లోపల క్రిములు తయారై కాయను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో కాయ పక్వ దశకు వచ్చి మామిడి కోత కోసి, మాగిన సందర్భంగా మామిడి పండును కోయగానే అందులోంచి ఊజీ ఈగలు పెట్టిన గుడ్డు పురుగుల రూపంలో కనిపిస్తోంది. దీంతో ఆ మామిడి పండ్లను పారబోయాల్సి ఉంటుంది. దీనివల్ల రైతులు, కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఈ ఊజీ ఈగల నుంచి రక్షణగా మామిడి కాయలకు రక్షిత తొడుగులు వినియోగించాలని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకని మామిడి వ్యాపారులు ఇటీవలి కాలంలో రక్షిత తొడుగులున్న మామిడి తోటలకు మొదటి ప్రాధాన్యమిచ్చి కాయలు కొంటున్నారు. బంగినపల్లి, (బేనిషా), మల్లిక, ఇమాంపసందు, మల్గూబా వంటి రకాలకు రైతులు రక్షిత తొడుగులు కట్టుకొంటే వాటికి అత్యధిక ధరలు లభిస్తాయని అధికారులు అంటున్నారు. మిగిలిన మామిడి రకాలు ఎక్కువగా పల్పు ఫ్యాక్టరీలకు విక్రయిస్తుంటారని, వాటికి రక్షిత తొడుగులు కట్టడం వల్ల రైతులకు పెద్దగా లాభసాటిగా వుండదన్నారు. మామిడి బాగా పక్వానికి వచ్చి మరో 20 రోజుల్లో కోతకు వచ్చే దశలో వుండగా తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మేనెలలో ప్రారంభమయ్యే వర్షాలు అధిక గాలితోను, వడగళ్లతో వర్షాలు కురుస్తాయి. మామిడికి చివరి దశలో వడగళ్ల వాన వలన రాలిపోవడం ఒక నష్టం అయితే చెట్టులో ఉన్న కాయలు వడగళ్ల దెబ్బలకు పక్వానికి వచ్చిన దశలో మచ్చలు ఏర్పడి మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. అయితే రక్షిత కవర్లు కట్టిన మామిడి కాయలకు వడగళ్ల వాన కురిసినా ఎటువంటి నష్టం వుండదు. కొన్నేళ్లుగా మామిడికి గిట్టుబాటు ధరలు అందక రైతులు సతమతమవుతున్నారు. అంతేకాక మామిడి తోటల నిర్వహణ వ్యయం కూడా ఏటా పెరిగిపోతోంది. పెరిగిన క్రిమిసంహారక మందులు, కూలీల ధరల కారణంగాను, పూత సక్రమంగా రాకపోవడం, ఒక వేళ పూత వచ్చినా పిందెలు రాకపోవడం, పిందెలు వచ్చినా ఎండల కారణంగా అధిక శాతం రాలిపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే సమయంతో మామిడి కాయలకు కవర్లు కటితే, రైతులకు కొంత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మామిడి కవర్లను సబ్సిడీ మీద ప్రభుత్వం అందజేస్తుంది.
*50 శాతం సబ్సిడీతో మామిడి కవర్లు*
జిల్లాలోని రైతులకు 50 శాతం సబ్సిడీతో మామిడి కవర్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక కవరు రెండు రూపాయల వరకు పడుతుంది. ఇందులో రూపాయి ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. రైతులు రూపాయి వంతున కొనుగోలు చేయవచ్చు. ఒక్కొక్క రైతుకు 6,000 కవర్ల వరకు సరఫరా చేస్తాం. ఇందుకు రైతులు ఆయా మండల ఉద్యానవన శాఖ అధికారులను, రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించి ముందుగా కవర్లను రిజర్వ్ చేసుకోవాలి. మామిడికాయ కోడిగుడ్డు సైజు వచ్చిన తర్వాత ఈ కవర్లను కట్టాలి. రైతులు తోటలో ఈ కవర్లను కట్టిన తర్వాత మామిడి చెట్టు దగ్గర నిలబడి, ఫోటో తీసి రైతు సేవా కేంద్రం ఇంచార్జికి అందజేయాల్సి ఉంటుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ధరను పొందుతారని ఆశిస్తున్నాను.
*మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యానవన శాఖ*.