భాజాపా, జనసేన ఉమ్మడి CM అభ్యర్థిగా పవన్ కళ్యాణ్
చంద్రబాబు మీద దాడిని ఖండించని పవన్
హత్యాయత్నం కేసు మీద స్పందనే లేదు
విశాఖలో ఇద్దరూ ఉన్నా పలకరింపు లేదు
ముఖ్యమంత్రి కుర్చీపై పవన్ కన్ను
పొత్తు కోసం బాబు ఎదురు చూపులు
జనసేనతోనే పొత్తంటున్న పురంధేశ్వరి
జనసేన, భాజాపా ఉమ్మడిగా ఎన్నికలకు
ఎపి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు టీడీపీతో పొత్తు ఉంటుందని డిల్లీలో కూడా చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం పాటిస్తున్నారు. తానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. మరో సారి గాజువాక నుండి పోటిలోకి దిగనున్నట్లు కూడా స్పష్టం చేశారు. పక్షం రోజుల కిందట ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్ళలో తెదేపా అధినేత నారా చంద్రబాబు మీద రాళ్ళ దాడి జరిగినా, జగన్ ఖండించలేదు. బాబు మీదనే దాడి చేసి అయన మీదనే హత్యాయత్నం కేసులు పెట్టినా పవన్ స్పందించలేదు. బాబుకు ఫోన్ కూడా చేయలేదు. ఇంతెందుకు మంగళవారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు విశాఖపట్నంలో విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. అదే సమయంలో పవన్ కూడా వారాహి యాత్రలో విశాఖలొనే ఉన్నారు. ఒకరినొకరు కలవలేదు. ఒకరి గురించి ఇంకొకరు కనీసం ప్రస్తావించలేదు. సంఘీభావం ప్రకటించలేదు. ఫోన్లో పరామర్శ కూడా కరువైంది. ఇదే విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయాలను పరిశీలిస్తుంటే, రానున్న ఎన్నికలలో తెదేపా. భాజపా, జనసేన కలిసి పోటి చేయడం కష్టమనే సంకేతాలు వెలువడుతున్నాయి. భాజపా, జనసేన ఉమ్మడి CM అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల తరువాత కోర్టు కేసుల కారణంగా జగన్ జైలు పాలు కావడం తధ్యమని భాజపా నాయకులు పవన్ కు నచ్చచెప్పినట్లు సమాచారం. అప్పుడు YCP చిన్నాభిన్నం అవుతుందని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఎన్నికల తరువాత వయస్సు రీత్యా చంద్రబాబు కూడా రాజకీయాలకు దూరం అవుతారని పవన్ కు వివరించినట్లు తెలిసింది. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు కూడా ప్రకటించారు. కావున, ఈ అయిదు సంవత్సరాలు భాజపా, జనసేన పార్టీలను పటిష్టం చేసుకుంటే, 2029 ఎన్నికల నాటికీ ప్రబలశక్తిగా ఎదగవచ్చని BJP పెద్దలు హితబోద చేసినట్లు తెలుస్తోంది. 2029ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసే పూచి తమది అని భాజపా నాయకులు బరోసా ఇచ్చారని తెలిసింది. కావున, పవన్ స్వరంలో మార్పులు వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇలాగె ఉంటే తెదేపా, జనసేన పొత్తు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు పవన్ తో పొత్తుకోసం టిడిపి అధినేత చంద్రబాబు ఎదురు చూస్తున్నారని కొందరు అంటున్నారు. అదే సమయంలో బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి బిజెపి జనసేన మధ్య పొత్తు ఉంటుందని ప్రకటించారు. గత నెల శ్రీకాళహస్తి సమావేశంలో నడ్డాతో పాటు పాలోగొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు జిల్లాకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యతిరేకులు. ఈ నేపథ్యంలో టిడిపితో పొత్తు లేకుండా బిజెపి, జనసేన కలసి పోటీ చేయడానికి వ్యూహ రచన జరుగుతున్నట్టు సమాచారం. దీనికి పవన్ తాజా వ్యవహారం ఊతం ఇస్తున్నది. ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రిని అవుతాను అంటూ విశాఖపట్నంలో ప్రకటించారు. దీనిని బట్టి తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనే సంకేతం ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. టిడిపితో పొత్తు ఉంటె ముఖ్య మంత్రి చంద్రబాబే అన్నది అందరికి తెలుసు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కావాలంటే ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు పంచుకోవాలనే ప్రతిపాదన పట్ల కూడా టిడిపి నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పవన్ ఆలోచనలో పడ్డారని భావిస్తున్నారు. టిడిపితో పొత్తు గురించి సూత్రప్రాయంగా చెబుతూ వస్తున్నా ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి నినిర్ధిష్టంగా చర్చలు జరిగిన దాఖలాలు లేవు. ఎవరెన్ని సీట్లు పోటీ చేయాలనే విషయంలో కూడా రెండు పార్టీలలో కూడా స్పష్టత లేదు. టిడిపిలో కొన్ని వర్గాలు జనసేనతో పొత్తు అవసరం లేదని బహిరంగంగా అంటున్నారు. జనసేనకు పది సీట్లకు మించి ఇవ్వడం వృధా అనేవారు కూడా ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ కు ముఖ్య మంత్రి అవకాశం ఇస్తేనే పొత్తు ఉండాలి అంటున్నారు. జనసేన బిజెపికి కలసి 75 సీట్లు అయిన ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారు.
రెండు పార్టీలు పోటీ చేసే సీట్ల విషయంలో ఓ అవగాహనకు రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నట్లు పక్షం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అటువంటి భేటీ ఏమీ జరగలేదు. పొత్తుల విషయం తేలకుండానే తెనాలి నుండి తమ అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ గుంటూరులో ప్రకటించడం కలకలం రేపింది. పొత్తు విషయం తేలకుండా ఏక పక్షంగా యెట్లా ప్రకటిస్తారంటూ టిడిపి నేతలు కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పవన్ టిడిపి నేతలను ఖాతరు చేసే స్థితిలో లేరని తెలిసింది. చంద్రబాబు దిగి రాక పోతే అన్ని స్థానాలకు పోటీ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసినా 40, 50 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సున్నితంగా పవన్ కళ్యాణ్ మనసు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఏది ఏమైనా నారీ నారీ నడుమ మురారి లాగా అటు బిజెపి, ఇటు టిడిపి మధ్య పవన్ నిలబడ్డారు.