అసంతృప్తి పంచిన చంద్రబాబు శ్రీకాళహస్తి పర్యటన
ఒక రాజకీయ పార్టీ అధినేత నియోజకవర్గానికి వస్తున్నారంటే నాయకులు, కార్యకర్తలకు పండుగ. బ్యానర్లు, కటవుట్లు, స్వాగత తోరణాలు, పార్టీ పతాకాలతో అలంకరణ చేస్తారు. నాయకుడు వస్తే పార్టీకి బలం పెరుగుతుందని ఆశిస్తారు. ఏదైనా అసమ్మతి, అసంతృప్తి ఉంటే వారితో మాట్లాడి సర్దుబాటు చేస్తారని భావిస్తారు. ఎన్నికల సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తారని భావిస్తారు. స్థానిక నాయకులకు తగిన గుర్తింపు వస్తుందని అనుకుంటారు. అయితే చంద్రబాబు శ్రీకాళహస్తి పర్యటనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు. తనను అభ్యర్థిగా ప్రకటిస్తారని బొజ్జల సుధీర్ రెడ్డి ఆశించారు. అది జరగలేదు. రోడ్డు షో , పబ్లిక్ మీటింగ్ లో తమకు కూడా స్థానం ఉంటుందని మాజీ ఎమ్మెల్యేలు SCV నాయుడు, మునిరామయ్య ఆశించారు. అది కూడా జరగలేదు. తమకు తగిన ప్రాధాన్యత లేదని ఇద్దరు నాయకులు, వారి అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు.
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో గాని తెలుగు దేశం అథినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ రోడ్ షో నిర్వహించారంటే సంప్రదాయంగా వుండే ఓటర్లనే కాకుండా కొత్త వారిని ఆకట్టుకోవడం జరుగుతుంది. కాని ఇటీవల శ్రీకాళహస్తిలో నిర్వహించిన రోడ్ షో బహిరంగ సభ కొత్త సెక్షన్ లను ఆకట్టుకు పోగా, సంప్రదాయంగా వుండే ఓటర్లకే భారీగా గండి పడిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నీ తానై వ్యవహరించిన టిడిపి ఇన్ చార్జ్ సుధీర్ రెడ్డి ఏక పక్షంగా వ్యవహరించినా జోక్యం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు ప్రేక్షక పాత్ర వహించడంపై నియోజకవర్గంలోని అత్యధిక ఓటర్లుగా వున్న వన్నె కుల క్షత్రియులతో పాటు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు కుతకుత లాడి పోతున్నారు.
శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో వన్నె కుల క్షత్రియులను రెడ్డిలుగా పిలుస్తుంటారు. అన్ని సామాజిక వర్గాలకంటే విరే నియోజకవర్గంలో ఎక్కువగా వున్నారు. అందు వల్లనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం టిడిపిలో వున్నా పిలిచి ఎమ్మెల్సీ చేశారు. వాస్తవం చెప్పాలంటే వైసిపి అభ్యర్థి మధుసూధన రెడ్డి కన్నా మిన్నగా కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గంలో టిడిపికి చెందిన వారిని వైసిపిలో చేర్పించే పనిలో డాక్టర్ సుబ్రహ్మణ్యం వున్నారు. గతంలో టిడిపి తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య కొంత కాలం రాజకీయాలకు దూరంగా వుండగా, ఇటీవల టిడిపిలో చేరారు. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంకు దీటుగా టిడిపిలో పని చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు శ్రీ కాళహస్తి లో రోడ్ షో తోపాటు బహిరంగ సభ నిర్వహించినపుడు మునిరామయ్యను దూరంగా పెట్టేశారు. రోడ్ షో సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య జీపు ఎక్కబోతుంటే పక్కకు తోసేశారు. తుదకు చంద్రబాబు నాయుడు కూడా చూస్తూ మిన్న కుండి పోవడమే కాకుండా బహిరంగ సభలో తన ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య పేరు ప్రస్తావన తేలేదు. ఈ సంఘటనపై మునిరామయ్య సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా ఆయన అభిమానులు తీవ్ర మనస్తాపతంతో టిడిపి పై కారాలు మిరియాలు నూరు తున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జ్, చంద్రబాబు నాయుడు కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యెడల ప్రదర్శించిన తీరు తటస్తులుజీర్ణం చేసుకోలేక పోతున్నారు.
ఇదిలా వుండగా టిడిపికి ఎప్పుడూ అండగా వుండే ఆయన సామాజిక వర్గం కూడా మరీ ఆగ్రహంతో వున్నది. శ్రీకాళహస్తికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడుకు కూడా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అవమానం జరిగింది. శ్రీ కాళహస్తి, సత్యవేడు, సుళ్లూరు పేట, వెంకటగిరి నియోజకవర్గంలో అనుచరులే కాకుండా బంధు వర్గం గల యస్సీవీ నాయుడును కూడా రోడ్ షో లేక బహిరంగ సభ సమయంలో వేదిక ఎక్కనీయలేదు. యస్సీవీ నాయుడు జోక్యంతో ఆయన అనుచరులు మిన్న కుండి పోయారు. ఇటీవల చంద్రబాబు నాయుడు స్వయంగా యస్సీవీ నాయుడును పిలిపించి బాగా పని చేయాలనిచెప్పారు. అయితే వెను వెంటనే జరిగిన ఈ సంఘటన నియోజకవర్గంలోని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మండి పడుతోంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇదే విధంగా వ్యవహరిస్తారని తనకు అండగా వుండే వారిని నిరాదరణ చేసే 2019 ఎన్నికల్లో ఓటమి మూట గట్ఠుకొన్నారని కొంత మంది ఆగ్రహంతో వున్నారు. ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొనే తత్వమని ఆవేదన పడుతున్నారు. .
శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఓట్లతోనే స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గోపాల కృష్ణా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వుండే శ్రీ కాళహస్తి మండలంలో వైసిపి అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. మరి ఇప్పడైతే చెప్పాల్చిన పనిలేదు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఎక్కువగా వుండే తొట్టంబేడు మండలంలో గోపాల కృష్ణా రెడ్డికి మెజారిటీ వచ్చింది. పైగా మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడుకు తొట్టంబేడు మండలం నివాసి కావడం తోడ్పడింది. . తొట్టంబేడుమండలంతో పాటు శ్రీ కాళహస్తి టవున్ లో వచ్చిన మెజారిటీతో ఆనాడు గోపాల కృష్ణా రెడ్డి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో అన్ని మండలాల్లో వైసిపి స్వీప్ చేసింది. 40 వేల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. పైగా 2019 ఎన్నికల తర్వాత టిడిపికి చెంది టవున్ లో ఎక్కువ మంది వైసిపికి వెళ్లారు. కొందరు రాజకీయాలకు దూరంగా వున్నారు. దీనికి తోడు టిడిపి ఇన్ చార్జ్ సుధీర్ రెడ్డి దూకుడు వైఖరి నచ్చలేక పార్టీ వీడలేక చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో వున్న విషయం ఇటీవల వచ్చిన సర్వే టీమ్ రిపోర్టు ఇచ్చిందని చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో వైసిపి నుండి కనీసం 40 వేల ఓట్లు లాగ గలిగితేనే ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి బయట పడతారు. కాని చంద్రబాబు నాయుడు ఇవేవీ ఆలోచన చేయడం లేదు. కేవలం గోపాల కృష్ణా రెడ్డి ట్రంప్ కార్డు చాలని భావిస్తున్నారని రాజ కీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నియోజక వర్గంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు మాట వరసకు మాజీ ఎమ్మెల్యేలతో గాని ఇతర ముఖ్యమైన నాయకులతో మాట్లాడలేదు. ఈ పర్యటన సత్ఫలితాలు ఇవ్వక పోగా, మెజారిటీ ఓటర్లు అయిన వన్నె కులస్తులతో పాటు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో కూడా అసంతృప్తి మూట గట్టుకోవలసి వచ్చిందని నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొసమెరుపు ఏమంటే శ్రీ కాళహస్తి లో జరిగిన బహిరంగ సభలో బొజ్జల సుధీర్ రెడ్డిని టిడిపి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించ లేదు. కార్యకర్తల సమావేశం అసలే జరగలేదు. కాని చంద్రబాబు నాయుడు సభ జరిగిన మరుసటి రోజు తనను చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించారని, అదీ రాష్ట్రంలో తన అభ్యర్థిత్వం నాలుగవదని ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తల చేత సుధీర్ రెడ్డి సన్మానం చేయించుకోవడం పులువురికి విస్మయం కలుగచేసింది.