26, ఆగస్టు 2023, శనివారం

ఈ పార్టీలో ఉండలేం - వేరే పార్టీకి వెళ్ళలేం

సతమతం అవుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు 

అధికారంతో లబ్దిపొందింది కొందరే 

అధికార పదవులు కొందరికే పరిమితం 

పదవి రాదు- మాట చెల్లదు- పనులు కావు

తెదేపాలో చేరుదాం అంటే కమ్మ నేతల డామినేషన్  

పార్టీలో కంచి గరుడ సేవకే పరిమితం   



ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరు వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీలో ఉండలేక, బయటికి పోలేక ఊగిసలాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొందరు పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించారు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఒరిగింది ఏమీ లేదని అంటున్నారు. గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజక వర్గానికి చెందిన కొందరు నాయకులు మాట్లాడుతూ వరుసగా రెండు సార్లు పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పోరాడిన తమకు పార్టీలో తగిన గుర్తింపు లేదని అవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న బలమైన కమ్మ సామాజిక వర్గం నేతలను ఎదిరించి పార్టీ అభ్యర్థులను గెలిపించామని చెప్పారు. అయితే నియోజక వర్గానికి చెందిన ఒక నేతకు కూడా పార్టీ సముచిత స్థానం కల్పించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో వైసిపిని వీడి టిడిపిలోకి పోవాలంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలు ఎవరిని రానివ్వరని అన్నారు. వైసిపి నుంచి టిడిపిలోకి వెళితే పెనం నుంచి పొయ్యిలో పడినట్టు ఉంటుందంటున్నారు. జనసేన స్థిరత్వం లేదు, బిజెపికి ప్రజల్లో బలం లేదు, కాంగ్రెస్ మరణ శయ్యపై ఉందని అంటున్నారు. 


దీనితో ఎక్కడికి వెళ్ళ లేక విధిలేని పరిస్థితుల్లో వైకాపాలో కొనసాగుతున్నామని అంటున్నారు. అధికార పదవులు కొందరికే పరిమితం అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పార్టీలో ఉన్నా, నిధులు లేకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని ఆవేదనతో ఉన్నారు. ప్రజలకు ఏమి ఏమి చేయలేక, తాము లబ్దిపొందక పార్టీలో ఎందుకు ఉన్నామో అర్థం కావడం లేదంటున్నారు. మండల అధికారులు కూడా తమను గుర్తించడం లేదని అంటున్నారు. పదవులు రాక పరపతి లేక జీవితాంతం పార్టీ సేవకే పరిమితం కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. MLC, చైర్మన్ పదవులకు అర్హత ఉన్నవాళ్లు ఉన్నా, అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు. పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజక వర్గం SC రిజర్వు కావడంతో అక్కడి రెడ్డి సామాజిక వర్గం నేతలు మదనపడుతున్నారు. MLA, MP అర్హతలు ఉన్నా, మండల స్థాయి పదవులతో సర్దుకోవాల్చి వస్తుంది. ఇక్కడ వరుసగా రెండు సార్లు YCP అభ్యర్థులు గెలువడంతో, ఎలాగైనా గెలుస్తామని అధిష్టానం ధీమాగా ఉంది. అక్కడ ఉన్న పార్టీ నాయకుల గురించి పట్టించుకోవడం లేదు.


YCPలో పడుతున్న ఇబ్బంది కారణంగా తెదేపాలో చేరుదాం అంటే, అక్కడ కమ్మ సామాజిక వర్గం పెత్తనం నడుస్తోంది. వేరే సామాజిక వర్గానికి చెందిన నేతలకు కనీస గౌరవం కూడా లేదు. చాలా హీనంగా చూస్తున్నారు. పార్టీ మాది, ఉంటే ఉండు లేకుంటే పో అన్న రీతిలో వ్యహహరాలు నడుస్తున్నాయి. చిత్తూరు టిడిపి నేతలు ఇతర కులాల వారిని అనగ దొక్కుతున్నరన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ ను ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన ఫోటోను  ఎవరు బ్యానర్ లలో కూడా వేయడం లేదు. మాజీ ఎమ్మెల్యే సి కె బాబు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరినా తగిన ప్రధాన్యత ఇవ్వడం లేదు. అయనకు చిత్తూరు ఇంచార్జి ఇస్తే చిత్తూరుతో పాటు పూతలపట్టు, జి డి నెల్లూరు నియోజక వర్గాల్లో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అయనకు అవకాశం రాకుండా కమ్మ సామజిక వర్గం నేతలు అడ్డు పడుతున్నారు. అలాగే బలిజ సామాజిక వర్గం నేతలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. చిత్తూరులో ఇద్దరు నేతలు సర్వం తామే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో టిడిపిలోకి  వెళ్లాలంటే ఇతర సామాజిక వర్గం నేతలు భయపడుతున్నారు. జి డి నెల్లూరు నియోజక వర్గంలో ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అయితే వైసిపిని  కాదని టిడిపిలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. వైసిపి నేతలపై ఒంటికాలిపై లేచి విమర్శలు చేస్తున్న రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డికే దిక్కు లేదని అంటున్నారు. ఇటీవల కొందరు  ఎస్సీ సామాజిక వర్గం నేతలు సుధాకర్ రెడ్డి ద్వారా రెడ్డి ద్వారా టిడిపిలో చేరడానికి ప్రయత్నం చేస్తే కమ్మ సామాజిక వర్గం నేతలు అడ్డు పడ్డారని తెలిసింది. టిడిపి పోలిట్ బ్యూరో వర్లరామయ్య చొరవతో పార్టీలో చేరిన విశ్రాంత ఎస్పీ పి చిన్నస్వామిని ఎవరు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం నేతలతో విసిగి పోయిన సుధాకర్ రెడ్డి ఇటీవల టివి డిబేట్లలో మాట్లాడటం మానేశారని సమాచారం. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యేలు ముని రామయ్య, ఎస్సీవీ నాయుడు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. అక్కడ వన్నెకుల క్షత్రియ ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ ముని రామయ్యను పట్టించు కోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కమ్మ సామాజిక వర్గం నేతలు  బొజ్జల సుధీర్ రెడ్డిని కాదని ఎస్సీవీ నాయుడుకు పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని కొందరు తెలిపారు. తిరుపతి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు కూడా కొందరు నేతలు పొగబెడుతున్నారని  సమాచారం. చంద్రగిరిలో డాలర్ దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోకుండా కొందరు కమ్మ సామాజిక వర్గం నేతలు అడ్డు పడుతున్నారని తెలిసింది. అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నందున రెడ్డికి టిక్కెట్టు ఇస్తే మంచిదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ రెడ్డి నేతలను రానివ్వడం లేదు. 


కమ్మ సామాజిక వర్గం నేతలు ఉన్న ప్రతి నియోజక వర్గంలోను పరిస్తితి ఇలాగే ఉందంటున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనాధ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి పేరుకు పదవుల్లో ఉన్నా ఓ చిన్న కమ్మ నేతకు ఉన్న విలువ కూడా లేదంటున్నారు. ఈ నేపథ్యంలో వైసిపికి నిరాదరణకు గురైన నేతలు టిడిపిలోకి పోవాలంటే భయపడుతున్నారు. వైసిపిలో ఉండలేము, టిడిపిలోకి పోలేము, కాబట్టి రాజకీయాల నుంచి తప్పు కుంటే మంచిదని భావిస్తున్నట్టు కొందరు రెడ్డి,ఎస్సీ, బిసి నేతలు అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *