24, ఆగస్టు 2023, గురువారం

శ్రీకాళహస్తి టిడిపి పాతిక వేల మైనస్ లో వుందా?



ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను నిర్వహించే సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏ మేరకు వెనుక బడి వున్నారో తెలియ జేయడం ఆనవాయితీగా వుంది. అయితే తెలుగుదేశం సరి కొత్త పుంతలు తొక్కినట్లు వార్తలు వస్తున్నాయి. అదీ తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో మరీను. బుధవారం జరిగిన నియోజకవర్గ ముఖ్యుల సమావేశంలో ఈ సర్వే గ్రూపు సభ్యులు పాల్గొని నియోజకవర్గంలో వైకాపా  కన్నా టీడీపీ  బాగా వెనకబడివున్నట్లు కార్యకర్తల ముందే కుండ బద్దలు కొట్టారు. ఏ ఏ మండలాల్లో వెనక బడిందీ చెప్పినట్లు తెలిసింది. కొసమెరుపు ఏమంటే ఈ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సమావేశానికి చాలా మందిని పిలిచినా తక్కువ మంది వచ్చినట్లు చెబుతున్నారు. దీనితో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో కొందరిలో గాబరా మరి కొందరు భవిష్యత్తు గురించి పరి పరి విధాలుగా గుసగుసలు సాగిస్తున్నారని తెలిసింది.  


తిరుపతి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన పద్ధతిని టిడిపి పార్టీ అధిష్టాన వర్గం అవలభించుతోంది. ఈ నెల 22 వ తేదీన సూళ్లూరుపేటలో జరిగిన నియోజకవర్గ ముఖ్యుల సమావేశంలో పాల్గొన్న సర్వే టీమ్ ఒక్కొక్క నేతను విడివిడిగా పిలిచి అభిప్రాయ సేకరణ చేశారని తెలిసింది. సత్యవేడు నియోజక వర్గ ముఖ్య నేతలను గురువారం మంగళగిరి పార్టీ హెడ్ ఆఫీసుకు పిలిపించారు. మరి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సర్వేటీమ్ స్వయంగా పినాయిల్ వేసి అందరి ముందు కడిగేశారు. త్వరలోనే శ్రీ కాళహస్తి నుండి ముఖ్యులకు అధిష్టానం నుండి  పిలుపు రానున్నట్లు తెలిసింది. 


జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు వున్నందున చంద్రబాబు నాయుడు ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ఈ పాటికే నిర్ణయమైన అభ్యర్థులను కూడా ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో పాటు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గ ఇన్ చార్జ్ ల పని తీరు మదింపు వేసి తుదిగా అభ్యర్థులను ఎంపిక చేస్తారనే ప్రచారం వుంది. ఎన్నికలు ముంగిట పెట్టుకొని స్థానిక ఎన్నికల్లో చేతులెత్తేసిన పలువురు ఇన్ చార్జ్ ల తలరాతలు మారిపోతాయని చెబుతున్నారు. పరిమితమైన స్థానిక ఎన్నికల్లోనే వైకాపా వాళ్ళను దీటుగా ఎదుర్కోలోని వారు జనరల్ ఎన్నికల్లో ఏలా వుంటారనే భయం చంద్రబాబు నాయుడుకు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


ఇక శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో సర్వే టీమ్ అంచనా మేరకు టిడిపి ఇరవై వేల ఓట్ల మైనార్టీలో వున్నట్లు తేలిందని తెలిసింది. ఈ అంశమే ఈ నెల 23 వతేదీ సమావేశంలో వెల్లడి చేశారని తెలిసింది. రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో టిడిపి బాగా వెనుకబడి వుందని తేల్చారట. వాస్తవంలో కూడా ఇది వాస్తవమే. 2014లో జరిగిన ఎన్నికల్లో స్వర్గీయ గోపాలకృష్ణా రెడ్డి పోటీ చేసి గెలుపొందినపుడు కూడా ఈ మండలాల్లో మైనస్ లో వున్నారు. తుదకు గోపాలకృష్ణా రెడ్డి స్వంత మండలంలో కూడా మైనస్ లో వుండినారు. ఈ మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ.  డామినేషన్ కూడా ఎక్కువే. కేవలం తొట్టంబేడు శ్రీ కాళహస్తి టవున్ లో వచ్చిన ఓట్లతోనే అప్పట్లో గోపాల కృష్ణా రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వున్నా ఈ మండలాల్లో టిడిపి వెనుకబడి వుందని సర్వే టీమ్ తేల్చిందట. పైగా ప్రస్తుతం టిడిపి ఇన్ చార్జ్ శ్రీ కాళహస్తి మండలానికి చెందినా వైకాపా కన్నా టిడిపి వెనుకబడి వుందని తేల్చినట్లు సమావేశంలో పాల్గొన్న ఒకరు చెప్పారు. 


అయితే మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు స్వంత మండలం తొట్టంబేడు లో టిడిపి ముందుందని సర్వే టీమ్ చెప్పిందట. దీనితో పాటు శ్రీకాళహస్తి టవున్ లో వైకాపా తో అటుఇటు టీడీపీ వున్నట్లు చెప్పినట్లు తెలిసింది. మరొక మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య టిడిపిలోనికి వచ్చిన తర్వాత ఆయన సామాజిక వర్గం వన్నె రెడ్లు కొంత టిడిపి వైపు మొగ్గు చూపుతున్న దశలో శ్రీ కాళహస్తి లో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆయనను పక్కన బెట్టడం కనీసం ప్రసంగంలో ఆయన పేరు ప్రస్తావన చేయక పోవడంతో ఆ సామాజిక వర్గం రగిలిపోతున్నది. ఈ అంశంలో మునిరామయ్య మౌనంగా వున్నారు. శ్రీ కాళహస్తి నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలుపొందినా అవినీతి మచ్చ లేని నేతగా మునిరామయ్యకు పేరున్నా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన అవమానం టిడిపి మెడకు ఉచ్చుగా వుండ బోతోంది. ఈ అంశాలు సర్వే టీమ్ పార్టీ అధ్యక్షునికి నివేదించినట్లు తెలిసింది. వాస్తవంలో సర్వే టీమ్ కూడా సమగ్ర రిపోర్టు పార్టీ అధిష్టానానికి ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు అభ్యర్థి అయితే ఏలా వుంటుందో కూడా ఇందులో పొందు పర్చారని చెబుతున్నారు. ఇదంతా పరిశీలించితే అధిష్టానం ఆ దేశం మేరకే నియోజకవర్గ ముఖ్యులకు సర్వే టీమ్ షాక్ ఇచ్చిందని చెబుతున్నారు. తాము ఇచ్చిన పూర్తి నివేదిక సమావేశంలో బహిర్గతం చేయ లేదని కూడా తెలిసింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *