అరెస్టుల భయంతో తిరుపతి తెదేపా మీటింగ్ వాయిదా !?
జిల్లాలో 500 మంది మీద హత్యాయత్నం కేసులు
అజ్ఞాతంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు
ఫలించని ముందస్తు బెయిలు యత్నాలు
జైళ్ళలో 92 మంది కార్యకర్తలు
బెయిలుకు దరఖాస్తు చేయని చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకులు, కార్యకర్తలను అరెస్టుల భయం వెంటాడుతోంది. సామాన్య కార్యకర్త నుండి పార్టీ అధినేత వరకు అరెస్టుల భయం తప్పడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమా, తెదేపా జాతీయ కార్యదర్శి నల్లరి కిషోర్ కుమార్ రెడ్డిలు ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసినా, ఇంతవరకు బెయిలు రాలేదు. అలాగే పుంగనూరు పార్టీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు బయిలు పిటిషన్ మీద వాదనలు పూర్తి కాలేదు. తంబళ్ళపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు నియోజక వర్గాలకు చెందిన ప్రతి నాయకుడు మీద కేసులు నమోదు అయ్యాయి. మహిళ అని కూడా చూడకుండా మదనపల్లికి చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి SM పర్వీన్ తాజ్ మీద కూడా కేసును నమోదు చేశారు. మొత్తం 500 మంది మీద కేసులు నమోదయ్యాయి. అయితే తమను కూడా పోలీసులు వేదిస్తారనే భయంతో కేసుల్లో ఉన్న నాయకుల, కార్యకర్తల సన్నిహితులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఒక తెదేపా నాయకుడి అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఇంకా సుమారు వేయి మంది అజ్ఞాతంలో ఉన్నారు.
ఈ నేపధ్యంలో ఈ నెల 24న తిరుపతిలో జోన్ ఫోర్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా లేవు. చంద్రబాబునాయుడు తిరుపతి వస్తే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దం అయ్యారు. బాబుకు అండగా నిలువాల్చిన ముఖ్యనాయకులు అజ్ఞాతంలో ఉన్నారు. ఇంతవరకు ఎవ్వరికి బెయిల్ రాలేదు. బాబు మీటింగ్ పెడితే పోలీసులకు పండుగే. వచ్చిన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం సులభం అవుతుంది. అధినేత అరెస్టుకే పోలీసులు సమయత్తం కావటంతో, ఈ పరిస్థితిలో తిరుపతిలో సమావేశం అవసరమా అన్న చర్చ పార్టీ ఉన్నత స్థాయిలో జరిగింది. తిరుపతి సమావేశాన్ని రద్దు చేయాలనీ, లేకుంటే వాయిదా వేయాలని నాయకులు బాబుకు సూచించినట్లు సమాచారం. చంద్రబాబు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తిరుపతి సమావేశం వాయిదా వేయడానికి మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇందులో భాగంగా 24న తిరుపతిలో జరగవలసిన జోన్ ఫోర్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సమావేశం వాయిదా పడిందని టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి. నరసింహ యాదవ్ ప్రకటించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. 14 యేళ్ళు ముఖ్య మంత్రిగా పని చేసిన చంద్రబాబుకు స్వంత జిల్లాలో అండగా నిలిచేవారు కరువయ్యారు. వైకాపా నేతలకు ఎదురొడ్డి పోరాడే వారు బూతద్దం వేసి వెదికినా కనిపించడం లేదు. ఈ నెల నాలుగవ తేది అంగల్లు, పుంగనూరు సంఘటనల తరువాత చాలా మంది భయపడి కలుగుల్లో దాక్కున్నారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెట్టినా ఖండించే వారు కరువయ్యారు. ఈ పరిస్థితులకు చంద్రబాబు అవకాశ వాద రాజకీయాలే కారణం అంటున్నారు. పని చేసే వారిని విస్మరించి పైసలు ఇచ్చే వారికి పదవులు కట్టబెట్టడం, స్వంత సామాజిక వర్గం నాయకుల మాటలు విని సమర్ధులను పక్కన పెట్టడం, అవకాశ వాడులకు పట్టం కట్టడం లాంటి చర్యలు పార్టీకి శాపంగా మారాయి అంటున్నారు. అందరూ భయపడే రోజుల్లో జగన్, జిల్లా మంత్రులపై ఒంటి కాలిపై విరుచుకు పడిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి గత కొన్నాళ్లుగా టివి డిబేట్లలో కనిపించడం లేదు. చంద్రబాబు సామాజిక వర్గం నాయకులు అడుగడుగునా అవరోధాలు కల్పించడంతో ఆయన విసిగిపోయారు. తనకు ఏదైనా నియోజక వర్గం ఇంచార్జి పదవి ఇమ్మని అడిగితే చంద్రబాబు పట్టించుకోలేదు. దీనితో ఆయన అస్త్ర సన్యాసం చేశారని సమాచారం.
అలాగే ప్రభుత్వం, వైకాపా నేతలపై ఘాటైన విమర్శలు చేసే మరొక అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ వాడి వేడి తగ్గించారు. తనను కాదని చంద్రబాబు తన సామాజిక వర్గం నేతల మాట విని పూతలపట్టు ఇంచార్జిగా డాక్టర్ మురళి మోహన్ ను నియమించడంతో ఆయన మనస్తాపం చెందారని తెలిసింది. అలాగే పుతలపట్టుకు చెందిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం కార్యదర్శి అనగల్లు మునిరత్నం కూడా అలకపాన్పు ఎక్కారు. వైకాపా నేతలను ధైర్యంగా ఎదుర్కొనే సత్యవేడు మాజీ ఇంచార్జి జేడీ రాజశేఖర్ ఇప్పుడ కేవలం ఉనికి చాటుకుంటున్నారు. కష్ట పడే తనను కాదని కోట్లు వున్న హెలెన్ కు ఇంచార్జి పదవి కట్ట బెట్టడంతో ఆయన అలిగారని అంటున్నారు. జి డి నెల్లూరు నియోజక వర్గంలో తొలినుంచి కష్టపడే వారిని కాదని, డబ్బుందని చెప్పి చెన్నైలో ఉన్న డాక్టర్ థామస్ కు ఇంచార్జి పదవి ఇవ్వడాన్ని స్థానిక నేతలు సహించలేక పోతున్నారు. నియోజక వర్గంలో గ్రూపులను పెంచి పోషించిన మాజీ సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు నాయుడుకు ప్రభావశీలుర ఎంపిక కమిటీ సభ్యునిగా నియమించడంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ MPP, ZPTC రాజేంద్రన్, గ్యాస్ రవి పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. గంగాధర నెల్లూరు నుండి పార్టీలో కొత్తగా చేరిన పదవీవిరమణ చేసినా SP చిన్నస్వామికి పార్టీలో ఇంతవరకు గుర్తింపు ఇవ్వలేదు. పోలీసు అధికారిగా పనిచేసిన చిన్నస్వామికి పుంగనూరు, అంగళ్లు కేసుల పర్యవేక్షణ భాద్యత అప్పగించినా, కార్యకర్తలకు ధైర్యం చెప్పి, బాసటగా నిలచేవారని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
పుంగనూరు నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్న అనీషా రెడ్డిని తొలగించి చల్లా రామచంద్రా రెడ్డిని పెట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పుగా పలువురు భావిస్తున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాటవిని చంద్రబాబు పప్పులో కాలేశారని అంటున్నారు. అక్కడి నాయకత్వ లోపం వల్లే ఇప్పుడు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవలసి వచ్చిందని కొందరు వాపోతున్నారు. కేవలం డబ్బు చూసి రాజంపేట పార్లమెంటు ఇంచార్జి గంటా నరహరిని పెట్టి తప్పు చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమర్థులు, పోరాట పటిమ ఉన్న కొందరు నాయకులు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. వీరందరినీ దూరం చేయడంలో కీలక పాత్ర పోషించిన నాయకులు కనీసం పాలక పక్షం నేతలపై పేరు చెప్పి విమర్శలు చేయ లేక పోతున్నారు. తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిట్టిబాబు నాయుడు నోరు మెదపడం లేదు. వివిధ నియోజక వర్గాల ఇంచార్జిలు గాలి భాను ప్రకాష్, థామస్, మురళీ మోహన్, హెలెన్, సుధీర్ రెడ్డి, సుగుణమ్మ తూ తూ మంత్రంగా పని చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి అమరనాద రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, పులివర్తి నానీ, చల్లా రామచంద్రా రెడ్డి,దొమ్మలపాటి రమేష్ తదితరులు కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న కొందరు చంద్రబాబు సామాజిక వర్గం నేతలు అధికారం పోగానే స్వంత వ్యాపారాల్లో మునిగి పోయారు. లోకేష్ పాదయాత్ర సమయంలో కొంత గాలి కనపడటంతో ఆయన చుట్టూ చేరి భజన చేశారు. ఇప్పుడు చంద్రబాబు కేసుల్లో ఇరుక్కు పోగానే కలుగుల్లోకి వెళ్లి పోయారు. జాతీయ అధికార ప్రతినిధి మాల్యాద్రి, రాష్ట్ర ప్రతినిధులు గౌనివారి శ్రీనివాసులు, మద్దిపట్ల సూర్యప్రకాష్, విజయకుమార్ జిల్లా వైకాపా నేతలను పేరు పెట్టి విమర్శించడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే ఉంటే, రానున్న ఎన్నికలను ఎదుర్కొనడం కష్టం అవుతుందని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడి ఆవేదనను అధినేత అర్థం చేసుకొని, పార్టీని చక్కదిద్దుతారని ఆశిద్దాం.