11, ఆగస్టు 2023, శుక్రవారం

స్థానిక ఎన్నికలను పట్టించుకోని శ్రీకాళహస్తి ఇన్ ఛార్జ్

టిడిపి కార్యకర్తలపై  వైసిపి నేతల దాడి !

టిడిపి గిరిజన మహిళా అభ్యర్థి కిడ్నాప్!

పట్టించుకోని సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరులు! 



తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టిడిపి రాజకీయాలు రివర్స్ కొడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన సమయంలోజరిగిన వైకాపా నేతల దాడులు,  కొన సాగుతున్న అరెస్టుల కారణంగా  నామినేషన్ల రోజు సుధీర్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరులు డుమ్మా కొట్టినట్లు ప్రచారంలో ఉంది. టిడిపి అథినేత చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పర్యటనకు వచ్చినపుడు ఇన్ చార్జ్  బొజ్జల సుధీర్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను బహిరంగ సభ వేదిక ఎక్కినీయలేదని ప్రచారంలో ఉంది. తుదకు  చంద్రబాబు నాయుడు కూడా జోక్యం చేసుకోలేదు. పార్టీ క్రమశిక్షణ పాటించి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మునిరామయ్య, యస్సీవీ నాయుడు ప్రేక్షకుల్లోనే కూర్చున్నారు. ఈ సంఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చకు ఆగ్రహానికి దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య సామాజిక వర్గమైన వన్నెకుల రెడ్డి వర్గం రగిలి పోతోంది. నియోజకవర్గంలో వీరి ఓట్లు ఎక్కువ. అగ్నికి వాయువు తోడైనట్లు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన మరొక మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడుకు జరిగిన తీరుతో టిడిపికి సంప్రదాయంగా వుండే సామాజిక వర్గమూ మండి పడుతున్నది.  


ఇదిలా వుండగా బహిరంగ సభలో శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థిగా సుధీర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించ లేదు. అయితే చంద్రబాబు నాయుడు సభ జరిగిన మరు రోజు తనను చంద్రబాబు నాయుడు టిడిపి అభ్యర్థిగా ప్రకటించారని,  తన చుట్టూ ఉన్న వారితో సన్మానాలు చేయించుకోవడం పుండుపై కారం పొడి రాసినట్లయింది. చంద్రబాబు నాయుడు పర్యటన ప్రకటన వెలువడిన తర్వాత సుధీర్ రెడ్డి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను దూరంగా పెట్టారు. గమనార్హమైన అంశమేమంటే   పార్టీ  క్రమశిక్షణతో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మౌనంగా వున్నారనే ప్రచారముంది. తాము గాని, తమ అనుచరులను గాని జరిగిన అవమానం గురించి మీడియాకు ఎక్కకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చెబుతారో వేచి వున్నారు. 


ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. నియోజకవర్గంలో ఏర్పడు మండలం పెనుమల్లం తొట్టంబేడు మండలం పెన్నల పాడు సర్పంచ్ పదవులకు నామినేషన్లు గురువారం జరిగాయి. నామినేషన్లు జరిగే ముందు సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలతో మాట మాత్రంగా చెప్ప లేదని వారి అనుచరులు చెబుతున్నారు. నామినేషన్ల రోజు సుధీర్ రెడ్డి శ్రీ కాళహస్తి వదలి పెట్టి వెళ్లినా కొంత మంది టిడిపి నాయకులు గిరిజన మహిళ అభ్యర్థిని తీసుకొని నామినేషన్ వేసేందుకు వెళ్లారు. అప్పటికే MPDO ఆఫీసు లోపల వున్న వైకాపా నేతలు టిడిపి అభ్యర్థిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పైగా నామినేషన్ వేయించేందుకు వెళ్లిన టిడిపి కార్యకర్తలను తరిమి కొట్టారు. 


 నామినేషన్ రోజు సుధీర్ రెడ్డి నియిజకవర్గంలో లేకపోవడం,  ప్రముఖ నాయకులు కూడా నామినేషన్ వదలి పెట్టి తిరుమల దర్శనానికి వెళ్లడం మొత్తం వ్యవహారం నియోజక వర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా వుంది.  తొట్టంబేడు మండలం పెన్నల పాడులో మాత్రం నామినేషన్లు వేసినా మరు రోజు కూడా టిడిపి ఇన్ చార్జ్ సుధీర్ రెడ్డి లేక పోవడంతో అడగే వారు లేకుండా నామినేషన్ రద్దు చేశారని తెలిసింది. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాత్రం జరగాల్సినది జరిగి పోయిన తర్వాత వచ్చి నామినేషన్ రోజు ధర్నా చేసి మమ అని పించారు. నామినేషన్ల ముందు  ఇన్ చార్జ్ సుధీర్ రెడ్డి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మునిరామయ్య, యస్సీవీ నాయుడులతో కూడా మాట్లాడి పథకం ప్రకారం వెళ్లి వుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు వాపోతున్నారు. 


 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో టిడిపి బాగా బలహీన పడింది. కొందరు వైసిపి లోకి వెళ్లారు.  మున్సిపల్ మాజీ చైర్మన్ ఆయన అనుచరులు దూరంగా వున్నారు. పైగా నిన్న మొన్నటి వరకు సుధీర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో పట్టున పది రోజులు వుండటం లేదు. ఆ మధ్య టిడిపి నేతపై దాడి చేసి కారు ధ్వంసం చేసినా ఇన్ చార్జ్ సుధీర్ రెడ్డి పెద్దగా ప్రతిఘటన ఇవ్వలేదు. ఆ ప్రభావం నామినేషన్ల రోజు కన్పించింది. ఒక్క టిడిపి కార్యకర్త వైకాపా వారితో ఢి అనేందుకు సిద్ధం కాలేనే ప్రచార ముంది. దీనికి తోడు ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి నాయకులు సుధీర్ రెడ్డి దబాయింపు రాజకీయాలకు మింగిలేక కక్క లేక సతమతమౌతున్నారు. 


ఇటీవల నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలు గల మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు టిడిపిలోనికి రావడంతో ఈపాటికే వున్న కొద్ది మందికి టిడిపి నాయకులకు ధైర్యం వచ్చింది. బలమైన అనుచర గణం గల మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు పార్టీలోనికి వచ్చిన తర్వాత ఇక వైకాపా నేతల దౌర్జన్యాలకు తెర పడుతుందని టిడిపి వర్గీయులే కాకుండా వైకాపా వర్గీయుల్లో జంకు మొదలైంది. గురువారం నామినేషన్ రోజు యస్సీవీ నాయుడు వస్తారేమోనని వైకాపా నేతలు భయ పడుతుండగా, తనను తాను టిడిపి అభ్యర్థిగా ప్రకటించుకొన్న సుధీర్ రెడ్డి మాట మాత్రం కూడా చెప్పక పోవడంతో యస్సీవీ నాయుడు మౌనంగా వుండి పోయారని చెబుతున్నారు. పైగా సుధీర్ రెడ్డి కూడా డుమ్మా కొట్టడంతో వైకాపా వాళ్ళ రొట్టె విరిగి నేతిలో పడింది. అభ్యర్థిని కిడ్నాప్ చేయడమే కాకుండా టిడిపి కార్యకర్తలపై దాడి జరిగేందుకు అవకాశం ఏర్పడిందంటున్నారు. పుంగనూరు, తంబళ్ల పల్లి, పలమనేరు నియోజకవర్గాల్లో వైకాపా వర్గీయులు సాగిస్తున్న దూకుడు శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో నామినేషన్ల రోజు పునరావృత్తం అయ్యిందని అంటున్నారు. 


శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోనే కాదు తిరుపతి జిల్లా రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యకరమైన చర్చ సాగుతోంది. స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణా రెడ్డికి ఆఖరు గడియల్లో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని ఒక వేళ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి ఓడి పోతాడని సర్వే రిపోర్టులు వచ్చినా టిడిపి అభ్యర్థిగా సుధీర్ రెడ్డినే చంద్రబాబు నాయుడు కొనసాగిస్తారని ప్రచారంలో ఉంది. ఫలితంగానే నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులను సుధీర్ రెడ్డి లెక్క చేయడం లేదనే ప్రచార ముంది. ఆ ధీమాతోనే చంద్రబాబు నాయుడు రోడ్ షో బహిరంగ సభ సందర్భంగా సుధీర్ రెడ్డి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను దూరంగా పెట్టినారని, ఏమైనా సరే సుధీర్ రెడ్డే అభ్యర్థి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా మాజీ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదనే ప్రచారం ముమ్మరంగా వుంది. గతంలో ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా సుధీర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తీవ్రంగా మందలించడం రాజకీయ వర్గాలకు తెలుసు. అయినా నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గ ఓటు బ్యాంకు గల ఇద్దరు ఎమ్మెల్యేల గురించి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి బహిరంగ సభలో మాట వరసకు పేర్లు చెప్పకుండా బొజ్జల కుటుంబం గురించే పొగిడి వెళ్లారని తిరుపతి జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో వుంది. చంద్రబాబు నాయుడు సెంట్ మెంట్ కు తలొగ్గితే తిరుపతి జిల్లాలో మరికొన్ని నియోజక వర్గాలు పోగొట్టుకుంటారని రాజకీయ వర్గాలు అంచనా వస్తుండగా, వైకాపా క్యాంపులో మాత్రం ఇదే జరగాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *