9, ఆగస్టు 2023, బుధవారం

మరో ఆగస్టు సంక్షోభం దిశగా తెదేపా ?

 పార్టీ అధినేత మీదనే హత్యాయత్నం కేసు

మరో ఆరుగురు అభ్యర్థుల మీద కూడా

299 మంది మీద హత్యాయత్నం కేసులు

71 మంది జైళ్ళ పాలు

తెదేపా చరిత్రలో ఇదే పెద్ద కేసు 



ఆగస్టు నెల టిడిపికి కలసి రాదన్న విషయం మరోక సారి రుజువయ్యింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీదనే హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదయ్యాయి. సొంత జిల్లాలో ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే అరుమంది అభ్యర్థులు కూడా ఉన్నారు. రాష్ట్ర పార్టీ నేతలు అందరిని ఇరికించారు. ఇప్పటికి 299 మంది మీద కేసులు నమోదయ్యాయి. 71 మందిని అరెస్టు చేశారు. పుంగనూరు ఇంచార్జి చల్లా బాబు అజ్ఞాతంలో ఇన్నారు. అందరి మీద హత్యాయత్నం కేసులను బనాయించారు. తంబల్లపల్లి, మదనపల్లె, పుంగనూరులో తెదేపా నాయకులు ఎవ్వరు మిగలలేదు. ఇప్పుడు పార్టీ జండా చేతపట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. గతంలో తెదేపా మీద ఇంత భారీ స్థాయిలో హత్యయత్నం కేసులు నమోదు కావడం ఎన్నడూ జరగలేదు. పార్టీ అధికారంలోకి రాకుంటే ఈ కేసుల నుంచి విముక్తి పొందటం అంత సులభం కాదు.


 ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పది రోజుల కార్యక్రమం చేపట్టారు. మొదటి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైన కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చేరుకునేటప్పటికి హింసాత్మకంగా మారింది. నాలుగవ తేది అంగళ్లు, పుంగనూరులో గొడవలు జరిగాయి. అవి కాస్తా దాడులు, కేసులకు దారి తీశాయి. టిడిపి శ్రేణులు కొంత అత్యుత్సాహంతో ప్రదర్శించడంతో పరిస్థితులు బెడిసి కొట్టాయి. ఇప్పడు చంద్రబాబుతో సహా 299 మంది పోలీసు కేసుల్లో ఇరుకున్నారు. కొందరు ఇప్పటికే అరెస్టయి జైళ్లలో ఉన్నారు. కొత్తగా చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఇటీవల జరిగిన ఘర్షణ ఘటనలపై కేసులో చంద్ర బాబు పేరు చేర్చారు. ముదివీడు పోలీసు స్టేషన్ లో చంద్రబాబు సహా 20 మందికిపైగా టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు. ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా దేవినేని ఉమ, ఏ 3గా అమర్నాథ్ రెడ్డిపై కేసు - ఏ 4గా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సహా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, దొమ్మాలపాటి రమేష,  రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని తదితరులపై కేసు నమోదు చేశారు. 20 మందితో పాటు ఇతరులంటూ మరి కొందరు  నేతలపై కేసులు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. 


ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలతో వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 277 మంది టిడిపి నేతలపై కేసులు పెట్టారు.ఇందులో 71 మందిని అరెస్టు చేసి, 13 మంది చిత్తూరు జైల్లో పెట్టి, 58 మందిని కడప సబ్ జైలుకు తరలించారు. తొలుత 117 మందిపై కేసు పెట్టి తరువాత 160 మందిని చేర్చారు. కొత్త కేసు కలుపుకుంటే మొత్తం 299 మంది తేలారు. ఇంకా కొందరిని నిందితులుగా గుర్తించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి పరిణామం ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ప్రాజెక్టుల పరిశీలన, రోడ్ షోలో పాల్గొన్న మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా గొడవల్లో పాల్గొనక పోయినా హత్యా ప్రయత్నం, నేరపూరిత కుట్ర చేశారని కేసులో పేర్కొన్నారు.


ఒక విధంగా అంగల్లు, పుంగనూరు సంఘటనలు  టిడిపికి బెడిసికొట్టాయని చెప్పవచ్చు. మరొక విధంగా టిడిపి నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. పోలీసుల అనుమతికి విరుద్ధంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు వ్యవహరించారని అంటున్నారు. పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారని అరోపణలు చేశారు.అయితే పోలీసులు తనను చంపడానికి వైసిపి నేతలతో కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అంగళ్లు ఘటన మీద సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *