తేలని టిక్కెట్లు - తమ్ముళ్ళ ఇక్కట్లు !
గత ఓటమి నుండి జిల్లా తెలుగుదేశం పార్టీ గుణపాఠం చేర్చుకున్నట్లు కనిపించడం లేదు. అభ్యర్థుల ప్రకటనలో ప్రత్యర్ధుల కంటే ముందు ఉండాలన్న ఆలోచన కూడా లేదు. సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు టిక్కట్ల వ్యవహారం తేల్చడం లేదు. టికెక్కెట్టు కోసం ఎవరు కలిసినా, ముందు పార్టీని పటిష్టం చేయండి. తరువాత చూద్దాం అని అంటున్నారు. శాసన సభా ఎన్నికల్లో, స్థానిక సంస్థల, మునిసిపల్ ఎన్నికలలో ఘోర పరాభవం మూటకట్టుకున్నా, తెదేపాలో ముందస్తు ప్రణాళికలు కరువయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి ఇంచార్జిలు టికెట్ల కోసం నానా ఇక్కెట్లు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు స్వంత జిల్లాలో కూడా సకాలంలో అభ్యర్థులను ప్రకటించ లేక పోతున్నారు. దీనితో ఎవరికి టిక్కెట్టు వస్తుందో చెప్పలేని పరిస్థితుల కనిపిస్తున్నాయి. జిల్లాలో మూడు నియోజక వర్గాలు మినహా మిగిలిన 11 నియోజక వర్గాలలో వర్గ పోరు కొనసాగుతున్నది. కొన్ని చోట్ల తమను కాదని టిక్కెట్టు ఇస్తే ఓడించడానికి ప్రత్యర్ధులు సిద్ధం అవుతున్నారు.
కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారు. పలమనేరులో అమరనాద రెడ్డి, పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డిని కాదని టిక్కెట్టు అడిగే వారు లేరు. మిగిలిన చోట్ల తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నది. జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజక వర్గంలో చంద్రబాబు ఇప్పటివరకు ఇంచార్జిని కూడా పెట్టలేక పోయారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సి కె బాబుకు టికెట్టు ఇస్తే మంచిదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన కాజూరు బాలాజీ, AS మనోహర్, కటారి హేమలత, లేదా మాజీ ఎంపీ డి కె ఆదికేశవులు నాయుడు కుటుంబ సభులకు ఇవ్వాలని ఆ వర్గం నాయకులు కోరుతున్నారు. అయితే జిల్లా కేంద్రంలో కమ్మ సామాజిక వర్గం పట్టు కోల్పోవడం మంచిది కాదని ఆ వర్గం నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో గురజాల జగన్ మోహన్ నాయుడు, ఎన్ పి జయప్రకాష్ నాయుడు, చంద్రప్రకాష్ టిక్కెట్టు రేసులో ఉన్నారు.
పూతలపట్టు ఇంచార్జిగా డాక్టర్ మురళీ మోహన్ నియామకం నియోజకవర్గ నేతల్లో అసంతృప్తి కలిగిస్తోంది. నియోజక వర్గంలో పలువురు దళిత నాయకులు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం లేదు. జి డి నెల్లూరు నియోజక వర్గంలో మెజారిటీ మండల కమిటీ అధ్యక్షులు ఇంచార్జి డాక్టర్ థామస్ కు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. సత్యవేడు ఇంచార్జి హెలెన్ కు టిక్కెట్టు ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి మాజీ ఇంచార్జి జేడీ రాజశేఖర్ సిద్దం అవుతున్నట్టు తెలిసింది. అలాగే ఆయనను జనసేన నాయకులు కలసి పార్టీలోకి ఆహ్వానించారు.
చంద్రగిరిలో ఇంచార్జి పులివర్తి నానీకే టికెట్టు వస్తుందని ఒక వర్గం వాదిస్తున్నారు. నారా లోకేష్ ఈ మేరకు ప్రకటించారు. అయితే గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఈ సారి చంద్రగిరి నుండి పోటీ చేయడానికి ఆశక్తి చూపుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మనసులోని మాటను బయటపెట్టారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే తనకు చంద్రగిరి టిక్కెట్టు ఇవ్వాలని ఎన్ బి సుధాకర్ రెడ్డి పట్టుపడుతున్నారు. అలాగే ప్రముఖ వ్యాపార వేత్త డాలర్ దివాకర్ రెడ్డి టిక్కెట్టు రేసులో ఉన్నారు. అక్కడ తమ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయని ఆయన చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది.
తిరుపతిలో టిక్కెట్టు ఎవరికి వస్తుందో చంద్రబాబుకు కూడా తెలియదని అంటున్నారు. ఇంచార్జి సుగుణమ్మ పట్ల అధిష్టానం సుముఖంగా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మోహన్, ఊకా విజయకుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం తదితరులు టిక్కెట్టు ఆశిస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై అదే సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవానారాయన రెడ్డిలో ఒకరికి టిక్కెట్టు ఇవ్వడం మంచిదని కొందరు అంటున్నారు. బీసీ నేత పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుకు టిక్కెట్టు ఇవ్వాలని కొందరు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో చల్లా రామచంద్రా రెడ్డి అభాసు పాలయ్యారని ఒక వర్గం ప్రచారం ప్రారంభించింది. అతని తొందర పాటు చర్యల వల్ల చంద్రబాబు సహా పలువురు నాయకులు,కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఆయన కంటే మాజీ ఇంచార్జి అనీషా రెడ్డి మేలని కొందరు అంటున్నారు. మదనపల్లి టిక్కెట్టు కోసం దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షాజాన్ బాషా ఇద్దరు ప్రయత్నిస్తున్నారు.
తంబళ్లపల్లె ఇంచార్జి శంకర్ యాదవ్ కంటే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి మేలన్న వాదన వినిపిస్తోంది. చిత్తూరు ఎంపీ టిక్కెట్ కోసం మాజీ ఎస్పీ పి చిన్నస్వామి, మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని కాదని వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని తెరపైకి తెస్తున్నారు.
ప్రతి నియోజక వర్గంలో పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సొంత పార్టీ వారే ఒకరిని ఒకరు ఓడించడానికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు నాన్చుడు దోరణి వల్లే గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 13 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపి స్థానాలు ఓడిపోవలసి వచ్చిందని అంటున్నారు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకుని ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదంటున్నారు.
NOTE
👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు.
👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.
👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.
👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.
👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.