చంద్రబాబును చల్లగా ఇరికించిన చల్లా బాబు !?
పుంగనూరు సంఘటన టిడిపి నేతలకు ఊపిరాడటం లేదు. అనాలోచితంగా ప్రవర్తించడం వల్ల అబాసు పాలయ్యారు. వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పోలీసు కేసులకు భయపడి అజ్ఞాతం వాసం చేస్తున్నారు. ముఖ్యమైన సమయంలో మఖ్య నాయకులు ముందస్తు బెయిలు కోసం హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఓట్ల చేరికలు, తీసివేతల మీద కసరత్తు జరుగుతోంది. ఎక్కడెక్కడ బోగస్ ఓట్లను నమోదు చేశారో తెదేపా నాయకులు గుర్తించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. ఎక్కడెక్కడ తెదేపా ఓట్లను తొలగించారో చూసుకొని ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసు కేసుల కారణంగా జిల్లాలో దొంగ ఓట్ల ఏరివేత, తొలగించిన ఓట్ల తిరిగి నమోదు కార్యక్రమం జరగడం లేదు. దొంగ ఓట్ల నమోదు గురించి ఫిర్యాదు చేయడానికి ఈ నెల 28న చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. అయితే జిల్లాలో ఈ ప్రక్రియకు అవరోధం ఏర్పడింది. అలాగే చల్లా బాబు కారణంగా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా, ఆఖరికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అభద్రతకు గురవుతున్నారు. ఈ నెల 24న తిరుపతిలో తలపెట్టిన జోన్ ఫోర్ సమావేశం వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో పుంగనూరు టిడిపి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి (బాబు) నిర్వాకం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును చల్లా బాబు చల్లగా ఇరికించారని అంటున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యవహారాలను ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులే ఆఖరికి పరారు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చల్లా బాబు ముఖ్య నేతలతో సంప్రదించకుండా పొలిటికల్ మైలేజ్ కోసం ఆఖరు నిమిషంలో చంద్రబాబును బురద తొక్కించారని అంటున్నారు. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ చల్లా బాబు పోలీసులకు దొరక్కుండా రహస్య స్థావరంలో ఉన్నారు. ఆయన డ్రైవర్ నవీన్‌కుమార్, అమర్‌నాథ్, పెద్దన్నలను పోలీసులు అరెస్టు చేశారు. చల్లా బాబు డ్రైవర్‌ను పోలీసులు విచారించి, తమకు అనుకూలంగా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఇందులో కుట్ర కోణం ఉందని నమోదుచేశారు. ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు, అమరనాధ రెడ్డి, నాని, కిషోర్ కుమార్ రెడ్డి, దేవినేని ఉమాలను కుట్రదారులుగా ఇరికించారు. కుట్రలకు సంబంధించిన పూర్తి ప్లాన్‌ను స్పష్టంగా వివరించినట్లు నమోదు చేశారు. నిందితుడి నేర ఒప్పుదల వాంగ్మూలం తమకు అనుకూలంగా పోలీసులు రాసుకున్నారు. ఈ నెల నాలుగవ తేదీ చంద్రబాబు నాయుడు పర్యటన పుంగనూరు బైపాస్ మీద వెళ్లాల్సి ఉంది. అనుమతి లేకున్నా పుంగనూరు పట్టణంలోకి వెళ్లడానికి టీడీపీ నేతలు పట్టుపట్టడం, ఆపై పోలీసులను చంపాలని విధ్వంసకాండ సృష్టించగా ఓ పోలీసు కంటిచూపు పోగొట్టుకోగా, పలువురు పోలీసులకు తలలు పగిలి రక్త గాయాలైన విషయం తెలిసిందే. ఈ కుట్రకు ఈనెల ఒకటవ తేదీనే టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డ్రైవర్ చెప్పినట్లు రాశారు. చల్లబాబు పి ఏ గోవర్దన్‌రెడ్డి నుండి కూడా పోలీసులు తమకు అనుకూలంగా వాంగ్మూలం నమోదు చేశారు. వాళ్ళు అలా చెప్పారో లేదో కేసు విచారణకు వచ్చినపుడు తెలుస్తుంది. అప్పటి వరకు వారి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తమ పనులను చక్కపెట్టుకుంటున్నారు.
పోనీ సమస్య ఉత్పన్నం అయిన తరువాత అయిన తెలివిగా వ్యవహరించి ఉంటే తీవ్రత తగ్గేది న్యాయ నిపుణులు అంటున్నారు. టిడిపి నాయకులు కూడా వైసిపి, నాయకులు, పోలీసులపై కేసులు పెట్టి ఉంటే బాగుండేది అంటున్నారు. పోలీసులు కేసులు తీసుకోక పోతే ప్రైవేటు కేసులు వేసి ఉంటే మంచిదంటున్నారు. అలాగే కేసులకు భయపడి రహస్య స్థావరాల్లో దాక్కోవడం మాని మూకుమ్మడిగా పోలీసులకు లొంగిపోయి ఉంటే జాతీయ స్థాయిలో మైలేజ్ వచ్చి ఉండేదని అంటున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి లొంగిపోయి పోలీసులు అమాయకులైన టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్న వాదన ప్రచారం చేసి ఉంటే పార్టీ ప్రతిష్ట పెరిగేది అంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా లొంగిపోవడం మంచిదని చల్లా బాబుకు సూచించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆయన తనను కూడా ఎంపి రఘురామ కృష్ణం రాజును కొట్టినట్టు కొడతారని, దొరికితే పిడి యాక్టు పెడతారని భయపడి హై కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ వేశారు. దాని విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేశారు.
ఇదిలా ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు కొందరు పరారీలో ఉండటం వల్ల కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం క్షీణిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అమరనాధ రెడ్డి, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, రాజంపేట పార్లమెంటు ఇంచార్జి గంటా నరహరి, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు పరారీలో ఉన్నారు. అలాగే 1000 మందికి పైగా కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్ళి పోయారు. ఇప్పుడు జిల్లాలో టిడిపికి అనుకూలంగా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే అందరూ భయపడుతున్నారు. జైళ్లలో ఉన్న వారిని పరామర్శించడానికి కూడా ఎవరు రాకపోవడం పట్ల కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల నాలుగున అంగళ్లు, పుంగనూరులో జరిగిన సంఘటనల్లో 500 మందికి పైగా టిడిపి కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో చల్లా బాబు, ఇతర నాయకులు పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు.