12, ఆగస్టు 2023, శనివారం

స్వరం మార్చిన పవన్ .... తెదేపా పొత్తుపై సందిగ్ధం ?

బాబుపై కేసులను ఖండించని పవన్
బిజెపితో కలిసి పోటీ చేసే అవకాశం
జనసేనలో చేరనున్న సీమ రెడ్లు
టిడిపి కార్యకర్తల్లో గుబులు


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో స్వరం మారింది. గతంలో ఓట్లు చీలనివ్వనని, జగన్ మోహన్ రెడ్డి ఓడించడమే లక్ష్యం అంటూ మాట్లాడారు. అయితే గురువారం విశాఖలో పట్నంలో ప్రారంభించిన మూడవ దశ వారాహి యాత్రలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే జగన్ అక్రమాలపై విచారణ చేయిస్తామన్నారు.  సీఎం కావాలని తాను అనుకుంటే సరిపోదని, ప్రజలు అనుకుంటేనే సాధ్యం అన్నారు.  ఎవరో కొద్దిమంది కూర్చుని ఇష్టారాజ్యంగా పాలిస్తామంటే చూస్తూ ఉండటానికి తాను మౌన ముని కాదన్నారు. పాలకులు ప్రజల బానిసలు అని నిరూపిస్తానని స్పష్టం చేశారు. తాను ఒక్క మాట మాట్లాడితే వైసీపీ నేతలు గయ్యిమంటున్నారని, తాను వారికి  భయపడనన్నారు. దోపిడీలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్న తనకు ఎంత ధైర్యం ఉంటుందని పవన్ ప్రశ్నించారు. వైసీపీని ఆంధ్రా నేల నుంచి తన్నితగలేసే వరకూ, ఉత్తరాంధ్రను వైసీపీ నుంచి విముక్తం చేసే వరకూ జనసేన పోరాడుతూనే ఉంటుందన్నారు. 

అయితే ఒక్క మాట కూడా టిడిపిని గూర్చిగాని, చంద్రబాబుకు అనుకూలంగా కానీ మాట్లాడక పోవడం గమనార్హం. ఈ నెల నాలుగవ తేది అంగల్లులో జరిగిన గొడవల ఆధారంగా చంద్రబాబుపై పెట్టిన హత్యాయత్నం కేసును జనసేన, భాజాపా ఖండించలేదు. జగన్ అక్రమాల చిట్టా చాలా చెప్పినప్పటికీ, అంగల్లు, పుంగనూరు సంఘటనలను గూర్చి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యం పరిశీలిస్తే తాను, బిజెపి మద్దతుతో పోటీ చేసి ముఖ్య మంత్రి కావాలని కోరుకుంటున్నట్టు భావించక తప్పదు. చాలా మంది జనసేన కార్యకర్తలు కూడా ఇదే భావనలో అంటున్నారు. 

గత ఏడాది ఒంగోలు మహానాడు జరిగిన తరువాత రాష్ట్రంలో టిడిపి గాలి వీస్తున్న వాతావరణం కనిపించింది. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు  గెలవడంతో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసినా టిడిపి అధికారంలోకి వస్తుందన్న ప్రచారం జరిగింది. గత మే నెలలో రాజమండ్రిలో జరిగిన మహానాడు తరువాత టిడిపి గాలి అనూహ్యంగా తగ్గింది. మినీ ఎన్నికల ప్రణాళిక పేరుతో ప్రకటించిన ఉచితాలు బెడిసికొట్టాయి. జగన్ చేస్తే తప్పు అదే పని చంద్రబాబు చేస్తే ఒప్పా అన్న చర్చ మధ్యతరగతి ప్రజల్లో తలెత్తింది. దీనికి తోడు పార్టీ ఇంచార్జిల నియామక ఇతర అంశాలు  కార్యకర్తల్లో అసంతృప్తిని పెంచాయి. పుంగనూరు సంఘటనలో పోలీసుల చంద్రబాబుతో సహా 317 మందిపై కేసులు పెట్టారు. ఇప్పటికీ 81 మందిని అరెస్టు చేశారు. ముఖ్యమైన నేతలు అందరూ పరారీలో ఉన్నారు. కార్యకర్తలకు భారోసా ఇచ్చే వారు కరువయ్యారు.దీంతో క్రమంగా టిడిపి గాలి తగ్గుతూ వచ్చింది.

 విశాఖపట్నం వారాహి యాత్రకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టిడిపితో పొత్తుకు అయిష్టంగా ఉన్నారని సమాచారం. బిజెపి జాతీయ నాయకులు కూడా అదే పంథాలో ఆలోచిస్తున్నారని ఒక కీలక నేత చెప్పారు. ఈ నేపథ్యంలో బిజెపి, జనసేన కలసి అన్ని స్థానాలలో పోటీ చేస్తే అధికారంలోకి రావచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలిసింది. దీనితో టిడిపి కార్యకర్తల్లో భయం ప్రారంభం అయ్యిందని అంటున్నారు. 

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మూడో దశ గురువారం విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఇక్కడి నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే యాత్ర కొనసాగించేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. శుక్రవారం జనసేన నేతలతో కలసి దీనిపై చర్చలు జరిపారు. అలాగే పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ నేతలతో చర్చించి వారాహి మూడో దశ యాత్ర షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ పదిరోజుల యాత్ర విజయవంతం అయితే పవణ్ కళ్యాణ్ లో మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉందంటున్నారు. తరువాత రాయల సీమలో నాలుగవ విడత వారాహి యాత్ర ప్రారంభిస్తారు. అంతకు ముందే రాయలసీమలోని ఇతర పార్టీలకు చెందిన కొందరు నాయకులను పార్టీలో చేర్చుకుంటారని సమాచారం. 


ఇప్పటికే కాంగ్రెస్, తెదేపా, వైసీపీలో అసమ్మతి నేతల వివరాలను సేకరించారు. నియోజకవర్గాల వారిగా జాబితాలు సిద్ధం అయ్యింది. పార్టీలో ప్రాధాన్యత కోరుకున్నా, లభించని నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ టిక్కెట్టు ఆశించి, బంగపడిన నేతలే లక్ష్యంగా ఎంచుకున్నారు. రాయలసీమలో ప్రతి జిల్లాలో నలుగురు, ఐదుగురు రెడ్డి నాయకులను జనసేనలోకి చేర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. పవన్ రాయలసీమ యాత్రలో వీటికి ఒక రూపం వచ్చే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో కనీసం ఇద్దరు రెడ్డి అభ్యర్థులకు జనసేన టిక్కెట్టు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. రాయలసీమలో 12 మంది రెడ్లకు టిక్కెట్లు ఇవ్వాలని ఇవ్వటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *