తిరుపతిలో చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్దం !?
చంద్రబాబుకు అండగా నిలువని స్థానిక జిల్లా నాయకులు
పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పత్రికా ప్రకటన ఇవ్వాలన్నా భయం
బాబు మీద దాడి చేసినా, కేసు పెట్టినా స్పందన కరవు
ఉత్తర కుమారులుగా పలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు
ఎదో చేస్తున్నట్లు నటిస్తున్న కొందరు నేతలు
జిల్లాలో రాస్తారోకోలు, ధర్నాలు, అందోళనలు కరవు
జిల్లాలో అంతుచిక్కని నాయకుల మనోగతం
మాజీ ముఖ్య మంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంకృత అపరాధం వల్ల స్వంత జిల్లాలో ఎదురీదుతున్నారు. అనవసరంగా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ఇరుక్కన్నారు. ఆయనను అరెస్టు చేయడానికి వీలుగా పోలీసులు గట్టి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ నెల 24న పార్టీ జోన్ 4 కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు రానున్నారు. కావున చంద్రబాబును తిరుపతిలో అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎవరైనా విజయం సాధించాలి అనుకుంటే, పటిష్టమైన టీం ఉండాలి. ఆ టీంలో వ్యూహరచన చేసే వాళ్ళు ఉండాలి. ఆ వ్యూహం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో అంచనా వేయాలి. ఆ వ్యూహంను అమలు చేసే క్యాడర్ ఉండాలి. అమలు తీరును పర్యవేచించడానికి నాయకత్యం ఉండాలి. వ్యూహం అమలుకు సంబంధించి అవసరమైన సరంజామా సమకూర్చుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో జరగాలి. కింది స్థాయి వారు ఆ వ్యూహంను అమలు చేయడానికి శిక్షణ ఉండాలి. అల కాకుండా, ఒకరిద్దరు మీద ఆధారపడితే, వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం ఉంది. జిల్లాలో తెదేపా పరిస్థితి ఒక రకంగా చెప్పాలి అంటే, అగమ్యగోచరంగా ఉంది. జిల్లాలో సరైన టీం లేదు. పార్టీలో సమర్ధులను సొంత సామజిక వర్గం మాటలు విని దూరం చేసుకున్నారు. పార్టీ, ఎన్నికలు అంటే అవగాహన లేనివారిని అందలం ఎక్కించారు. అనుభవజ్ఞులు పార్టీకి దూరం కావడంతో ఉమ్మడి జిల్లాలో తెదేపా ఎదురితుతోంది.
రాజకీయ పరిణితి లేని నాయకత్యం కారణంగా నేడు చంద్రబాబు హత్యాయత్నం కేసుల్లో ఇరుక్కున్నారు. ఒక నియోజకవర్గ ఇం ఛార్జ్ ని నియమించే ముందు వారి సామర్ధ్యం గురించి అవహాహన ముఖ్యం. అలా కాకుండా, ఎదో వచ్చారనో, ఎవరో చెప్పారనో, తండ్రులు, తాతలు MLAలుగా పనిచేశారనో నియమించడం జరుగుతోంది. జిల్లాలో చంద్రబాబు మీద దాడి జరిగిన తరువాత జిల్లాలో ఉహించిన స్థాయిలో ప్రతిఘటన రాలేదు. చంద్రబాబు మీద హత్యాయత్నం కేసు నమోదు అయినా, జిల్లా తెదేపా నాయకులు స్పందించలేదు. రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు జరగలేదు. నియోజకర్గం, జిల్లా స్థాయిలో నాయకులు స్పందించలేదు. తంబళ్ళపల్లి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, పీలేరు, చంద్రగిరి నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ల మీద కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల నుండి ప్రతిఘటన లేకపోవడం రాష్ట్ర నాయకులకు అర్థం కావడం లేదు. చాలా నియోజక వర్గాల్లో ఉత్తర కుమారులే నాయకత్వం వహిస్తున్నరన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. సమర్ధులైన నాయకులను పక్కన పెట్టడం, ఉన్న నాయకులకు భాధ్యతలు అప్పగించక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందని అంచనా వేస్తున్నారు. అందుకే జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పత్రికా ప్రకటన ఇవ్వడానికి కూడా ఉత్తర కుమారులు సాహసించడంలేదని అంటున్నారు.
పుంగనూరులో ఈ నెల నాలుగవ తేదీ పోలీసులపై టిడిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేసిన సంఘటనలో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు. అంగల్లు సంఘటనలో ఏ1గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అసమర్థ నాయకులను నమ్మి తానే నష్ట పోతున్నారు. ఆయనపై పోలీసులు పెట్టిన కేసులు తప్పనే నాయకులు కూడా కరువయ్యారు. కొందరు కీలక నేతలు పరారీలో ఉన్నారు. కేసుల్లో లేనివారు పోలీసులు, ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై విమర్శలు చేయడానికి భయపడుతున్నారు. లోకేష్ ఎక్కడో పాదయాత్ర చేస్తూ జిల్లా ఎస్పీని సైకో అంటూ విమర్శించి రెచ్చగొట్టారు. పోలీసులు చట్ట పరంగా ఆధారాలు సేకరించి చంద్రబాబును అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టులో కూడా టిడిపి నేతలకు చుక్కెదురైంది. కొంత మంది వేసిన క్వాష్ పిటిషన్ కు కోర్టు ప్రతికూలంగా వ్యాఖ్యానించింది. హత్యా ప్రయత్నం కేసును కొట్టివేయమని చెప్పలేమని ముందస్తు బెయిలు పిటిషన్ వేసుకోమని న్యాయమూర్తులు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 లేదా 25న పార్టీ జోన్ 4 కార్యకర్తల సమావేశానికి తిరుపతి వస్తున్న చంద్రబాబును అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పటికి కోర్టు బెయిలు మంజూరు చేయక పోతే అరెస్టు చేయడానికి అవకాశం ఉందని అంటున్నారు.దీనికి అనుగుణంగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు.
అపర చాణక్యుడు అయిన చంద్రబాబు నేరపూరిత కుట్ర, హత్యా ప్రయత్నం కేసులో ముద్దాయిగా మారారు. దీని వెనుక ఆయన ప్రేరణ, చల్లా రామచంద్రా రెడ్డి ( బాబు) హస్తం ఉన్నట్టు పోలీసులు సాక్ష్యాలు సేకరించి నట్టు తెలిసింది. కుట్రలో ప్రధాన ముద్దాయిగా ఉన్న చల్లా బాబు డ్రైవరు కలకడ నవీన్ కుమార్ సహా నిందితులు దోవల అమర్ నాథ్, సి.పెద్దన్నలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం వ్యవహారం కూపీ లాగి రికార్డ్ చేసినట్టు తెలిసింది. తరువాత ముగ్గురిని కోర్టుకు సమర్పించిన రిమాండ్ విధించింది కడప జైలుకు తరలించారు. వారు అందించిన సమాచారం ప్రకారం చంద్రబాబు అనుమతితోనే చల్లా బాబు దాడులు చేయించారని పోలీసులు రికార్డు చేసినట్టు సమాచారం. పుంగనూరు వద్ద జరిగిన విధ్వంసకాండతో పలువురు పోలీసులపై హత్యాయత్నం జరగడం, వాహనాలు తగులబెట్టిన కేసులో పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ చల్లా బాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన. పోలీసులకు దొరక్కుండా రహస్య స్థావరంలో ఉన్నారు. ఆయన డ్రైవర్ నవీన్‌కుమార్, అమర్‌నాథ్, పెద్దన్నలను పోలీసులు అరెస్టు చేశారు. చల్లా బాబు డ్రైవర్‌ను పోలీసులు విచారించగా ఈ కుట్రలకు సంబంధించిన పూర్తి ప్లాన్‌ను స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. నిందితుడి నేర ఒప్పుదల వాంగ్మూలంలో పలు విషయాలను పూస గుచ్చినట్లు చెప్పేశాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల నాలుగవ తేదీ చంద్రబాబు నాయుడు పర్యటన పుంగనూరు బైపాస్ మీద వెళ్లాల్సి ఉంది. అనుమతి లేకున్నా పుంగనూరు పట్టణంలోకి వెళ్లడానికి టీడీపీ నేతలు పట్టుపట్టడం, ఆపై పోలీసులను చంపాలని విధ్వంసకాండ సృష్టించగా ఓ పోలీసు కంటిచూపు పోగొట్టుకోగా, పలువురు పోలీసులకు తలలు పగిలి రక్త గాయాలైన విషయం తెలిసిందే. ఈ కుట్రకు ఈనెల ఒకటవ తేదీనే టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఉదయం చల్లా బాబు, ఆయన పి ఏ గోవర్దన్‌రెడ్డి, తాను రొంపిచెర్ల నుంచి పుంగనూరు కారులో బయలుదేరామని డ్రైవరు నవీన్ కుమార్ చెప్పారని తెలిసింది.
కొద్ది దూరం వెళ్లగానే చల్లా బాబు ఫోన్‌లో మాట్లాడుతూ ‘సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నారని తెలిపారు. "బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లు అన్నీ అక్కడ డంప్ చేస్తాం. మిమ్మల్ని టౌన్‌లోకి రానివ్వమంటూ పోలీసులు చెప్పగానే మనవాళ్లు దాడి చేస్తారు. పోలీసులను కానీ, అవసరమైతే వైసీపీ వాళ్లపై దాడి చేసి చంపైనా సరే మీరు చెప్పినట్లే పోగ్రాం పెట్టిస్తా సార్ " అని మాట్లాడినట్లు సమాచారం. మరుసటి రోజు తన ఇంటి వద్ద జరిగే అతి ముఖ్యమైన సమావేశానికి పిలవాల్సిన కొందరి పేర్లను గోవర్దర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌కు చల్లా బాబు అప్పగించాడని తెలిసింది. రెండవ తేది రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లె పంచాయతీ, గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా బాబు ఇంటి వద్ద టీడీపీలోని ముఖ్యమైన నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారని తెలిపారు. టీడీపీకి చెందిన హేమంత్‌రెడ్డి, మోహన్‌నాయుడు, నగేష్, రమేష్‌రెడ్డి ఇంకా పలువురు ముఖ్య నేతల్ని పిలిపించిన చల్లా బాబు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇందులో రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు, కర్రలు ఎక్కడ డంప్ చేయాలో చెప్పాడని డ్రైవర్ తెలిపారు. పోలీసులు కాల్పులు ఓపెన్ చేసేలా ఎలా రెచ్చగొట్టాలో ఆదేశాలిచ్చాడు. ఒకరిద్దరు ఖాకీల ప్రాణాలు పోతే.. టీడీపీ కార్యకర్తలు చేసే బలిదానం వల్ల పార్టీ మైలేజ్ పెరుగుతుందని నమ్మబలికాడు. ఇదే జరిగితే రాష్ట్రంలో అధికార పార్టీకి జరిగే డ్యామేజ్, టీడీపీకి వచ్చే మైలేజ్ గురించి వివరించాడు. ఎవరెవరు ఏ పనులు చేయాలో అప్పగించి, అంతా అనుకున్న ప్లాన్ ప్రకారం జరగాలని చల్లా బాబు ఆదేశించాడని సమాచారం. వ్యూహం అమలుపై ప్లాన్ చల్లాబాబు మరికొంత మంది టీడీపీ నాయకుల్ని తన ఇంటి వద్దకు పిలిపించాడు. పుంగనూరు విధ్వంసకాండ ఎలా చేయాలి? పోలీసులను ఎలా చంపాలి? ఖాకీలు ఫైర్ ఓపెన్ చేసేలా రెచ్చగొట్టే విధానం? ఆపై జరిగే అల్లర్లలో ఎవరెవరి పాత్ర ఏమిటనే ప్లాన్ గురించి చెప్పాడని తెలిపారు\
నాలుగవ తేదీ ఉదయం పది గంటలు చల్లా బాబు అంగళ్లుకు వెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆపై చల్లా బాబు, అతని పీఏ గోవర్దన్‌రెడ్డి, డ్రైవర్ నవీన్‌కుమార్‌తో కలిసి కారులో పుంగనూరు బయలుదేరారు. కారు మదనపల్లె దాటిన తర్వాత.. ‘వీఐపీ కంటే మనం ముందుండాలి.. అక్కడ ఏం చేయాలో ముందుగా అనుకున్నట్లే అంతా జరగాలి’ అని గోవర్దన్‌రెడ్డిని చల్లా బాబు ఆదేశించాడు.‘అన్నా.. ఇదే జరిగితే పెద్ద గొడవలు జరుగుతాయి. పోలీసులు మనపై కేసులు పెడతారు. ఎట్టా అన్నా..’ అని గోవర్దన్‌రెడ్డి, చల్లా బాబును ప్రశ్నించినట్లు తెలిసింది. ‘పోలీసులు పెట్టే కేసుల్ని కోర్టులో మన ‘సార్’ చూసుకుంటాడు..’ అని చల్లా బాబు భరోసా ఇచ్చాడు. ఆపై జరిగిన విధ్వంసకాండలో చల్లా బాబు దగ్గరుండి మరీ టీడీపీ నేతల్ని రెచ్చగొట్టి.. పోలీసులను చంప్రేయండ్రా అంటూ, వాళ్ల వాహనాలను తగులబెట్టాలంటూ ఆదేశాలు ఇచ్చాడని నవీన్ కుమార్ చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలసులు తగిన సాక్ష్యాధారాలు సేకరించి చంద్రబాబుతో సహా పలువురిపై పోలీసులు కట్టుదిట్టంగా కేసులు పెట్టారు. దీనితో చంద్రబాబు కూడా సమస్యలను ఎదుర్కోక తప్పదు అంటున్నారు.