జగనన్న వదిలిన బాణం బూమరాంగ్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతగా YS షర్మిల
ఈ ఎన్నికలలో జగనన్న ఓటమే లక్ష్యం
జగనన్న సామ్రాజ్యాన్ని కూల్చడమే కర్తవ్యం
చంద్రబాబును గెలిపించడమే ధ్యేయం
2029 ఎన్నికల నాటికీ అధికారమే పరమావధి
తెలుగు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి బతికున్నంతకాలం షర్మిల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌ని వీడిన తన సోదరుడు వై.ఎస్. జగన్ రాజకీయ ఎదుగుదలకు అండగా నిలిచారు. ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీ నిర్మాణంలో తోడ్పడ్డారు. తనకు తాను ‘జగనన్న వదిలిన బాణం’ అని ప్రకటించుకున్న వైఎస్. షర్మిల... పాదయాత్ర చేసి కష్టకాలంలో వైఎస్సార్సీపీని ఒడ్డున పడేశారు. వాస్తవానికి, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల లోక్ సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. రాజ్యసభకు పంపుతారని ఆశించినా, ఆ ఆశ కూడా నెరవేరలేదు. జగనన్నకు ఎందరు, ఎన్ని రకాలుగా నచ్చచెప్పినా, జగన్ లెక్కచేయలేదు. అన్న వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ కోసం షర్మిల ఎంత కష్టపడ్డా, టిక్కెట్ విషయంలో అన్న నుంచి సానుకూల స్పందన రాలే.
అయితే, 2019లో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో షర్మిలకు విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఆమె ఒంటరిగా రాజకీయాల్లో ఎదగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఏపీలో జగన్‌కి వ్యతిరేకంగా కాకుండా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణను ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, అన్నతో రాజకీయంగా తెగతెంపులు చేసుకుని, తెలంగాణకు వచ్చేశారు వైఎస్ షర్మిల. కుమార్తెకు అండగా వుండే క్రమంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ కూడా రాజీనామా చేసేశారు.! తెలుగు రాష్ట్రాలలో తండ్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఇమేజ్ తెలంగాణలోనూ సాయపడుతుందని భావించి, 2021లో వైఎస్సార్ జయంతి రోజునే కొత్తపార్టీ స్థాపించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, తెలంగాణ రాష్ట్రంలోనూ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. మహిళా రాజకీయ నాయకుల్లో ఇంకెవరికీ సాధ్యం కాని ‘రేర్ ఫీట్’ పాదయాత్రల విషయంలో వైఎస్ షర్మిల సాధించారన్నది నిర్వివాదాంశం. ఎంత చేసినా షర్మిలకు తెలంగాణలో అనుకూల పవనాలు వీచడంలేదు.
కావున, వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు భుజానికి ఎత్తుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఇటీవల ఈ విషయంపై స్పందించారు. షర్మిలను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. షర్మిల చేరికతో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందని.. పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందని కేవీపీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఎంతోకొంత లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో దళిత ఓటు బ్యాంక్ ప్రస్తుతం జగన్ పార్టీకి అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఈ ఓటు బ్యాంక్ చీలే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు కూడా రెండుగా చీలే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరనుంది.
ఉమ్మడి ఏపీని ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్ఆర్‌కు ఎంతో కొంత ఉన్న ఆదరణ కారణంగానే ప్రజలు ఆయన కుమారుడు జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాగే వైఎస్‌ఆర్‌కు నిజమైన రాజకీయ వారసురాలిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌లో ఆదరాభిమానాలు దక్కే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ గెలుపు కోసం వైఎస్ షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఆ సందర్భంలో షర్మిలను ప్రజలు బాగానే ఆదరించారు. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక కచ్చితంగా జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఏపీ కాంగ్రెస్‌కు షర్మిల సారథ్యం వహిస్తే జగన్ సర్కార్‌కు గండంగా మారిన ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైఎస్ఆర్‌ను అభిమానించే ఏపీ కాంగ్రెస్ నేతల్లో మెజారిటీ లీడర్లు ప్రస్తుతం జగన్‌తో ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు అవమానాలే ఎదురయ్యాయని పలువురు నేతలు గగ్గోలు పెట్టిన సందర్భాలున్నాయి. జగన్ నియంతలా పాలన చేస్తున్నారని.. కనీసం తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని.. ఒకవేళ ఇచ్చినా జగన్ ముందు నిలబడే మాట్లాడాలని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసే అవకాశముంది. మరోవైపు వైఎస్ఆర్ కుమారుడిగా జగన్‌ను ఆదరించిన నేతలు కుమార్తెగా షర్మిలను కూడా అభిమానించి ఆమె వెంట నడిచే ఛాన్స్ ఉంది.
మరోవైపు ఏపీలో జగన్ పాలనపై మెజారిటీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని జగన్ సర్వనాశనం చేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రతిపక్ష పార్టీలు షేర్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే తల్లి, చెల్లినే పట్టించుకోని జగన్ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నిట్టనిలువుగా చీలడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం దాదాపుగా అయినట్టే. నేడో, రేపో దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అందరూ వెలువడుతుందని అందరూ అంటున్నారు. మొన్నటిదాకా ఇదే విషయం మీద బెంగళూరులో ఉండి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చల మీద చర్చలు నడిపి హైదరాబాద్ వచ్చిన షర్మిల సైలెంట్ అయిపోయారు.
పార్టీ విలీనం సందర్భంగా కాంగ్రెస్ షర్మిల ముందు పెద్ద టాస్క్ విధించిందని ప్రచారం జరుగుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా ఉండేది. ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కలిగి ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నేల చూపులు చూస్తోంది. జగన్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో లేచే అవకాశాలు కనిపించడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీని కాపాడుకోవాలి అంటే బలమైన శక్తి కావాలి. ఆ శక్తి తమకు షర్మిల రూపంలో లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు షర్మిల ఇష్టపడలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా షర్మిల తన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలోని పాలేరు లేదా సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేయాలని షర్మిల అనుకున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయవద్దని, కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోతే ఏపీ లోని బాధ్యతలు విషయంలో సమస్యలు వస్తాయని కాంగ్రెస్ పెద్దలు ఆమెకు నచ్చజెప్పారు. ఇదే సమయంలో సూచించిన వారికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని షర్మిలకు హామీ ఇచ్చారు. ఇక ఏపీలో 2024 ఎన్నికల్లో లక్ష్యం ఏమిటో కాంగ్రెస్ పార్టీ షర్మిలకు అర్థమయ్యేలా చెప్పింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా జగన్ వైపు వెళ్లిందని, 2024 ఎన్నికలలో తిరిగి ఆ ఓటు బ్యాంకు తామవైపు తిప్పు కూడా సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. ఫలితంగా 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అవసరమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీని ద్వారా 2029 ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుందని వారు లెక్కలు వేసుకుంటున్నారు. దీనికోసం షర్మిలకు పార్టీలో జాతీయస్థాయిలో పదవి ఇవ్వడంతో పాటు ఏపీలో నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ నాయకుల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ వ్యూహాలకు పూర్తిగా షర్మిల సహకరిస్తారా? షర్మిల ఏపీలో కాంగ్రెస్ నేతగా ఎంట్రీ ఇస్తే నిజంగా జగన్ ఓటు బ్యాంకు ను టార్గెట్ చేసే స్థాయిలో ప్రభావితం చేయగలరా? అందరూ అనుకున్నట్టు షర్మిల కాంగ్రెస్ విధించిన టాస్క్ పూర్తి చేయగలరా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.