30, ఆగస్టు 2023, బుధవారం

కుప్పంలో చంద్రబాబు కోట బీటలు వారుతుందా !?

నష్ట నివారణ చర్యలు చేపట్టిన బాబు 
యువగళం  ప్రారంభోత్సవంలో  బలప్రదర్శన 
మూడు నెలకు ఒక సారి కుప్పం పర్యటన 
కుప్పంలో బాబు  సొంత  ఇంటి నిర్మాణం 
సేవా కార్యక్రమాలతో భువనేశ్వరి రంగప్రవేశం 




కుప్పం నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోయిన ఆయన అక్కడ గెలవడం తథ్యం. ఎన్నికల ప్రచార బాధ్యతలను చంద్రబాబు PS మనోహర్ నాయుడు, మాజీ  ఎమ్మెల్సీ శ్రీనివాసులు, రెస్కో చైర్మన్ రంగస్వామి నాయుడు తదితరులు దగ్గరుండి చూసుకునేవారు. కుప్పం నియోజకవర్గం ప్రజలకు చంద్రబాబు ఒక దేవుడు. ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన ప్రగతిశీలుడు చంద్రబాబు. గతంలో కుప్పం నియోజకవర్గంలో అంటే ఉద్యోగులకు పనిష్మెంట్ ప్రాంతం. భూములకు  ధరలు లేవు. అభివృద్ధి లేదు. పంటలు లేవు. తాగడానికి కూడా గుక్కెడు నీళ్ళు లేవు. అక్కడి ప్రజలు సమస్యలతో సహజీవనం చేశారు. 

1989లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఏడుసార్లు అప్రతిహస్తంగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు. కుప్పం అంటే  చంద్రబాబు నాయుడుకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా కంచుకోట. గతంలో చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో పోటీ చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. పోటీ చేసినా ఓడిపోతామని  తెలిసి పోటి చేసే వాళ్ళు. చంద్రబాబు మీద పోటీ చేశామన్న గౌరవం అన్నా దక్కుతుందనే భావంతో పలువురు పోటి చేశారు. ఓడిపోయినా, ప్రభుత్వం వస్తే నామినేట్ పదవి వస్తుందని ఆశ పడే వాళ్ళు. చిత్తూరు మాజీ MLA గోపీనాథ్ కూడా ఒకప్పుడు కుప్పంలో పోటి చేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో MLC అయ్యారు. అక్కడ పోటి చేయడానికి   అభ్యర్థులు లేకున్నా ఎవరినో ఒకరిని  బ్రతిమాలి రంగంలోకి దించేవాళ్లు. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు విజయం లాంచనమే. చంద్రబాబు నాయుడు ప్రచారానికి కానీ, నామినేషన్ వేయడానికి కానీ కుప్పం నియోజకవర్గానికి అడుగుపెట్టకనే గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి.


అయితే కాలక్రమంలో  పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గతంలో మూడు పర్యాయాలు నియోజకవర్గంలో నుంచి గెలిచిన జడ్పిటిసి అభ్యర్థి జిల్లా పరిషత్  చైర్మన్ అవుతున్నారు. కుప్పంలో  పాగా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు జరిగాయి. కుప్పం నియోజకవర్గంలో గెలిచిన వారికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. ఆ రకంగానే M. రెడ్డమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, గోవింద శ్రీనివాసులు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం  నియోజకవర్గ మీద దృష్టిని సారించారు. చంద్రబాబు నాయుడుకు చిరకాల రాజకీయ శత్రువైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గం ఒక రకంగా దత్తత తీసుకున్నారని చెప్పవచ్చు. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమి ధ్యేయంగా YCP పనిచేస్తుంది. గట్టి పునాదులు కూడా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జడ్పిటిసి, ఎంపీటీసీ, మండల పరిషత్, సర్పంచ్, వార్డు మెంబర్లు, కుప్పం మున్సిపాలిటీ, కౌన్సిలర్లు సభ్యులు అత్యధికం  వైసిపి వాళ్లని గెలుచుకొని కుప్పం కోట మీద YCP జండా ఎగురవేశారు. ఈ క్రెడిట్ అంతా రామచంద్రారెడ్డిదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలతో రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడును ఓడించడానికి వైసిపి పకడ్బందీగా పావులు కలుపుతోంది. నియోజకవర్గానికి చెందిన బీసీ నేత, వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను ఎమ్మెల్సీగా చేశారు. ఆయనను జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భరత్ ఈ పర్యాయం శాసనసభ ఎన్నికలలో గెలవడానికి కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థిని ప్రకటించడంతో ప్రచారం కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడో ప్రారంభమైంది.


ఒకనాడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆ పార్టీ  నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. అధికార  బలంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను అనగదొక్కడానికి YCP వాళ్ళు  ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పరాజయం తెలుగుదేశం పార్టీకి గొడ్డలి పెట్టులా తయారైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడానికి,  పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సారి ఎన్నికల్లో లక్ష మెజారిటీ సాధించాలన్న ధ్యేయంతో చంద్రబాబు నాయుడు నియోజకవర్గ నాయకులకు  దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ  కలిచర్ల  శ్రీకాంత్ ను   నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. ఏడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఏనాడు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చంద్రబాబు నాయుడుకు రాలేదు. చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు YCP దెబ్బతో  ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం  పాదయాత్రను కుప్పం నుంచే ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అతిరథ మహారధులు పాల్గొని బల ప్రదర్శన చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో మూడు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించి కేడర్ లో   ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నడు రాజకీయాలలో ఏలు పెట్టని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా కుప్పం నియోజకవర్గంలో అడిగిడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున కంటి ఆసుపత్రిని  ప్రారంభించారు. కుప్పంలో నిర్మిస్తున్న ఇంటిని పరిశీలించారు. ఎన్నడూ రాజకీయాలు మాట్లాడని నారా భువనేశ్వరి మైక్ పట్టుకొని  రాజకీయ ఉపన్యాసం చేశారు.


కుప్పంలో చంద్రబాబును తిరిగి గెలిపించు కోవడానికి ఆయన సతీమణి భువనేశ్వరి రంగప్రవేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సవాలు విసరడం వల్ల ఆమె కూడా కుప్పంలో అడుగు పెట్టారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె కుప్పం గంగమ్మ గుడి ఆలయంలో ప్రత్యేక పూజలో నిర్వహించారు. తరువాత ప్యాలెస్ రోడ్‌లో సంజీవని వైద్యశాల, మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఎన్టీయార్ ట్రస్ట్ ప్రజలకు సేవలు అందించడం కోసం స్థాపించామని, కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధ్యేశ్యంతో ఎన్టీయార్ సంజీవిని ఏర్పాటు చేశాని వెల్లడించారు. అదే విధంగా గిరిజన ప్రాంతాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యశాలలు  ఏర్పాటు చేస్తామని.. మహిళలు అనుకుంటే ఎదైన చేయగలుగుతారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో తమకు ఎటువంటి కాంపిటీషన్ లేదని వెల్లడించారు. కుప్పంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవనాలు నిర్మిస్తామన్నారు. అక్కడి నుంచి శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న సొంత ఇంటిని భువనేశ్వరి పరిశీలించారు. తమది ప్యాలెష్ కాదని, చిన్న ఇళ్ళని జగన్ ను దోప్పిపోడిచారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారని కొనియాడారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు అంటూ ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

 అయితే భువనేశ్వరి పర్యటన రాజకీయ ప్రధాన్యత సంతరించుకున్నది. చంద్రబాబు ఇప్పటికి ఏడు సార్లు కుప్పంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎప్పుడు నియోజక వర్గం వైపు కన్నెత్తి చూడని భువనేశ్వరి ప్రజా సేవ పేరుతో కుప్పం రావడం చర్చకు దారి తీస్తోంది. దొంగ ఓట్లు తొలగించడం, పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికల్లో పరాజయం పాలయిన నేపథ్యంలో ఆమె నియోజక వర్గానికి రావడం చర్చకు దారి తీస్తోంది. లోకేష్ పాదయాత్ర కూడా కుప్పం నుంచి ప్రారంభించారు. ఇప్పుడు భువనేశ్వరి సేవ పేరుతో నియోజక వర్గంలో పర్యటించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.


NOTE

👉 ఈ వార్త మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్న Contact information for Chittoor News ద్వారా తెలియచేయగలరు. 

👉 Chittoor News మీకు నచ్చితే కింద ఉన్న Follow మీద క్లిక్ చేసి Follow కాగలరు.

👉 Chittoor Newsలో మీ ప్రకటనల కోసం 9700576555 నెంబర్ ను సంప్రతించండి.

👉 Chittoor News అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించబడును. Phone Pay, Google Pay: 9700576555.

👉 Chittoor News అభివృద్ధి కొరకు మీ సలహాలు, సూచనలకు ఇదే మా ఆహ్వానం.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *