5, ఆగస్టు 2023, శనివారం

పుంగనూరు రగడకు కారణం ఎవ్వరు?



 పుంగ‌నూరులో శుక్రవారం చెల‌రేగిన హింస, పోలీసులపై టీడీపీ దాడులు, పోలీసుల లాఠీ ఛార్జ్, ఉద్రిక్త‌త, వాహ‌నాలకు నిప్పు పెట్టిన ఘ‌ట‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. అయితే.. ఎవ‌రికి వారు త‌మ త‌ప్పులేద‌ని.. ఎదుటి ప‌క్షంపై తోసేసే ప్ర‌య‌త్నం చేశారు. టీడీపీ-వైసీపీ-పోలీసులు మూడు విభాగాలు కూడా త‌మ త‌ప్పుకాద‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, బాధితుల విష‌యానికి వ‌స్తే.. ఈ రెండు పార్టీలతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో అంద‌రూ బాధితులు గానే మిగిలారు. పోలీసుల లాఠీ చార్జీలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, టీడీపీ కార్య‌కర్త‌లు వేసిన రాళ్ల దాడిలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, పోలీసులు కూడా గాయ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌రిగింది? త‌ప్పెవ‌ర‌ది? అనే సందేహం స‌హ‌జ‌మే. 



టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాయ‌ల‌సీమలో ప్రాజెక్టుల విధ్వంసంపై పోరుబాట పేరుతో యాత్ర చేస్తున్నారు. ఇది ఈ నెల 1 నుంచి కొన‌సాగుతోంది. శుక్ర‌వారం చివ‌రి రోజు. ఆయ‌న తొలుత క‌ర్నూలు, త‌ర్వాత సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌.. అనంత‌రం.. త‌న సొంత జిల్లా చిత్తూరులోనూ ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు. అయితే, షెడ్యూల్‌లో  భాగంగా పుంగనూరులో రోడ్డు షో, బహిరంగ సభ ప్లాన్ చేశారు. పోలీసులు ఇందుకు నిరాకరించారు. అనుమతి ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలలో పట్టుదల పెరిగింది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఈ జిల్లా MLA అయిన చంద్రబాబు ఎందుకు పుంగనూరుకు రాకూడదని ప్రశ్నించారు. ఇందుకు తోడు వైసీపీ నాయకులు రెచ్చకొట్టే విధంగా ప్రకటనలు చేశారు. బాబును పుంగనూరులో అడుగుపెట్టనివ్వమని ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలలో పట్టుదల పెరిగింది. ఏలా అయిన బాబును పుంగనూరుకు తీసుకురావాలని భావించారు.



శుక్రవారం ఉదయం కూడా వైసీపీ రెచ్చకొట్టే దొరని వీడలేదు. పుంగనూరులో బాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పుంగనూరు అభివృద్ధికి బాబు చేసింది ఏమీ లేదన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. దీంతో బాబు పుంగనూరు రావాలని టీడీపీ వాళ్ళు పట్టుపట్టారు. పోలీసులు వీలుకాదన్నారు. బైపాస్ రోడ్డులో  భీమగాని పల్లి వద్ద లారీలు, ఇతర వాహనాలను బాబు రాకుండా అడ్డుపెట్టారు. బ్యారికెట్లను ఏర్పాటు చేశారు. దారికి అడ్డంగా పెట్టిన వాహనాలను, బ్యారికెట్లను తొలగించాలని టీడీపీ కార్యకర్తలు పోలీసులను కోరారు. పోలీసులు ఒప్పుకోక పోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడికి వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అక్కడ కూడా రెచ్చకొట్టే విధంగా వ్యవహరించారు. వాగ్వాదం జరగడంతో కొందరు రాళ్ళు రువ్వారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసుల మీద రాళ్ళ పడ్డాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రాళ్లతో కొట్టారు. ఈ గొడవల్లో కొందరు పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పరస్పరం జరిగిన దాడుల్లో ఇరు వర్గాలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. ఇది మంత్రి పెద్దిరెడ్డి వ్యూహంగా టీడీపీ వాళ్ళు భావిస్తున్నారు. అంగళ్లలో తన మీదనే రాళ్ళ దాడి జరగడం, పుంగనూరులో అడ్డగించడంతో చంద్రబాబు ఆగ్రహం చెందారు.



తొలుత చంద్రబాబు పోగ్రాం పుంగ‌నూరులో లేదు. పోలీసుల‌కు ఇచ్చిన షెడ్యూల్ వివ‌రాల్లో.. పుంగ‌నూరు బైపాస్‌(హైవే) మీదుగా చంద్రబాబు.. చిత్తూరు జిల్లాలోకి ప్ర‌వేశించాలి. అయితే, క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల్లో వ‌చ్చిన స్పంద‌న చూసిన త‌ర్వాత‌.. పుంగ‌నూరు టీడీపీ నాయ‌కులు ఇక్క‌డ కూడా ప‌ర్య‌టించాల‌ని చంద్ర‌బాబును కోరారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందే ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌ని సూచించారు.



దీనిని టీడీపీ నాయ‌కులు ఖండించి.. మాజీ ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న జ‌రిగి తీరుతుంద‌ని తెలిపారు. ఇక‌, పోలీసుల నుంచి వైసీపీ నాయ‌కుల‌కు స‌మాచారం అందింద‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో హైవే నుంచి పుంగ‌నూరు సిటీలోకి వ‌స్తున్న చంద్ర‌బాబును రాకుండా చేయాల‌నే ఉద్దేశంతో పోలీసులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పుంగ‌నూరులోకి అడుగు పెట్ట‌కుండా చేయాల‌ని వైసీపీ నాయ‌కులు.. ఎవ‌రు అడ్డు వ‌చ్చినా.. పుంగ‌నూరులో చంద్ర‌బాబు రోడ్ షో చేయించాల‌ని టీడీపీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు. 



ఈ క్ర‌మంలోనే పోలీసులు ర‌హ‌దారిపై త‌మ వాహ‌నాలు అడ్డు పెట్టి చంద్ర‌బాబు రాక‌కు రెండు గంట‌ల ముందు నుంచి అడ్డు త‌గిలారు. దీనిని టీడీపీ కార్య‌క‌ర్త‌లు నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఇదే అదునుగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. కూడా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడి చేశారు. ఇక‌, అక్క‌డ నుంచి వివాదం ముదిరి.. అన్ని ప‌క్షాలు ఎదురు దాడులు చేసుకున్నాయి. ఇదిలావుంటే.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు బైపాస్ మీదుగానే చిత్తూరులోకి వెళ్లిపోయారు. 



ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడ అయినా పర్యటించవచ్చు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలి. తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. గొడవలు జరిగే అవకాశాలు ఉంటే, ఎదుటి వారికి నచ్చచెప్పాలి. వినకుంటే ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలి. హౌస్ అరెస్టులు మాములే. అయితే పుంగనూరులో పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాయడం, వారు చెప్పినట్లు వినడంతో సమస్య వచ్చింది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే ఈ గొడవ జరిగేది కాదు. టీడీపీ వాళ్ళు కూడా సంయమనం కోల్పోయారు. అలా చేయాల్సిన పనిలేదు. తాము చెప్పిన విధంగా నడుచుకొనే పోలీసులు ఉన్నపుడు వైసీపీ వాళ్ళు సీనులోకి రాకుండా ఉండాల్చింది. రెచ్చకొట్టే విధంగా వ్యవహరించకుండా ఉండిఉంటే పుంగనూరు రక్తసిక్తం అయ్యేది కాదు. వాహనాలు తగులబడేది కాదు. శాంతిభద్రతల సమస్య వచ్చేదే కాదు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *