పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల !?
ఇకపై ఏపీలోనే రాజకీయ ప్రస్థానం
అన్న జగన్ తో ఇక హోరాహోరీ
వైసీపీని బలహీనం చేయడమే లక్ష్యం
2029 ఎన్నికల్లో అధికారమే ధ్యేయం
కర్ణాటక నుండి రాజ్యసభకు షర్మిల
కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను ఖరారు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లే షర్మిల తన పార్టీని విలీనం చేయడంతో పాటు ఇకపై ఏపీ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా పూర్తి కాగా ఇప్పుడు షర్మిల గ్రీన్ సిగ్నల్ తో ఈ విలీనం కథ సుఖాంతం కాబోతున్నట్లు సమాచారం...
షర్మిల పార్టీ విలీనానికి సిద్ధమే కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారం లేదా ఈ నెలాఖరున ఈ విలీనం కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు లోటస్ పాండ్ వర్గాల సమాచారం...
నిజానికి ముందుగా ఆగస్టు 12న దీనికి ముహూర్తం పెట్టుకున్నా షర్మిల నిర్ణయం ఆలస్యం కావడంతో ఆ ముహూర్తానికి ఇది అమలు కాలేదు. అయితే ఇప్పుడు ఈ స్థానంలో మరో ముహూర్తం కోసం చూస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి అన్ని చర్చలు పూర్తి కాగా విలీనం వలన ఆమెకి చేకూరే ప్రయోజనాలపై కూడా చర్చలు పూర్తి అయ్యాయని తెలిసింది...
షర్మిలను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపడంతో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన అనంతరం ఇద్దరు పాత కాంగ్రెస్ నేతలను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి షర్మిల మైలేజీ పెంచే ప్రణాళిక కూడా ఒకటి కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది...
తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలనే ఉద్దేశంతో 2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. తానే అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో పరుగులు పెట్టించారు. ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు ? ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు, కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది.
నాయకుల చేరికలు, పాదయాత్ర, ధర్నాలు, నిరసనలు, ప్రభుత్వంపై విమర్శలు, ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ తర్వాతే తేడా కొట్టింది, ఎంత చేసినా ప్రజల్లోకి పార్టీ వెళ్లలేకపోయింది...
మరోవైపు కీలక నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పుంజుకోవడంతో షర్మిల సుతారం వెనకబడి పోయారు. ఒకవైపు ఎంత చేసినా మైలేజీ రాకపోవడం, మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె కాస్త నిరాశలో ఉంటూ వచ్చారు...
ఈ తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఈ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించింది జగన్ వైఎస్ఆర్సీపీనే. యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే. నిన్న మొన్నటి వరకూ ఈ విషయంపై తర్జన భర్జన పడిన షర్మిల ఇప్పుడు భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ ప్రోత్సాహంతో అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది...
ముల్లును ముల్లుతోనే తీయాలి.
కత్తిని కత్తితోనే తీయాలి.
వజ్రాన్ని వజ్రం తోనే తీయాలి.
అనే సామెత ను బాగా పాటిస్తున్నారు.