గడప గడపకు వెళ్తున్న YCP MLAలకు నిరసన సెగలు
గడప గడపకు వెళ్ళమంటున్న జగన్
గ్రామాల్లోకి రావద్దంటూ ప్రజలు, నాయకుల అడ్డగింత
ఇళ్ళకు తాళాలు వేసి వినూత్నంగా నిరసనలు
గ్రామానికి రావద్దని దారికి అడ్డంగా కంచెలు
రాత్రికి రాత్రి వెలుస్తున్న తెదేపా జండాలు
చిత్తూరు జిల్లాలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామాలలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం వెళితే మా ఊరికి వద్దు నల్ల కాకి అన్నట్టు ప్రజలు, స్వంత పార్టీ వారే అడ్డుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మా ఊరికి రావద్దు అంటూ బ్యానర్లు వెలుస్తున్నాయి. మరి కొన్ని చోట్ల ఏకంగా ఇళ్ళకు తాళాలు వేసి ప్రజలు నిరసన తెలియచేస్తున్నారు. MLA గ్రామానికి వస్తున్నారని తెలియగానే రాత్రికి రాత్రే తెదేపా జండాలు ఇళ్ళ మీద రెపరెపలాడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు YCP MLAలు నియోజక వర్గంలోని సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్తున్నారు. గ్రామాల్లో, వార్డుల్లో అభివృద్ధి లేకపోవడం, రోడ్డు గుంతలు పడటం, చివరకు వీధి దీపాలు కూడా వెలగడం లేదు. దీంతో ప్రజలు, సొంత పార్టీ నేతలు MLAలను నిలతీస్తున్నారు. కొందరు ఎన్నికల ప్రచారం లాగా నమస్కారం పెట్టుకుంటూ.. తిరిగేస్తున్నారు. సమస్యల జోలికి వెళ్ళడం లేదు. గ్రామాలకు వెళ్లకుంటే జగన్ క్లాస్ పికుతారు. మల్లీ MLA టిక్కెట్టు రాదు. వెళ్ళితే ప్రజలు, కార్యకర్తలు నిలతీస్తున్నారు. పడుకున్న కక్కలను లేపి తన్నించుకున్నట్లు అవుతోందని MLAలుఆవేదన చెందుతున్నారు. జిల్లాలో MLAల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాగా తయారయ్యింది.
శనివారం డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, గడప గడప కార్యక్రమంలో భాగంగా పెనుమురు మండలం గుంటి పల్లెకు వెళితే ప్రజల నిరసన ఎదురయ్యింది. ఎంపిపి మహాసముద్రం హేమలత స్వంత గ్రామం అయిన అక్కడి వీధుల్లో ముళ్ళ కంపలు వేశారు. ఎంపిపి భర్త, మాజీ మండల కన్వీనర్ సురేష్ రెడ్డి తన అనుచరుల ద్వారా ముళ్ళ కంపలు వేయించారని తెలుసుకున్న నారాయణ స్వామి ముందుగా పోలీసులను పంపి అడ్డు తొలగించారు. తరువాత ఊరిలోకి వెళ్లి ప్రజలను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే కొంత మంది ఎస్సీ ( మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వారు నారాయణ స్వామిని నిలదీశారు. వారికి ఘాటుగా సమాధానం చెప్పిన నారాయణ స్వామి ఎంపిపి ఇంటి ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జ్ఞానేంద్ర రెడ్డి వర్గీయులను విమర్శించారు. వైసిపి మంత్రిని అయిన తనను అవమాన పరిస్తే అది జగన్ మోహన్ రెడ్డిని అవమాన పరచినట్లేనని పేర్కొన్నారు. తన ప్రాపకంతో ఎంపిపి పదవి పొందిన వారు దమ్ముంటే ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేయాలని సవాలు విసిరారు. కొంత మంది దళితులను రెచ్చగొట్టి నంత మాత్రాన తాను భయపడనని చెప్పారు. ఉప ముఖ్య మంత్రి హోదాలో నారాయణ స్వామి గ్రామంలోకి వస్తున్నారని తెలిసి ఎంపిపి లేక పోవడమే కాకుండా గ్రామంలోకి రాకుండా ముళ్ళ కంపలు అడ్డుగా వేయడం చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా పెనుమూరు మండలంలోని ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి వర్గం నేతలు స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తనకు బదులుగా పీఏ సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వం కోసం తిరిగారు. వెదురుకుప్పం మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి తమ ఇంటికి వస్తారని, మన ఇంటి సమస్య ఊరి సమస్య చెప్పుకుందామని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహిళలకి, గ్రామస్తులకు చేదు అనుభవం ఎదురైంది. మండల కేంద్రం వెదురుకుప్పంలో గత వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నిరసనల సెగ తగలడంతో మధ్యాహ్నానికి అంతరార్ధంగా ముగించి. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత తిరిగి కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం రెండు గ్రామాల్లో తిరిగి నారాయణస్వామి తనకు వేరే కార్యక్రమం ఉందని సమస్య ఉన్న దళిత గ్రామాలకు వెళ్లకుండా చిన్నగా జారుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతే నారాయణస్వామి అనుచర వర్గం, డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి గడపగడపకు పర్యటన మొదలెట్టారు.
ఐదవ తేదీన జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం మండల కేంద్రంలో బీసీ కాలనీ పెద్ద హరిజనవాడలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అధికారులు ఇతర నేతలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటి పర్యటన చేశారు. బీసీ కాలనీలోని నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని అడగడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సదరు వ్యక్తికి నమస్కరించి ముందుకు వెళ్లారు. సమస్యల గురించి అడిగితే జవాబు చెప్పకుండా వెళ్ళిపోతారా అంటూ నిలతీశారు. ఆ తర్వాత పెద్ద హరిజనవాడలో మహిళ ప్రశ్నించిన తీరుతో ఉపముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో అసహనానికి గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా YCP అధికారంలోకి వస్తే ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పిన వాగ్దానం ఏమైందంటూ ప్రశ్నించారు. ఆమెకు మంత్రి సమాధానం దాటవేశారు.
పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబుకు
పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబుకి కూడా స్వంత పార్టీ నుంచే నిరసన వ్యక్తం అవుతున్నది. ఇటీవల అయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్గొనదానికి గ్రామాలకు వెళ్లినప్పుడు వినూత్న రీతిలో నిరసనలు ఎదరయ్యాయి. ఒక గ్రామంలో ఆయన తిరిగిన వీధులను పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. మరొక ఊరిలో గ్రామస్తులు అందరూ ఇళ్ళకు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా గతంలో ఎమ్మెల్యే తనకు జెడ్ పి వైస్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని తన వద్ద ఐదిన్నర కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆఖరికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జోక్యం చేసుకుని మూడున్నర కోట్లు ఇప్పించారని సమాచారం. ఇప్పటికీ మిగిలిన సొమ్ము తనకు చేరలేదని ఆమె సన్నిహితుల వద్ద అవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండు నెలల క్రితం అమ్మగారిపల్లె, చిన్నబండపల్లె గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్ళిన ఎమ్మెల్యేను అక్కడి ప్రజలు అడ్డుకుని తమ గ్రామానికి రావద్దంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పేట అగ్రహారం గ్రామంలో పర్యటనకు వస్తున్నారని తెలిసి ఎమ్మెల్యే పర్యటన బహిష్కరించిన గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి, గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తిరిగి వెళ్లి పోయిన తర్వాతనే గ్రామం లోకి అడుగు పెడతామని వినూత్నంగా నిరసన తెలియజేశారు. దీంతో పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించరా అంటూ మండిపడ్డారు. గ్రామంలో అభివృద్ధి కోసం వస్తే తనను అవమానించారు ఎమ్మెల్యే బాబు ఫీలయ్యారు. గ్రామస్థులు తీసుకున్న పథకాలు వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన సొంత డబ్బులు ఇవ్వడంలేదు కదా అని జనం మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను తన సొంత జేబులోంచి ఇచ్చిన మాట్లాడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, అందుకు నిరసనగా ఊరంతా ఖాళీ చేసి నిరసన తెలియజేశామన్నారు గ్రామస్థలు. అటు తరువాత బంగారుపాళ్యం మండలం, మొగిలివారిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే తమ గ్రామంలో పర్యాటించేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని గ్రామం అంతా సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ బ్యారి గేట్లు పెట్టి, గ్రామం భజన గుడి వద్ద టిడిపి పాటలను వేసి, గ్రామస్తులు అంతా ఇండ్లకు తాళ్ళలు వేసుకున్నారు. ఐతే ఈ వ్యవహారంను గమనించిన ఎమ్మెల్యే భజన గుడి వద్ద పాటలను ఆపేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యేను అడ్డుకుని తమ గ్రామం నుండి తక్షణమే బయటకు వెళ్ళాలంటూ నినాదాలు చేశారు.
పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ కు
పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ ప్రజలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన బెంగళూరులో స్వంత వ్యాపారాలు చేసుకుంటూ చుట్టపు చూపుగా నియోజక వర్గానికి వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడ కు చేదు అనుభవం ఎదురైంది. ‘‘వద్దు.. రావద్దు మా గడపకు రావద్దు .. సమస్యలు పట్టని ఎమ్మెల్యే మాకొద్దు’’ అంటూ గౌడ కు వ్యతిరేకంగా కొంగాటం గ్రామ ప్రజలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మా గడపకు రావొద్దు.. మీకో దండం సామీ అంటూ బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే వెంకటే గౌడ సొంత మండలమైన వి.కోట లోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం మరో కొసమెరుపు! మరోవైపు వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. నల్ల రిబ్బన్ ధరించి, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. దీంతో సొంత మండల ప్రజలిచ్చిన షాక్ కు కంగుతిన్న ఎమ్మెల్యే వెనుదిరిగారు!