చంద్రబాబు కోటలో వైకాపా జైత్రయాత్ర
స్థానిక ఉప ఎన్నికలలో మల్లీ చతికిలపడ్డ దేశం
చిత్తూరు జిల్లాలో తిరుగులేని వైకాపా జైత్రయాత్ర
ఏకగ్రీవంగా వైకాపా ఖాతాలోకి 8 సర్పంచ్ లు
84 వార్డులకుగాను వైసిపికి 77, తేదేపాకు 7
కుప్పంలో 6 వార్డులకుగాను 5 వైకాపాకి
2047 విజన్ డాక్యుమెంట్ రాసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వంత జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో చతికిల పడ్డారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవము గడించి 14 ఏళ్ల ముఖ్య మంత్రిగా పాలన సాగించిన ఆయన సొంత జిల్లాలో పార్టీని గట్టెక్కించలేక వైకాపాకు ఎదురీదుతున్నారు. అధికార YCPని ధీటుగా ఎదుర్కొనే వ్యూహం లేక జిల్లాలో తెదేపా శ్రేణులు నిస్సహాయంగా ఉండిపోతున్నాయి. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడుకు కళ్ళెం వేయలేకపోతున్నారు. జిల్లాలో వైకాపా జైత్రయాత్రను అడ్డుకొనే ప్రయత్నం కూడా జరగడం లేదు. తాజాగా ఆదివారం వెలువడిన పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని మరొక సారి రుజువు చేశాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక శాసనసభ స్థానానికి పరిమితమైన టిడిపి ఉప ఎన్నికల్లో ఒక సర్పంచి స్థానం కూడా గెలవలేక పోయింది. దీంతో జిల్లాలో తెదేపా శ్రేణులు నిరాశా నిసృహలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్తగా తెదేపాలో చేరినవారు ఈ పార్టీలో ఎందుకు చేరామా అని ఆత్మవిమర్శ చేసుకొనే స్థితికి వచ్చేశారు. జిల్లాలో పెద్దిరెడ్డి దూకుడుకు కళ్ళెం వేయలేని ఈ పార్టీలో కొనసాగడం అవసరమా? అన్న చర్చలు కూడా అక్కడక్కడా జరుగుతున్నాయి. కొందరు నాయకులు అయితే, తమకు ఏమీ పట్టనట్లు సొంత పనులలో నిమగ్నం అవుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం 34 సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరగగా వైసిపికి 24 వచ్చాయి. టిడిపికి తొమ్మిది, జనసేనకు ఒక స్థానం తెచ్చుకున్నది. ఒక విధంగా ఈ ఫలితాలు టిడిపికి కొంత ఊరట కలిగించిందని చెప్పాలి. గతంలో వైసిపి గెలిచిన 10 స్థానాలు టిడిపి, జనసేన వశం కావడం మార్పుకు చిహ్నంగా చెప్పవచ్చు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం ఎనిమిది సర్పంచ్ స్థానాలు వైసిపి తిరిగి ఏకగ్రీవం చేసుకుంది. టిడిపి కనీసం పోటీ కూడా పెట్టలేక పోవడం వ్యవస్థాగత లోపంగా చెప్పాలి. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే చిత్తూరులో మూడు, తిరుపతిలో ఐదు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక వార్డుల విషయంలో కూడా టిడిపికి అవమానకర ఫలితాలు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 44 వార్డులకు ఎన్నికలు జరగగా వైసిపికి 39, టిడిపికి ఐదు వచ్చాయి. రెండు చోట్ల ఎన్నికలు జరిగలేదు.
తిరుపతిలో 41 వార్డులకు గాను 40 చోట్ల ఎన్నికలు జరగగా వైసిపికి 38 రాగా టిడిపి రెండింటితో సరి పెట్టుకుంది. చంద్రబాబు స్వంత నియోజక వర్గమైన కుప్పంలో ఆరు వార్డులకు ఎన్నికలు జరుగగా వైసిపికి ఐదు, టిడిపికి ఒకటి వచ్చింది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే టిడిపి పార్టీ నిర్మాణంలో లోపం ఉందని చెప్పక తప్పదు. తొలి నుంచి జరిగిన శాసనసభ ఎన్నికలను పరిశీలించినా ఈ విషయం స్పష్టం అవుతుంది. 1983 లో ఉమ్మడి జిల్లా లోని 15 స్థానాలలో టిడిపి 14 స్థానాలు రాగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 1985, 1989 లో సీట్లు తగ్గినప్పటికీ 1994 లో తిరిగి టిడిపి 14 స్థానాలలో గెలిచింది, కాంగ్రెస్ ఒక స్థానంతో సరి పెట్టుకుంది. 1995లో ఎన్టీఆర్ ను తొలగించి చంద్రబాబు ముఖ్య మంత్రి పదవి చేపట్టారు. తరువాత 1999 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే స్వంత జిల్లాలోని 15 స్థానాలలో కేవలం ఆరు వచ్చాయి. 2004లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. అయితే చిత్తూరులో టిడిపికి ఐదు మాత్రమే వచ్చాయి. 2009 నియోజక వర్గాల పునర్విభజన వల్ల 14 స్థానాలు మిగిలాయి. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో టిడిపికి ఆరు స్థానాలు వచ్చాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయినా చిత్తూరు జిల్లాలో ఆరు స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.
2019 ఎన్నికల్లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసిపి అధికారంలోకి వచ్చింది. జిల్లాలో చంద్రబాబు ఒక్కరే గెలిచారు. తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి చిత్తు చిత్తుగా ఓడిపోయింది. రాష్ట్రంలో టిడిపి గాలి వీస్తున్న ఈ దశలో కూడా చిత్తూరులో పార్టీ కుంటి నడక నడవ దానికి చంద్రబాబే కారణం అంటున్నారు. ఆయన తన స్వంత కులనాయకుల మాట విని సమర్థులైన రెడ్డి, బలిజ, బిసి నాయకులను పక్కన బెడుతున్నరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి ఇంచార్జి పదవులను పులివర్తి నానీకి కట్టబెట్టి తప్పు చేశారని అంటున్నారు. చిత్తూరులో స్వంతకులం నేతల మాట విని సి కె బాబు, బలిజ సామాజిక వర్గం నాయకులను పక్కన బెట్టడం తప్పని అంటున్నారు. ఇప్పుడు చిత్తూరు పార్ల మెంట్ పరిధిలో తన సామాజిక వర్గం నాయకులదే పెత్తనం. నగరి ఇంచార్జిగా గాలి భాను ప్రకాష్ (కమ్మ), చంద్రగిరి ఇంచార్జిగా పులివర్తి నాని(కమ్మ) ఉన్నారు. జి డి నెల్లూరు, పూతలపట్టు రిజర్వుడు నియోజక వర్గాల ఇంచార్జిలుగా తమ సామాజిక వర్గం నేతల చెప్పు చేతల్లో ఉన్న డాక్టర్ థామస్, డాక్టర్ మురళీ మోహన్ లను నియమించారు. చిత్తూరులో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు (కమ్మ), నాని పెత్తనం కొనసాగు తున్నది. కుప్పంలో ఎలాగూ చంద్రబాబు ఉన్నారు. ఆ నియోజక వర్గం బాధ్యతను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (కమ్మ)కు అప్పగించారు. పలమనేరు ఒక చోట మాత్రమే మాజీ మంత్రి అమరనాధ రెడ్డి ఇంచార్జిగా ఉన్నారు. అంటే మొత్తం ఏడు నియోజక వర్గాలలో ఆరు చోట్ల కమ్మ సామాజిక వర్గం నేతలు పెత్తనం చేస్తున్నారు.
రాష్ట్ర అధికార ప్రతినిధులు స్వీయ గౌరవం ఉన్న డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డిని ( జి డి నెల్లూరు), డాక్టర్ సప్తగిరి ప్రసాద్ లను చూసి కమ్మ సామాజిక వర్గం నేతలు సహించలేక పోతున్నారు. తిరుపతి పార్లమెంట్ అద్యక్షుడు నరసింహ యాదవ్ పార్టీని సమర్థవంతంగా నడిపించలేక పోతున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుగునమ్మను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే పార్టీ ఏర్పడినప్పటి నుంచి సేవలు అందిస్తున్న రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయన రెడ్డికి తగిన ప్రధాన్యత ఇవ్వడం లేదంటున్నారు. శ్రీకాళహస్తిలో ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే ఎస్ సీ వీ నాయుడును రుద్దుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో పనిచేసే జేడి రాజశేఖర్ ను పక్కన బెట్టి హెలెన్ కు ఇంచార్జి పదవి ఇచ్చారు. ఇక పుంగనూరు నియోజక వర్గంలో అనీషా రెడ్డిని తొలగించి బలహీనుడు అయిన చల్లా రామచంద్రా రెడ్డిని ఇంచార్జిగా నియమించారు. ఆయన చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు చంద్రబాబు సహా 500 మంది క్రిమినల్ కేసులు అనుభవిస్తున్నారు. 92 మంది జైళ్లలో మగ్గుతున్నారు. కేసుల్లో ఉన్న 408 మందితో పాటు మరో 500 మంది కేసులకు భయపడి పరారీలో ఉన్నారు.
మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డిని పీలేరు నియోజక వర్గానికే పరిమితం చేశారు. జిల్లాలో ఎవరి శక్తి సామర్ధ్యాలు ఎంతో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆ మేరకు పార్టీలో వారికి ప్రాధాన్యత లభించడం లేదు. స్థాయి పెంచవలసిన వారికి తగ్గిస్తున్నారు. పార్టీలో కోవర్టులుగా పనిచేస్తున్న ఒక సామాజిక వర్గం నేతలకు అర్హతలేకున్నా, అందలం ఎక్కిస్తున్నారు. ఒక సామాజిక వర్గం నేతలు ఓకే అంటేనే ఇతరులకు పార్టీ పదవులు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం పట్ల ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. స్వంత కులం నేతల మాటలు విని తప్పులు చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు ముందు ఇంట గెలవడానికి తగిన చర్యలు చేపట్టాలని సీనియర్ నేతలు కొందరు కోరుతున్నారు.