24, ఆగస్టు 2023, గురువారం

తేదేపాకు గల్లా కుటుంబం దూరం !?

 


 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ రాజకీయ భవిష్యత్తు మీద  రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరువురు క్రమంగా తెలుగు దేశం పార్టీకి, రాజకీయాలకు దూరం అవుతున్నట్లు విధితం అవుతుంది. గల్లా అరుణ కుమారి తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైనా, పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. తెదేపా పదవికి కూడా రాజీనామా చేశారు. ఇటీవల అరుణ కుమారి జన్మదినాన్ని అభిమానులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ పునఃప్రవేశం గురించి ఒక ప్రకటన ఉంటుందని ఎదురుచూశారు. అలాంటిది ఏదీ లేదు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సైతం పాల్గొనలేదు. పైగా లోకేష్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఏడు దశాబ్దాల రాజకీయ అనుభవం.. మూడు తరాల రాజకీయ వారసత్వం.. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఘన విజయాలు.. వేలాది కార్మికులు.. లక్షలాది అభిమానులు ఇలా ఎందరో మద్దతు గల్లా కుటుంబం సొంతం. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులను అధిష్టించిన ఆ కుటుంబ సభ్యులు.. ఎందుకో సడన్‌గా రాజకీయాలు వద్దనుకున్నారు. తమ వ్యాపారాలు.. తమపై ఆధారపడిన కార్మికులే ముఖ్యం అనుకున్నారు. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి.. టీడీపీలో చక్రం తిప్పుతున్న గల్లా కుటుంబం కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటుంది. రాజకీయ ప్రాధాన్యంతో పాటు పారిశ్రామిక నేపథ్యం వల్ల కార్మికుల్లో గల్లా కుటుంబంపై అభిమానం ఉంది. అదేసమయంలో సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడైన జయదేవ్‌కు హీరో మహేశ్‌బాబు అభిమానుల అండదండలు ఉన్నాయి. అన్నిరకాల బలగం ఉన్న గల్లా కుటుంబం రాజకీయాలకు దూరం కావడం పార్టీ నేతలు, సన్నిహితులకు అర్థం కావడం లేదు.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గల్లా కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ (Galla Jayadev) కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ ఐనా.. అటు వైపు చూడటం లేదు జయదేవ్. టీడీపీలో యాక్టివ్ లీడర్ అయిన జయదేవ్ స్వతహాగా పారిశ్రామిక వేత్త. ఆయన కుటుంబ యాజమాన్యంలోనే చిత్తూరు జిల్లాలో అమరరాజా బ్యాటరీస్ కంపెనీ నడుస్తోంది. ఈ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమతో కాలుష్యం పెరిగిపోతోందని నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జయదేవ్ టీడీపీలో ఉండటంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇక ఆ తర్వాత నుంచి గల్లా జయదేవ్ రాజకీయాల్లో జోరు తగ్గించారు. ప్రభుత్వ వైఖరి వల్లో.. పరిశ్రమ విస్తరణలో బిజీగా ఉండటం వల్లనో గాని ఇంతకు ముందు కనిపించిన దూకుడు ఇప్పుడు ఎక్కడా చూపడంలేదు జయదేవ్.


ఇక జయదేవ్ తాత రాజగోపాలనాయుడు చిత్తూరు ఎంపీగా రెండుసార్లు, MLCగా పనిచేశారు. అంతకు ముందు తవణంపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజగోపాలనాయుడు శిష్యుడు అని నారా చంద్రబాబు కూడా చెప్పుకుంటారు.  జయదేవ్ తల్లి అరుణకుమారి కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హయాంలో రెండు దఫాలు  మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. జిల్లాలో, రాష్ట్రంలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన కుటుంబం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరితోపాటు పూతలపట్టు, నగిరి, తిరుపతి.. ఇలా నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయగల సామర్థ్యం గల్లా కుటుంబానికి ఉంది. ఐతే తండ్రి రామచంద్రానాయుడు నుంచి అమరరాజా చైర్మన్ బాధ్యతలు తీసుకున్న జయదేవ్ రాజకీయాలపై ఆశక్తిని చూపడం లేదు. చంద్రగిరిలో నాలుగు సార్లు గెలిచిన అరుణకుమారి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పోటీకి దూరంగా ఉండిపోయారు. వచ్చే ఎన్నికల్లో అరుణకుమారి కూతురు రమాదేవిని పోటీ చేయించాలని తొలుత భావించారు. ఏమైందో కాని ఆ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. 



చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గల్లా అరుణ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2014కు ముందు వ‌ర‌కు కూడా ఆమె కాంగ్రెస్‌ లో సుధీర్గకాలం పాటు కొన‌సాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భూగర్భ, గనులశాఖ‌ మంత్రిగా ప‌నిచేశారు. దివంగ‌త ఎంపీ సామాజిక కార్యకర్త పటూరి రాజ గోపాల నాయుడు కుమార్తెగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన అరుణ కుమారి చిత్తూరు జిల్లాలో కీల‌కంగా వ్యవహరించారు. చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో గల్లా ఫ్యామిలీకి రాజకీయంగానే కాకుండా, పారిశ్రామికంగా బలంగా ఉండటంతో ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు ఆమె కాంగ్రెస్‌ ను వీడి తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. దీంతో ఆమె అప్పటి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఓటమి అనంతరం పూర్తి సమయాన్ని వ్యాపారాల కోసం కేటాయిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే పార్టీ కార్యక్రమాల‌కు దూరంగానే ఉంటున్నారు.

ఆమె రాజకీయాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు నుండి టీడీపీ ఎంపీగా కొనసాగుతుండటమేనని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. దీంతో ఎవ‌రో ఒక‌రు ఫ్యామిలీ నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారని చెబుతున్నారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చంద్రబాబుకు తెల‌ప‌డంతో నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లను పులిప‌ర్తి నానికి అప్పజెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. గల్లా జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గుంటూరు లోక సభ సభ్యునిగా గెలిచారు. అయితే మారిన రాజకీయ నేపథ్యంలో ఆయన కూడా టిడిపి క్రియాశీలక వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. తాను ఈ సారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఆ మేరకు తన మనసులో మాట చంద్రబాబుకు కూడా చెప్పారని తెలిసింది. 


అయితే లోకేష్ మాత్రం జయదేవ్ ను కాదని పులివర్తి నానికే టిక్కెట్టు ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీనితో జయదేవ్ లోకేష్ పట్ల కోపంతో ఉన్నారని అంటున్నారు. అందుకే లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు పార్లమెంటు నియోజక వర్గంలో జరిగినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. యాత్రలో పాల్గొనక పోగా లోకేష్ పై విమర్శలు చేసినట్టు సోషియల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాను విమర్శలు చేసినట్టు  వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటనలు చేశారు. దీనిపై కొందరు తిరిగి కామెంట్లు చేస్తున్నారు. జయదేవ్ లోకేష్ యాత్రలో ఎందుకు పాలు పంచుకోలేదో తెలపాలంటున్నారు. జరుతున్న పరిణామాలను పరిశీలిస్తే గల్లా కుటుంబం తేదేపాకు దూరం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *