6, మార్చి 2026, శుక్రవారం

చిత్తూరులో గ్యాస్ డెలివరీ బాయ్స్ అక్రమ వసూళ్లు

చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న ఏజెన్సీలు, అధికారులు
 సిలిండర్‌కు రూ.30 నుంచి 50 అదనంగా డిమాండ్ 
భయంతో ఫిర్యాదు చేయలేని వినియోగదారులు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అక్రమ వసూళ్లు విస్తృతంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిలిండర్ ధరలోనే డెలివరీ ఛార్జీలు కలిపి ఉన్నప్పటికీ, డెలివరీ బాయ్స్ అదనంగా రూ. 30 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఈ అదనపు భారంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఈ అక్రమ దందా మరింత పెరుగుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే తదుపరి సిలిండర్ విషయంలో వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారు. వినియోగదారులు ఇంట్లో లేరని, అడ్రస్సు దొరకలేదని, ఇంటికి తాళం వేశారని గ్యాస్ సిలిండర్ ను రిటర్న్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు సురేందర్ ఆశ్రమం మళ్లీ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 50 రూపాయలే కదా అని పలువురు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు.

చిత్తూరు పట్టణంలో ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థల గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. పట్టణంలో సుమారు 1.20 లక్షల నుంచి 1.50 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతి రోజు వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు గృహాలకు సరఫరా అవుతున్నాయి. అయితే డెలివరీ సమయంలో గ్యాస్ బాయ్స్ అధికారిక బిల్లు ధరకు అదనంగా నగదు డిమాండ్ చేస్తున్నారని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. గ్యాస్ సరఫరా నిబంధనల ప్రకారం, ఏజెన్సీ పరిధిలో 5 కిలోమీటర్ల లోపు ఉన్న వినియోగదారులకు హోమ్ డెలివరీ పూర్తిగా ఉచితం. వినియోగదారుడు చెల్లించే సిలిండర్ బిల్లులోనే డెలివరీ ఛార్జీలు కలిపి ఉంటాయి. అందువల్ల అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఏజెన్సీ నుంచి దూరం ఎక్కువగా ఉంటే మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన స్వల్ప కాన్వేయన్స్ ఛార్జీలు ఉండవచ్చు. అవి కూడా బిల్లులో స్పష్టంగా ముద్రించి ఉంటేనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే చిత్తూరులో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. గ్యాస్ బాయ్స్ అంతస్తుల వారీగా వేర్వేరు రేట్లు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌కు ఒక రేటు, మొదటి అంతస్తుకు మరో రేటు, రెండో లేదా మూడో అంతస్తుకు ఇంకా ఎక్కువ రేటు పేరుతో అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని సమాచారం. సిలిండర్‌ను ఇంటి గుమ్మం వరకు చేర్చడం డెలివరీ సిబ్బంది బాధ్యత అయినప్పటికీ, ఈ పేరుతో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయని వినియోగదారులు అంటున్నారు.

ముఖ్యంగా ఆన్‌లైన్ ద్వారా ముందుగానే సిలిండర్ డబ్బులు చెల్లించినా కూడా డెలివరీ సమయంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఇవ్వకపోతే సిలిండర్ ఇవ్వకుండా తిరిగి తీసుకెళ్తారనే భయం ప్రజల్లో నెలకొంది. తదుపరి సారి సిలిండర్ సరఫరా చేయరేమో అన్న ఆందోళనతో చాలా మంది వినియోగదారులు నోరు మూసుకుని అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీలకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కొందరు వినియోగదారులు ఏజెన్సీలకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా చూస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో డెలివరీ బాయ్స్ అక్రమ వసూళ్లు నిరభ్యంతరంగా కొనసాగుతున్నాయని అంటున్నారు. వినియోగదారుల హక్కుల ప్రకారం బిల్లులో ఉన్న ధర కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేయడం నేరం. డెలివరీ సమయంలో ఇచ్చే క్యాష్ మెమోలో ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. అందులో లేని ఇతర ఛార్జీలను వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ డెలివరీ సిబ్బంది అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే, సంబంధిత గ్యాస్ కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే జిల్లా వినియోగదారుల ఫోరమ్ లేదా పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదించే అవకాశమూ ఉంది.

ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దీపం పథకం కింద సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ల డెలివరీలో ఎటువంటి అక్రమ వసూళ్లు జరగకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పట్టణంలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే అసలు పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ దందాకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వినియోగదారుల హక్కులను కాపాడటం, గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం కోసం సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. లేకపోతే చిన్న మొత్తాల పేరుతో జరుగుతున్న ఈ అక్రమ వసూళ్లు భవిష్యత్తులో మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

*ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన నంబర్లు*

మీరు ఎదుర్కొంటున్న సమస్యపై నేరుగా కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. వారు తక్షణమే స్పందించి ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటారు.

గ్యాస్ కంపెనీ  టోల్ ఫ్రీ నంబర్
హెచ్.పీ గ్యాస్  1800-233-3555
ఇండియన్ గ్యాస్ 1800-233-3555 / 1906
భారత్ గ్యాస్ 1800-22-4344

 వినియోగదారుల హక్కుల ప్రకారం, బిల్లు కంటే ఎక్కువ వసూలు చేయడం నేరం. చిత్తూరు జిల్లా వినియోగదారులు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి అక్రమ వసూళ్లను ప్రశ్నించాలి. అవసరమైతే జిల్లా వినియోగదారుల ఫోరమ్ లేదా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *