4, మార్చి 2026, బుధవారం

పొగమంచు నుంచి మామిడి ఎండల ఉపశమనం…

జిల్లాకు తప్పిన తుఫాన్ ముప్పు, దిగుబడిపై ఆశాభావం 

ఎగుమతి అవుతున్న పల్ప్, గుజ్జు పరిశ్రమలలో తగ్గుతున్న నిల్వలు

50 శాతం మామిడి దిగుబడి రావచ్చని అధికారుల అంచనా

 చిత్తూరు మామిడి సీజన్‌కు ఆశాజనక సంకేతాలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


రాష్ట్రంలో మామిడి సాగుకు అగ్రగామిగా నిలిచిన చిత్తూరు జిల్లాలో 2026 మామిడి సీజన్‌ మొదట్లో వాతావరణ సవాళ్లతో రైతుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, ఇటీవలి ఎండలతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ ఆశాజనక దిశగా సాగుతోంది. క్రమంగా పూత దశ నుంచి కాయ దశకు మారుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తుఫాన్ కారణంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ మామిడి రైతుల మీద బాంబు లాంటి వార్తను పేల్చింది. అయితే అదృష్టవశాత్తును జిల్లాలో భారీ వర్షాలు పడలేదు. మామిడి పూత పైన, పిందెల మీద ఎలాంటి ప్రభావం పడలేదు. పూత నష్టం అంత భారీగా జరగలేదు. మరోవైపు జిల్లాలోని మామిడి గుజ్జు ఫ్యాక్టరీలలో పల్ప్ నిల్వలు గూడ క్రమంగా తరిగిపోతున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎగుమతులు సాఫీగా జరుగుతున్నాయి. ఫలితంగా ఈ సంవత్సరం మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం కంటే కొంత ఆశాజనకంగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు, మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



ఉద్యానవన శాఖ అధికారులు, క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం జిల్లాలో సుమారు 1.3 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, తోతాపురి (బెంగుళూర), నీలం, బంగినపల్లి (బేనీషా), మల్లిక, కాలేపాడు వంటి రకాలు ప్రధానంగా సాగవుతున్నాయి. జిల్లాలోని 21 మండలాల్లో మామిడి ప్రధాన వాణిజ్య పంటగా ఉండటం, వేలాది రైతుల జీవనాధారంగా నిలవడం విశేషం. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో డిసెంబరు, జనవరి నెలల్లో దట్టమైన పొగమంచు, చిరుజల్లులు, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు మామిడి పూతపై ప్రభావం చూపాయి. సాధారణంగా నవంబరు చివరి నుంచి డిసెంబరులో రావాల్సిన పూత ఈసారి జనవరి నెలకు ఆలస్యమైంది. ఫిబ్రవరి మధ్య నాటికి కేవలం 40 నుంచి 50 శాతం చెట్లు మాత్రమే పూత దశకు చేరుకోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా పశ్చిమ మండలాలు, సోమల ప్రాంతాల్లో పూత శాతం తక్కువగా నమోదవడం గమనార్హం. పొగమంచు ప్రభావంతో వచ్చిన పూత కొంత మేర రాలిపోవడం, మాడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయనే భయం రైతుల్లో నెలకొంది. తామర పురుగులు, తేనె మంచు పురుగుల దాడి, బూడిద తెగులు, పక్షి కన్ను వంటి వ్యాధులు వ్యాపించే అవకాశంపై నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. నేలలో తేమశాతం అధికంగా ఉండటం వల్ల చెట్ల సహజ పుష్పోత్పత్తి ప్రక్రియ మందగించిందని ఉద్యానవన నిపుణులు పేర్కొన్నారు.

అయితే ఇటీవలి రోజుల్లో ఎండలు పెరగడం జిల్లాలో మామిడి పంటకు ఉపశమనాన్ని కలిగించింది. ఉద్యానవన శాఖ అధికారుల అంచనాల ప్రకారం ప్రస్తుతం సుమారు 50 శాతం వరకు పూత నిలిచే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఎండ తీవ్రత పెరగడం వల్ల పూత స్థిరపడటానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, పూత రాలిపోవడం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇక వాతావరణ శాఖ రెండు రోజులపాటు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించినప్పటికీ, అదృష్టవశాత్తూ చిత్తూరు జిల్లాలో గణనీయమైన వర్షాలు నమోదు కాలేదు. దీంతో పూత దశలో ఉన్న తోటలకు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని ఉద్యానవన శాఖ అధికారులు స్పష్టం చేశారు. వర్షాలు పడకపోవడం వల్ల పూత, పిందె దశలో ఉన్న చెట్లు రక్షించబడ్డాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 80 శాతం తోటల్లో పూత ప్రారంభమైందని, మిగిలిన తోటల్లో కూడా క్రమంగా పూత అభివృద్ధి చెందుతోందని అధికారులు తెలిపారు. వాతావరణం ఇలాగే అనుకూలంగా కొనసాగితే గత సంవత్సరం తరహాలోనే ఈ ఏడాది కూడా సాధారణ స్థాయి దిగుబడి వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. గత ఏడాది సుమారు 60 శాతం వరకు దిగుబడి రాగా, ఈ సంవత్సరం సుమారు 50 శాతం వరకు దిగుబడి నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ప్రారంభ అంచనాల ప్రకారం హెక్టారుకు 8 టన్నుల దిగుబడి సాధ్యమని భావించినప్పటికీ, వాతావరణ మార్పుల కారణంగా ఇది కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ పూత పూర్తిగా దెబ్బతినకపోవడం, ఎండల ప్రభావంతో పంట నిలవడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మరోవైపు మామిడి మార్కెట్ పరిస్థితులు కూడా ఈ సీజన్‌కు కొంత అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం మామిడి పల్ప్ నిల్వలు జిల్లాలో గణనీయంగా తగ్గాయి. 2024 సీజన్‌లో అధిక ధరల కారణంగా పల్ప్ నిల్వలు పెద్దగా ఎగుమతి కాలేక ఫ్యాక్టరీల్లో నిల్వగా మిగిలిపోయాయి. అనేక పల్ప్ ఫ్యాక్టరీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. కొన్నిచోట్ల సంవత్సరాలుగా నిల్వలు అలాగే ఉండిపోయి యజమానులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. కానీ గత ఏడాది నుంచి నిల్వలు క్రమంగా ఎగుమతి అవుతూ ఉండటంతో ఈ ఏడాది కొత్త క్రషింగ్‌ సీజన్‌కు ఫ్యాక్టరీలు సిద్ధమవుతున్నాయి. పాత నిల్వలు తగ్గిపోవడం, ఎగుమతులు సాఫీగా సాగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం మామిడి పండ్లకు ధరలు ఆశాజనకంగా ఉండవచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. వర్తకులు కూడా ఈసారి కొనుగోళ్లపై ఆసక్తి చూపే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చిత్తూరు మామిడి మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా తోతాపురి రకం పల్ప్ పరిశ్రమలకు, ఎగుమతులకు కీలకంగా ఉంటుంది. సాధారణంగా సీజన్‌లో రోజుకు పలువురు వ్యాపారులు జిల్లాలో మకాం వేసి భారీగా కొనుగోళ్లు నిర్వహిస్తారు. ఈసారి పంట పూర్తిగా దెబ్బతినకపోవడం, పూత నిలకడగా ఉండటం వల్ల మార్కెట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు పలు శాస్త్రీయ సూచనలు చేస్తున్నారు. పూత, పిందె దశలో తోటలకు తేలికపాటి నీటి యాజమాన్యం పాటించడం, సూక్ష్మ పోషకాలు అందించడం, తామర పురుగులు, తేనె మంచు పురుగుల నివారణకు సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. బూడిద తెగులు నివారణకు గంధకం పిచికారీ చేయడం ద్వారా పూతను రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సీజన్ ప్రారంభంలో పొగమంచు, వాతావరణ అస్థిరతతో మామిడి రైతులు తీవ్ర ఆందోళన చెందగా, ప్రస్తుతం ఎండల అనుకూలత, వర్షాలు లేకపోవడం, పూత నిలకడతో పరిస్థితి ఆశాజనకంగా మారుతోంది. గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గినా, ఈ ఏడాది కూడా సాధారణ స్థాయి దిగుబడి వచ్చే అవకాశముందని ఉద్యానవన శాఖ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అనుకూల వాతావరణం కొనసాగితే చిత్తూరు మామిడి రైతులకు ఈ సీజన్‌లో గిట్టుబాటు ధరలు, స్థిరమైన దిగుబడితో ఉపశమనం లభించే అవకాశముందని వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గంగ 1 మందులను పిచికారి చేస్తున్న రైతులు

గంగ 2 మామిడి పూ

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *