సామాజిక పింఛన్ల పంపిణీ నేడే
ఒకరోజు ముందుగానే పింఛనదారులకు పండుగ
2,34,186 మందికి రూ. 101.60 కోట్ల పంపిణీ
ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
మార్చి 1వ తారీఖున ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన నిధులను ముందుగానే జిల్లాలకు విడుదల చేసి, మండలాలు, గ్రామాలకు కేటాయించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుండగా, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే నగదు చెల్లింపులు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పథకం కింద బలహీన వర్గాలకు సమయానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి జిల్లాలో మొత్తం 2,34,186 మంది లబ్ధిదారులకు రూ.101.60 కోట్ల పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో సాధారణ పింఛన్ల కింద 2,32,076 మందికి రూ.98.88 కోట్లు, ఆరోగ్య పింఛన్ల కింద 2,110 మందికి రూ.2.72 కోట్లు కేటాయించారు. జిల్లాలో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్లే ఉండగా 1,15,209 మందికి రూ.47.10 కోట్లు విడుదల చేశారు. వితంతు పింఛన్లు 59,942 మందికి రూ.24.67 కోట్లు, దివ్యాంగుల పింఛన్లు 31,738 మందికి రూ.19.96 కోట్లు అందజేయనున్నారు. చేనేత కార్మికులు 2,227 మందికి రూ.0.90 కోట్లు, అభయహస్తం కింద 9,668 మందికి రూ.0.51 కోట్లు, కల్లుగీత కార్మికులకు 520 మందికి రూ.0.21 కోట్లు కేటాయించారు. ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులు 31 మందికి రూ.0.01 కోట్లు, ఒంటరి మహిళలకు కింద 4,760 మందికి రూ.1.95 కోట్లు, మత్స్యకారులకు 208 మందికి రూ.0.08 కోట్లు అందజేయనున్నారు. సాంప్రదాయ డప్పు కళాకారులకు 5,598 మందికి రూ.2.25 కోట్లు, చర్మకారులకు 722 మందికి రూ.0.29 కోట్లు, కళాకారులకు 56 మందికి రూ.0.02 కోట్లు, సైనిక్ వెల్ఫేర్ పింఛన్లు 43 మందికి రూ.0.02 కోట్లు కేటాయించారు. సీకేడీయూ ప్రైవేట్ కేటగిరీ కింద 365 మందికి రూ.0.37 కోట్లు, సీకేడీయూ గవర్నమెంట్ కింద 219 మందికి రూ.0.22 కోట్లు, ఏఆర్టీ పింఛన్లు 770 మందికి రూ.0.31 కోట్లు విడుదల చేశారు.
ఆరోగ్య పింఛన్ల కింద తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా పింఛన్లు అందజేయనున్నారు. వీల్‌చైర్ లేదా మంచానికే పరిమితమైన పక్షవాతం బాధితులు 741 మందికి రూ.1.12 కోట్లు, సీవియర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ, ప్రమాద బాధితులు 743 మందికి రూ.1.12 కోట్లు కేటాయించారు. థలసేమియా బాధితులు 31 మందికి రూ.0.03 కోట్లు, సికిల్ సెల్ వ్యాధి బాధితులు 4 మందికి స్వల్ప మొత్తంగా పింఛన్లు, సీవియర్ హీమోఫిలియా బాధితులు 44 మందికి రూ.0.04 కోట్లు అందజేయనున్నారు. బిలాటరల్ ఎలిఫెంటియాసిస్ గ్రేడ్-4 బాధితులు 46 మందికి రూ.0.05 కోట్లు, సీకేడీ బాధితులు 18 మందికి రూ.0.02 కోట్లు, సీరమ్ క్రియాటినిన్ 5 మి.గ్రా. కంటే ఎక్కువ ఉన్న సీకేడీ బాధితులు 8 మందికి రూ.0.01 కోట్లు, స్మాల్ కాంట్రాక్టెడ్ కిడ్నీ కేసులు 11 మందికి రూ.0.01 కోట్లు కేటాయించారు. కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ లబ్ధిదారులు 107 మందికి రూ.0.11 కోట్లు, మల్టీడిఫార్మిటీ కుష్ఠు వ్యాధి బాధితులు 357 మందికి రూ.0.22 కోట్లు అందజేయనున్నారు. మొత్తం మీద జిల్లాలో 2,34,186 మంది లబ్ధిదారులకు రూ.101.60 కోట్లను ఇంటి వద్దకే పంపిణీ చేయడం ద్వారా వృద్ధులు, విధవలు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

