సీఎం చేత ప్రశంసలు అందుకున్న జిల్లా కలెక్టర్
సంజీవని ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ ప్రజెంటేషన్
జిల్లా కలెక్టర్ కృషిని ప్రశంసించిన సీఎం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లా పరిపాలనలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. అమరావతిలో రెండు రోజులపాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టు విజయవంతమైన అమలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్‌ను అభినందించారు. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం ధీమాను వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న పలు విజయవంతమైన కార్యక్రమాలను (సక్సెస్ స్టోరీలు) ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ సంజీవని ప్రాజెక్టు అమలు విధానం, లక్ష్యాలు, ఫలితాలు గురించి విపులంగా వివరించారు. ప్రాజెక్టు ద్వారా ప్రజలకు అందుతున్న డిజిటల్ ఆరోగ్య సేవల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సీఎం మరియు ఉన్నతాధికారులకు వివరించారు.
ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఆరోగ్య రంగంలో సాంకేతికతను వినియోగించి మంచి ఫలితాలు సాధించిందని ప్రశంసించారు. ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత డిజిటల్ రికార్డులను రూపొందించడం ద్వారా ఆరోగ్య సేవలను ప్రజలకు సులభంగా అందించగలిగామని పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్టును అన్ని జిల్లాల్లో సమర్థంగా అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవల్లో గణనీయమైన మార్పు వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక వ్యవసాయ రంగంపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. సంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లితే ఆదాయం పెరుగుతుందని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో చిత్తూరు జిల్లా వృద్ధిరేటు గణనీయంగా పెరిగిందని ప్రశంసించారు. ముఖ్యంగా పాడి పరిశ్రమలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఇతర రంగాలను కూడా అభివృద్ధి చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల నుంచి వచ్చిన ఏడు సక్సెస్ స్టోరీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సీఎం అన్నారు. ఈ కార్యక్రమాలను ఇతర జిల్లాల్లో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను గుర్తించి వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజెంటేషన్ అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉద్యానవన పంటలపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన సంజీవని ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సృష్టించి వారి ఆరోగ్య చరిత్రను ఆన్‌లైన్‌లో భద్రపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ విధానం ద్వారా రోగులు ఏ ఆసుపత్రికి వెళ్లినా వారి గత వైద్య వివరాలు వెంటనే డాక్టర్లకు అందుబాటులో ఉంటాయి. సంజీవని ప్రాజెక్టు కింద ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులతో సహా మొత్తం 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వీడియో కాల్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల సలహాలు పొందే సౌకర్యం కూడా కల్పించారు. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా విస్తరించే చర్యలు చేపట్టారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో లక్షలాది మందికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేశారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక సంజీవని డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా పరిపాలన నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. మొత్తానికి చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లా పరిపాలనకు గర్వకారణంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ముఖ్యమంత్రి చేత ప్రశంసలు లభించడం జిల్లా అధికార యంత్రాంగానికి మరింత ప్రోత్సాహాన్ని కలిగించింది. ఇక ఈ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

