11, మార్చి 2026, బుధవారం

పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన..?

పంచాయతీ ఎన్నికలు వాయిదా సంకేతాలు 
ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపు
ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలో గ్రామ పంచాయతీల పరిపాలనలో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని 621 గ్రామ పంచాయతీలకు ప్రస్తుత సర్పంచుల పదవీకాలం  ఏప్రిల్ 2తో ముగియనుండగా, ఈలోపు ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ప్రత్యేక అధికారులను నియమించిన తర్వాత 15వ ఆర్థక సంఘం నిధుల వ్యయం ప్రభుత్వం ఆంక్షలను తొలగించనుంది. ప్రత్యేక అధికారుల ద్వారా గ్రామాలలో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, గ్రామాలలో సమస్యలను పరిష్కరించి అనంతరం ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 90 శాతానికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సర్పంచులుగా ఉన్నారు. అందుకే ఆర్థిక సంఘం నిధుల వ్యయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో గ్రామీణ పరిపాలనలో కొంతకాలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామాలలో మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించడం వంటి అంశాలను ముందుగా పూర్తి చేసి తరువాత ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులకు కలిపి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.410.75 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇందులో రూ.365.69 కోట్లను టైడ్ గ్రాంట్ కింద, మరో రూ.45.06 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేయడానికి రెండు జీవోలు జారీ అయ్యాయి. ఈ నిధులు రాష్ట్రంలోని జిల్లా పరిషత్తులు,  మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు ఉపయోగపడనున్నాయి. ఈ నిధులను ప్రధానంగా గ్రామాలలో తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. అయితే సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం కొన్ని నియంత్రణలు విధించినట్లు సమాచారం. సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల అవసరాలను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లాలో గ్రామ పంచాయతీల పునర్విభజనకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని గ్రామాల పరిపాలనా పరిమితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ పంచాయతీలను జనాభా, ఆదాయం ఆధారంగా నాలుగు వర్గాలుగా వర్గీకరించే ప్రక్రియను ప్రారంభించింది. రూర్బన్, గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3గా విభజిస్తూ పంచాయతీ పరిపాలనను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని గంగవరం, ఐరాల, కార్వేటినగర్, వీ.కోట మండలాల్లోని కొన్ని పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు తక్షణం జరగకపోవచ్చనే సంకేతాల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పొడిగించింది. జిల్లాలో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమీక్ష (స్పెషల్ సమ్మరీ రివిజన్–2026) కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 15,74,979 మంది ఓటర్లు నమోదై ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) కె. మోహన్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతంగా చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 1,776 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో పాత భవనాల్లో ఉన్న 11 పోలింగ్ కేంద్రాలను కొత్త భవనాలకు మార్చినట్లు వివరించారు. అలాగే 68 పోలింగ్ కేంద్రాల పేర్లను మార్పు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో 1,200 మందికి మించి ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ ద్వారా వచ్చే ఆదాయంలో సగం వాటాను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం పంచాయతీల పరిధిలో సమీకరించే ఆదాయంలో 50 శాతం గ్రామ పంచాయతీలకే లభించనుండగా, 30 శాతం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు, మిగిలిన 20 శాతం రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగానికి కేటాయించనున్నారు. గ్రామాలలో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారులు వంటి కనీస అవసరాల కోసం పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని చాలా గ్రామ పంచాయతీలలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులే అధిక సంఖ్యలో ఉన్నారు. వారి పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమించి గ్రామాల అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి, ఆర్థిక నిధులను వినియోగించి తరువాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లే వ్యూహం అమలు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తక్షణం జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో కొంతకాలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగవచ్చని స్పష్టమవుతోంది. ఈలోపు గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేసి, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టి అనంతరం ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *