8, మార్చి 2026, ఆదివారం

సమస్యల వలయంలో చిత్తూరు జిల్లా ప్రజలు విలవిల

మామిడి రైతులకు అందని బిల్లులు 
హామీలకే పరిమితమైన తొమ్మిది గంటల విద్యుత్తు 
నత్త నడకన చిత్తూరు తాగునీటి ప్రాజెక్టు 
అనుమతికి నోచుకోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు 
గోకులం షెడ్లకు అందని బిల్లులు 
జిల్లాలో మొక్కుబడిగా ఉపాధి హామీ పనులు
పంట పొలాలపై ఏనుగుల దాడులు 
కుంభకోణాలమయం సహకార రంగం
నేడే జిల్లా సమీక్ష మండలి సమావేశం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)


జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న చిత్తూరు జిల్లా సమీక్షా మండలి (డీఆర్‌సీ) సమావేశం జిల్లా భవిష్యత్తును నిర్ణయించే కీలక వేదికగా మారనుంది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాగునీటి కొరత నుంచి రైతుల సమస్యలు, పాడి పరిశ్రమ సంక్షోభం నుంచి మౌలిక సదుపాయాల లోపాలు వరకు అనేక అంశాలు అధికారుల ముందుకు రానున్నాయి. ప్రజా ప్రతినిధులు ఈ సమస్యలను గట్టిగా ప్రస్తావించి తక్షణ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. అడవిపల్లె నుంచి చిత్తూరుకు తాగునీరు అందించే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయకపోతే వేసవిలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు ప్రతిపాదించిన సుమారు రూ.7,000 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇప్పటివరకు ఆమోదం పొందకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రధాన ప్రాజెక్టుల పనులు కూడా ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఫలితంగా చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం లేదు. కలవగుంటలోని ఎన్టీఆర్ జలాశయం నుంచి కృష్ణాపురం రిజర్వాయర్ వరకు రూ.45 కోట్లతో చేపట్టాల్సిన చెరువుల అనుసంధాన కార్యక్రమం కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీనివల్ల ఎన్టీఆర్ జలాశయం నుంచి వచ్చే జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న పాడి పరిశ్రమ కూడా ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాడి రైతులకు పాలకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. పశుగ్రాసం కొరత కూడా తీవ్రంగా ఉంది. పశువులకు తాగునీరు అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో గతంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన గోకులం షెడ్లకు సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించకపోవడం రైతుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఈ అంశంపై డీడీఆర్‌సీ సమావేశంలో స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

వ్యవసాయ రంగం కూడా అనేక సమస్యలతో సతమతమవుతోంది. జిల్లాలో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి కేవలం 7 గంటల మాత్రమే విద్యుత్ అందుతోందని రైతులు చెబుతున్నారు. అందులోనూ తరచుగా విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. మామిడి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మామిడి తోటలకు నీరు అందించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి జిల్లాలో మామిడి పూత భారీగా వచ్చినప్పటికీ అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత ఫలదీకరణం కాకుండా ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గత ఏడాది మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు మామిడికాయలను సరఫరా చేసిన రైతులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని రైతులు పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు కూడా ఆశించిన విధంగా సాగడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కొత్తగా పనులు ప్రారంభించకుండా గతంలో ప్రారంభించిన పనులను మాత్రమే పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం వల్ల గ్రామీణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. దీంతో ఉపాధి హామీ పనులను విస్తృతంగా ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది.

మరోవైపు జిల్లాలో శాంతిభద్రతల పరంగా కూడా కొన్ని సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మండలాల్లో ఏనుగుల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. తరచూ ఏనుగులు పంట పొలాలపై దాడి చేసి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో చిరుతపులులు పశువులపై దాడులు చేస్తూ గ్రామస్తులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యలపై అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో సహకార రంగంలో జరిగిన కుంభకోణాలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, సింగిల్ విండో సంఘాల్లో గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలో కూడా కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం హౌస్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా స్థాయిలో విచారణ పురోగతి కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇక జిల్లాలో భూముల రీ-సర్వే కార్యక్రమంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లకుండా కేవలం నమోదు ప్రక్రియను మాత్రమే పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే రాళ్లు కచ్చితంగా ఫిక్స్ చేయకుండా మొక్కుబడిగా ప్రక్రియ ముగిస్తున్నారని రైతులు అంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో భూవివాదాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  డీడీఆర్‌సీ సమావేశంలో జిల్లాలోని అన్ని ప్రధాన సమస్యలను సమగ్రంగా చర్చించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి జిల్లాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా ఈ సమావేశం ఫలప్రదంగా మారాలని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *