7, మార్చి 2026, శనివారం

చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

ఉలిక్కిపడ్డ న్యాయవాదులు, న్యాయమూర్తులు  

గంటల తరబడి తనిఖీలు

పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు


చిత్తూరు, మార్చి 3 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు నగరంలోని చిత్తూరు జిల్లా కోర్టు మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాన్ని ఎదుర్కొంది. మధ్యాహ్నం సుమారు 1:45 గంటల ప్రాంతంలో కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు ఒక సంచలనాత్మక ఈమెయిల్ అందింది. ఆ ఈమెయిల్‌లో జిల్లా కోర్టు ఆవరణలో 14 చోట్ల బాంబులు అమర్చినట్లు పేర్కొంటూ, అవి ఎప్పుడైనా పేలే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, న్యాయమూర్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఈమెయిల్ అందుకున్న వెంటనే కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలు జిల్లా కోర్టు ఆవరణకు చేరుకుని పరిసరాలను ఖాళీ చేయించారు. కోర్టు గదుల్లో కొనసాగుతున్న విచారణలను తక్షణమే నిలిపివేశారు. న్యాయమూర్తులు మధ్యాహ్నానికి ముందే కేసులను వాయిదా వేయడంతో, విచారణలు నిలిచిపోయాయి. కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయవాదులు, వాదన కోసం వచ్చిన ప్రజలు బయటకు పంపారు. తనిఖీలు విస్తృతంగా చేపట్టేందుకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిపించారు. అదనపు ఎస్పీ దేవదాసు స్వయంగా జిల్లా కోర్టుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిత్తూరు డిఎస్పి సాయినాథ్, ఏఆర్ డి ఎస్ పి చిన్ని కృష్ణ, టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని కోర్టు గదులు, రికార్డు గదులు, పార్కింగ్ ప్రదేశాలు, సిబ్బంది గదులు సహా ప్రతి మూలను సవివరంగా పరిశీలించారు. సాయంత్రం 6:30 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో చివరకు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ వ్యతిరేకంగా తాము బాంబు పెట్టామని పేర్కొంటూ కనిమొళి అనే పేరుతో ఉన్న ఒక ఈమెయిల్ ఐడీ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఆ ఈమెయిల్ నిజస్వరూపం, దాని మూలాలు ఏవో అన్వేషించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. మూడు నెలల క్రితం కూడా ఇదే తరహాలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అప్పట్లో కూడా కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయి విస్తృత తనిఖీలు నిర్వహించారు. కానీ ఎటువంటి బాంబు లేదని తేలింది. ఆ ఘటనకు బాధ్యులెవరో ఇప్పటివరకు గుర్తించలేకపోయారని సమాచారం. తాజాగా మరోసారి ఇలాంటి బెదిరింపు రావడంతో భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంగళవారం ఘటనతో కోర్టు ఆవరణలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసుల విచారణకు వచ్చిన వాదులు, పిటిషనర్లు, సాక్షులు భయాందోళనకు గురయ్యారు. న్యాయవాదులు కోర్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీటీవీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నిరాధార వదంతులను నమ్మవద్దని సూచించారు. బెదిరింపు ఈమెయిల్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోర్టు వంటి కీలక న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి తప్పుడు బెదిరింపులు చేయడం తీవ్రమైన నేరమని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రానికి ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు లేవని స్పష్టమవడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ, ఈ ఘటన జిల్లా న్యాయవ్యవస్థలో భద్రతా ఏర్పాట్లపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

గంగ 2 జిల్లా కోర్టులో పోలీసులు తనిఖీలు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *