ఆంధ్రప్రభ వార్తకు స్పందన: గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు
అక్రమ వసూళ్లతో పాల్పడితే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు
ఐ వి ఆర్ స్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరణ
గ్యాస్ ఏజెన్సీలపై రూ. 10000 వరకు జరిమానా విధింపు
చిత్తూరు, మార్చి 7 (ఆంధ్రప్రభ బ్యూరో ): చిత్తూరు పట్టణంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించారు. వినియోగదారుల నుంచి సిలిండర్‌కు రూ.30 నుంచి 50 వరకు అక్రమంగా వసూలు చేస్తున్న డెలివరీ బాయ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్, జిల్లా పౌరసరఫరాల అధికారి శంకర్ స్పష్టం చేశారు. చిత్తూరు పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమయంలో అధికారిక బిల్లుకు అదనంగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన వార్త ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు విషయాన్ని సీరియస్‌గా తీసుకుని స్పందించారు. జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ డెలివరీ బాయ్స్ అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి కూడా వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్ తెలిపారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తూ, ఐవీఆర్ఎస్ వ్యవస్థ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు. గ్యాస్ సరఫరా వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలలోనే చిత్తూరు జిల్లాకు చెందిన రెండు గ్యాస్ ఏజెన్సీలపై ఒక్కొక్కటికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన డెలివరీ బాయ్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాంటి సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని స్పష్టం చేయగా, ఇప్పటికే కొందరిని తొలగించినట్లు ఏజెన్సీలు తమకు సమాచారం అందజేశాయని అధికారులు చెప్పారు. గ్యాస్ సరఫరా నిబంధనల ప్రకారం, వినియోగదారుడు చెల్లించే సిలిండర్ ధరలోనే డెలివరీ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఏజెన్సీ పరిధిలో 5 కిలోమీటర్ల లోపు ఉన్న వినియోగదారులకు హోమ్ డెలివరీ పూర్తిగా ఉచితం. ఈ పరిస్థితిలో సిలిండర్ ధరకు అదనంగా డబ్బులు వసూలు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీ బాయ్స్ అంతస్తుల వారీగా వేర్వేరు రేట్లు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌కు ఒక రేటు, మొదటి లేదా రెండో అంతస్తులకు మరో రేటు పేరుతో డబ్బులు వసూలు చేయడం అనుమతించబడిన విధానం కాదని పేర్కొన్నారు. సిలిండర్‌ను వినియోగదారుడి ఇంటి గుమ్మం వరకు చేర్చడం డెలివరీ సిబ్బంది బాధ్యత అని తెలిపారు. ఆన్‌లైన్‌లో ముందుగానే సిలిండర్ డబ్బులు చెల్లించినప్పటికీ డెలివరీ సమయంలో నగదు డిమాండ్ చేస్తున్న ఘటనలపై కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు వినియోగదారులను భయపెట్టేలా ఉంటాయని, అలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా డెలివరీ బాయ్స్ బిల్లు ధర కంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. గ్యాస్ స్లిప్‌పై ముద్రించిన ధర కంటే అధికంగా డబ్బులు అడిగితే వినియోగదారులు స్థానిక తహసీల్దార్, జిల్లా పౌరసరఫరాల అధికారికి లేదా జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. ఎవరైనా అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయడానికి జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్, జిల్లా పౌరసరఫరాల అధికారి శంకర్ తెలిపారు. వినియోగదారులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు భరోసా ఇచ్చారు.
గంగ 2 జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్

