7, మార్చి 2026, శనివారం

ఆంధ్రప్రభ వార్త స్పందన: డీఆర్‌సీ సమావేశం 9న నిర్వహణ



చిత్తూరు, మార్చి 6 (ఆంధ్రప్రభ బ్యూరో): ఎట్టికేలకు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించేందుకు జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశం ఈ నెల 9వ తేదీన జరగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డి ఆర్ సి సమావేశానికి గ్రహణం అని గత నెల 24వ తారీఖున ఆంధ్రప్రభ దిన పత్రికలో వార్త ప్రచురితమైన విషయం విధితమే. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన డి.ఆర్.సి. సమావేశం ఏడు నెలలు అయిన జరగలేదని వార్తల్లో వివరించడం జరిగింది. డిఆర్సి సమావేశం జరగకపోవడంతో జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోతున్నాయని వివరించడం జరిగింది. ఈ వార్తతో కదిలిన జిల్లా యంత్రాంగం ఎట్టికేలకు డీఆర్సీ సమావేశం ఖరారు చేశారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వివేకానంద భవన్ రెండో అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన దీపం–2.0, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, స్త్రీ నిధి, స్త్రీ శక్తి, ఆటో డ్రైవర్ల సేవలు తదితర అంశాలపై చర్చ జరగనుంది. అదేవిధంగా జెడ్పీ నిధులు, గ్రామీణ–పట్టణ తాగునీటి సరఫరా (వేసవి చర్యల ప్రణాళిక), పీఆర్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ పనులు, ఎంఎన్ఆర్ఈజీఎస్, రెవెన్యూ శాఖ (పీజీఆర్‌ఎస్ మరియు రీ–సర్వే), వ్యవసాయం, ఉద్యానవనం, వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ కార్యక్రమాల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు సంబంధిత వివరాలతో సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే అజెండాకు సంబంధించిన శాఖాధిపతులు తమ శాఖల వివరాలను సీపీఓ కార్యాలయానికి ఈ నెల 6వ తేదీలోగా అందజేయాలని సూచించారు.

గంగ 2 ఆంధ్రప్రభ వార్త

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *