25, మార్చి 2026, బుధవారం

చిత్తూరు జిల్లాలో కొండెక్కిన కోడి ధరలు

మటన్ రేటు పలుకుతున్న నాటుకోడి 

పెరిగిన కోళ్ల దానా ధరలు తగిన కోళ్ల పెంపకం 

చికెన్ కల్తీకి పాల్పడుతున్న వ్యాపారస్తులు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్న వేళ ఎండలకు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో రూ.200 నుంచి 250 మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా, రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.400కు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక నాటు కోడి ధరలు మరింతగా పెరిగి రూ.700 నుంచి రూ.900 వరకు చేరుకోవడం గమనార్హం. కోళ్ల దానా ధరలు వారిగా పెరగడంతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవి కారణంగా ఫారాలను కోడి పిల్లలు ఎక్కువగా చనిపోతున్నాయి. కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది అదునుగా వ్యాపారస్తులు చికెన్ కల్తీకి పాల్పడుతున్నారు. చనిపోయిన కోళ్లను కూడా కట్ చేసి వినియోగదారులకు అమ్మేస్తున్నారు. రెండు మూడు రోజులు నిర్వహించిన చికెన్ కూడా తాజా చికెన్ లో కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో  స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.380 నుండి 400 వరకు చేరగా, సాధారణ చికెన్ కూడా సామాన్యులకు అందనంత దూరంగా వెళ్లిపోయింది. ఈ ధరల పెరుగుదలతో హోటళ్లు, చిన్నచిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బిర్యానీ, చికెన్ ఫ్రై, పకోడీ వంటి వంటకాల ధరలను పెంచకపోతే నష్టాలు తప్పవని హోటల్ యజమానులు చెబుతున్నారు. కొన్నిచోట్ల అయితే గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు తాత్కాలికంగా మూతపడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం వేసవి తీవ్రతేనని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కోళ్లు బతికేలా ఉంచడానికి ఫారాల్లో కూలర్లు, ప్రత్యేక ఆహారం వంటి అదనపు ఖర్చులు పెరిగాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కారణంగా చికెన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం కలిసి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమయ్యాయి. కోళ్ల దాణా ధరలు కూడా పెరగడంతో వ్యాపారులకు భారంగా మారింది. ఈ భారమంతా చివరకు వినియోగదారుడిపైనే పడుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో వంట ఖర్చులు పెరిగిన నేపథ్యంలో చికెన్ కొనుగోలు చేయడం సామాన్య కుటుంబాలకు భారంగా మారింది.

చికెన్ ధరలు పెరగడం వల్ల ప్రజల ఆహార అలవాట్లలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో సాధారణంగా వినియోగించే చికెన్ వంటకాలు ఇప్పుడు విలాసవంతమైనవిగా మారాయి. హోటళ్లలో చికెన్ ఐటమ్స్ ధరలు రెట్టింపు కావడంతో చాలామంది నాన్‌వెజ్‌కు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల చికెన్ పకోడీ వంటి స్నాక్స్ కూడా భారీ ధరలకు అమ్ముతున్నారు. ఒక కుటుంబం సాధారణంగా చికెన్ కొనుగోలు చేసి వండుకోవాలంటే కనీసం రూ.500 ఖర్చవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక గ్యాస్ కొరత పరిస్థితులు సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేశాయి. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేసి హోటళ్లు నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అదనపు ఖర్చును కస్టమర్లపైనే మోపుతూ టిఫిన్, మీల్స్, ఇతర ఆహార పదార్థాలపై అదనపు ఛార్జీలు వేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలపై ద్వంద్వ భారం పడుతోంది. మరోవైపు చికెన్ ధరలు పెరిగిన నేపథ్యంలో కల్తీ, నాణ్యత లేని మాంసం అమ్మకాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే కోసి నిల్వ చేసిన కోళ్లు, చనిపోయిన కోళ్లు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆహార భద్రత అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా గుడ్ల మార్కెట్‌లో మాత్రం విరుద్ధ పరిస్థితి కనిపిస్తోంది. చికెన్ ధరలు పెరుగుతుండగా గుడ్ల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఒక గుడ్డు రూ.4 చొప్పున లభిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో చికెన్ ఆకాశంలో  గుడ్డు నేలమీద అనే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో చికెన్ ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎండల తీవ్రత కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *