18, మార్చి 2026, బుధవారం

గ్యాస్ కొరతతో అతలాకుతలమైన సామాన్యుని జీవితం

చిత్తూరులో పెరిగిన ధరలు, తగ్గిన నాణ్యత

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినడం, దిగుమతులపై ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో గ్యాస్ కొరత తీవ్రతరమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం నేరుగా సామాన్య ప్రజల రోజువారీ జీవన విధానంపై పడుతోంది. చిత్తూరు పట్టణంలో గ్యాస్ కొరత కారణంగా చిన్నపాటి హోటళ్లు, తిండిబండ్ల వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంకాలం ప్రజలు ఇష్టంగా తినే సమోసా, పానీపూరి, పరోటా వంటి వంటకాల ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో 12 రూపాయలుగా ఉన్న సమోసా ధర ఇప్పుడు 15 రూపాయలకు చేరింది. అలాగే పరోటా 15 రూపాయల నుంచి 20 రూపాయలకు పెరిగింది. పానీపూరి, ఇతర స్నాక్స్ ధరలు కూడా అదే దారిలో పెరుగుతున్నాయి.

టీ తాగడం వంటి సాధారణ అలవాటు కూడా ఇప్పుడు భారంగా మారింది. పది రూపాయలకు లభించిన టీ ఇప్పుడు 15 రూపాయలకు పెరగడంతో చిన్నపాటి ఆదాయం కలిగిన వర్గాలపై అదనపు భారం పడుతోంది. బజ్జీలు, బోండాలు వంటి తినుబండారాల ధరలు కూడా పెరిగాయి. ఐదు రూపాయలుగా ఉన్న బజ్జి, బోండా ఇప్పుడు ఏడు రూపాయలకు చేరుకుంది. కొన్ని చోట్ల ఒక ప్లేట్ ధర 15 రూపాయల వరకు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో పాటు నాణ్యత కూడా పడిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వేడి వేడి వంటకాలను అందించే హోటళ్లు, ఇప్పుడు ముందుగానే తయారు చేసి తర్వాత వినియోగదారులకు అందిస్తున్నాయి. దీనివల్ల రుచి తగ్గడంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు పెరగడంతో హోటళ్లలో ఐటమ్స్ సంఖ్య కూడా తగ్గించబడింది. తోపుడు బండ్లపై బజ్జీలు, బోండాలు, పానీపూరి అమ్మే చిన్న వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో కొందరు తమ వ్యాపారాలను పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. మరికొందరు అరకొరగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. గ్యాస్ లేకపోవడంతో కట్టెలు, బొగ్గు వంటి ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. దీనివల్ల ఖర్చు పెరగడంతో పాటు పని కూడా కష్టతరమవుతోంది.

ఇక గృహ వినియోగదారుల పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పట్టణాల్లో గ్యాస్ బుకింగ్ గడువు 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచగా, గ్రామీణ ప్రాంతాల్లో అది 25 రోజుల నుంచి 45 రోజులకు పెరిగింది. ఈ పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సిలిండర్ కోసం ముందుగానే బుకింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, సాంకేతిక సమస్యలు లేదా సరఫరా లోపాల వల్ల బుకింగ్ పూర్తి కావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తూ సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం గ్యాస్ కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ, భూమి మీద పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సరఫరా లోపాలు, ధరల పెరుగుదల, నాణ్యత తగ్గుదల అన్నీ కలిపి సామాన్య ప్రజల జీవనాన్ని కష్టాల్లోకి నెట్టుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడే వర్గాలు ఈ పరిస్థితిని తీవ్రంగా అనుభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాను పటిష్టం చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌పై కట్టడి విధించడం, చిన్న వ్యాపారులకు సహాయ చర్యలు చేపట్టడం అత్యవసరంగా మారింది. లేకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత విషమించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *