పంచాయతీ సర్పంచ్ ల చెక్ పవర్ పై డేగ కన్ను
నిధుల చెల్లింపులపై నియంత్రణ, డి డి ఓ అనుమతి
వారం రోజుల్లో ముగియనున్న సర్పంచుల పదవీకాలం
సిద్ధమవుతున్న ప్రత్యేక అధికారుల జాబితా
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
జిల్లాలోని సర్పంచులు చెల్లించి పంచాయతీ చెక్కులపై ప్రభుత్వం డేగ కన్ను వేసింది. సర్పంచుల సంతకం చేసిన చెక్కులను ఆచితూచి పాస్ చేస్తున్నారు. జిల్లాలో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడానికి వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో సర్పంచ్‌లకు ఉన్న ప్రత్యక్ష చెల్లింపుల అధికారంపై తాత్కాలికంగా చెక్ పెట్టింది. బుధవారం నుంచి సర్పంచ్‌లు స్వయంగా బిల్లులను క్లియర్ చేసే అవకాశాన్ని నిలిపివేసి, ప్రతి చెల్లింపును పర్యవేక్షణలోకి తీసుకువచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని పంచాయతీలకు వివిధ పద్ధతులు కింద సుమారు 30 కోట్ల రూపాయల నిధులు జమ అయ్యాయి. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం సర్పంచుల చెక్ పవర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోది. సర్పంచ్ పార్టీ చేసిన చెక్కులను డిడిఓ లకు పంపి వారి అనుమతితో అనంతరం ట్రెజరీలకు పంపుతున్నారు. ఇప్పటివరకు సర్పంచ్‌లు సిఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ద్వారా బిల్లులకు థంబ్ వేస్తే అవి నేరుగా ట్రెజరీకి వెళ్లేవి. కానీ తాజా ఆదేశాల ప్రకారం ఇకపై అన్ని బిల్లులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డిడిఓ) లాగిన్‌కు వెళ్తాయి. డిడిఓ సమీక్షించి ఆమోదం తెలిపిన తరువాతే చెల్లింపులు ట్రెజరీకి పంపబడతాయి. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులకు కూడా ఇదే విధానం అమలు చేయడం ద్వారా చివరి దశలో నిధుల వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణ తీసుకువచ్చారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎక్కడైనా కార్యదర్శులు, సర్పంచ్‌లు కుమ్మక్కై నిధులు మళ్లించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకునే విధానం ఉండగా, ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ద్వారానే నియంత్రణలు మరింత కఠినతరం చేయడం విశేషంగా మారింది. ఇక సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, ఆ తరువాత గ్రామపంచాయతీల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మండలాల వారీగా జాబితాలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించే ప్రక్రియ వేగవంతమైంది. తహసీల్దార్, ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ శాఖల అధికారులు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. కొన్ని మండలాల్లో గ్రామపంచాయతీలు అధికంగా ఉండటంతో రెండు లేదా మూడు పంచాయతీలకు ఒక అధికారిని నియమించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఈ బాధ్యతలకు దూరంగా ఉంచారు, ఎందుకంటే వారు ఇప్పటికే పనుల కొలతలు, ధృవీకరణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 622 గ్రామపంచాయతీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ శీర్షికల కింద గణనీయమైన నిధులు విడుదలయ్యాయి. మొత్తం సుమారు రూ.30 కోట్ల వరకు నిధులు అందాయి. తలసరి గ్రాంట్ కింద రూ.37.94 లక్షలు విడుదల కాగా, గ్రామ స్థాయి చిన్నపాటి అభివృద్ధి పనులకు ఇవి వినియోగించాల్సి ఉంటుంది. సీనరేజీ గ్రాంట్ కింద భారీగా రూ.1507.14 లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధులు ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, నీటి వనరుల అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడతాయి. వృత్తి పన్ను కింద రూ.91.5 లక్షలు గ్రామపంచాయతీలకు అందగా, ఇది స్థానిక పాలన నిర్వహణకు ఉపయుక్తంగా ఉంటుంది. సర్పంచ్‌ల గౌరవ వేతనాల కోసం రూ.221.21 లక్షలు కేటాయించారు. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా టైడ్ గ్రాంట్ల కింద సుమారు రూ.994.93 లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధులను తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వ్యర్థ నిర్వహణ వంటి ప్రత్యేక అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు గ్రామపంచాయతీలకు చేరిన నేపథ్యంలో, పదవీకాలం ముగింపు దశలో అవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రతి చెల్లింపుపై అధికారుల నిఘా పెంచి, పారదర్శకతను కాపాడే దిశగా అడుగులు వేసింది. మొత్తంగా, సర్పంచ్‌ల అధికారాలపై తాత్కాలిక నియంత్రణ, నిధుల వినియోగంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణతో గ్రామపంచాయతీ వ్యవస్థలో క్రమశిక్షణను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

