ఎన్నికల హామీకే పరిమితమైన 9 గంటల విద్యుత్తు
వ్యవసాయానికి 7 గంటల మాత్రమే విద్యుత్ సరఫరా
వేసవి కావడంతో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
లో ఓల్టేజి, విద్యుత్తు అంతరాలతో రైతులు సతమతం
9 గంటల విద్యుత్ సరఫరాకు రైతుల డిమాండ్
(ఆంధ్రప్రభ బ్యూరో ,చిత్తూరు.)
రైతులకు పగటిపూట 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ చిత్తూరు జిల్లాలో అమలు కావడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికే 9 గంటల విద్యుత్ సరఫరా హామీని నిలబెట్టుకున్నామని ప్రకటించినప్పటికీ, జిల్లాలో మాత్రం వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కేవలం 7 గంటల విద్యుత్ మాత్రమే అందుతోంది. అదికూడా నిరంతరంగా కాకుండా రెండు విడతలుగా సరఫరా చేస్తున్నారు. ఒక షిఫ్ట్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరో షిఫ్ట్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఇస్తున్నారు. ఈ విధానం రైతులకు అనుకూలంగా లేకపోవడంతో సాగు పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు షిఫ్ట్‌లకు ఒకేసారి విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తోంది. ఈ సమయంలో విద్యుత్ శాఖకు ఉన్న సామర్థ్యం సరిపోకపోవడంతో లో వోల్టేజ్ సమస్యలు తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి. పైగా తరచూ అరగంట నుంచి గంట వరకు విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంతో పేరుకు ఉన్న 7 గంటల విద్యుత్ కూడా రైతులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదు. విద్యుత్ శాఖ అధికారుల ప్రకారం, జిల్లాలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు సరిపోవడం లేదని చెబుతున్నారు. 9 గంటల విద్యుత్ అందించాలంటే కనీసం నాలుగు గంటల పాటు రెండు షిఫ్ట్‌లకు ఒకేసారి సరఫరా చేయాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అభివృద్ధి చెందలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు గంటలకే లో వోల్టేజ్ సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇక వేసవికాలం ప్రారంభం కావడంతో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగింది. ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు వంటి పరికరాల వినియోగం అధికమవుతుండటంతో సరఫరా పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రభావం నేరుగా వ్యవసాయ రంగంపై పడుతోంది. జిల్లాలో 1 లక్ష 62 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటికి సరిపడా విద్యుత్ సరఫరా అందించడం సవాలుగా మారింది.
జిల్లాలో 400 కేవీ సబ్‌స్టేషన్ ఒకటి, 220 కేవీ సబ్‌స్టేషన్లు ఐదు, 132 కేవీ సబ్‌స్టేషన్లు 12, 33 కేవీ సబ్‌స్టేషన్లు 226 ఉన్నాయి. అదనంగా త్రీ ఫేస్ కంటే అధిక సామర్థ్య ట్రాన్స్‌ఫార్మర్లు 3,375, తక్కువ సామర్థ్య ట్రాన్స్‌ఫార్మర్లు 68,026, సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు 10,016 ఉన్నప్పటికీ, పెరుగుతున్న వినియోగానికి ఇవి సరిపోవడం లేదని స్పష్టమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 2,317 కొత్త వ్యవసాయ సర్వీసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 2,048 సర్వీసులు ఇచ్చారు. దీంతో లోడ్ మరింత పెరిగింది. మరోవైపు, మామిడి సీజన్ ప్రారంభమవడంతో రైతులకు నీటి అవసరం పెరిగింది. అలాగే ఇతర పంటలు కూడా సాగులో ఉండటంతో నిరంతర విద్యుత్ అవసరం అత్యవసరమైంది. వేసవికాలం ప్రభావంతో చెరువులు, కుంటలు ఎండిపోతుండటంతో భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో మోటార్ల వినియోగం పెరిగి విద్యుత్ అవసరం మరింత అధికమైంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా లోపాలు రైతులకు పెద్ద తలనొప్పిగా మారాయి. లో వోల్టేజ్ కారణంగా మోటార్లు సరిగా పనిచేయకపోవడం, తరచూ ఫ్యూజ్ అవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పంటలకు సమయానికి నీరు అందక దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన 9 గంటల నిరంతర విద్యుత్ హామీ చిత్తూరు జిల్లాలో అమలు కావడం లేదని రైతు సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల హామీలను ప్రభుత్వం కచ్చితంగా నిలబెట్టుకోవాలని, వెంటనే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి రైతులకు పూర్తి స్థాయిలో 9 గంటల విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతు ఆధారిత జిల్లాగా పేరుగాంచిన చిత్తూరులోనే ఈ స్థితి ఉండటం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ సమస్యలను పరిష్కరించి, రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలని కోరుతున్నారు.

