14, మార్చి 2026, శనివారం

అత్యంత ప్రకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

129 పరీక్షా కేంద్రాలు ... 23,095 మంది విద్యార్థులు 
12,010 మంది ఇన్విజిలేటర్లు, 9 స్క్వాడ్లు 
12 సమస్యాత్మక కేంద్రాలలో నిఘా కెమెరాలు 
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం 
హాల్ టికెట్ లో క్యూఆర్ కోడ్ల ముద్రణ
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రభతో  డీఈఓ రాజేంద్రప్రసాద్


ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

జిల్లాలో సోమవారం నుండి జరగనున్న పదవ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని కూడా సహించబోమని, ఎక్కడైనా కాపీయింగ్ జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శనివారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడిన ఆయన, మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన దశ కావడంతో ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించి హెడ్మాస్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓలు) తదితరులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల భద్రత, పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, పరీక్ష అనంతరం ఆన్సర్ పత్రాలను స్ట్రాంగ్ రూములకు సురక్షితంగా తరలించడం వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. పరీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసు శాఖతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో మొత్తం 129 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వీటిలో ఎ కేటగిరీ కేంద్రాలు 44, బి కేటగిరీ కేంద్రాలు 41, సి కేటగిరీ కేంద్రాలు 43 ఉన్నాయని చెప్పారు. జిల్లాలో మొత్తం 23,095 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరిలో 12,105 మంది అబ్బాయిలు, 10,990 మంది అమ్మాయిలు ఉన్నారని వెల్లడించారు. వీరితో పాటు 19 పరీక్షా కేంద్రాల్లో 1,063 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు.

పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు జిల్లా వ్యాప్తంగా 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనంగా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు కూడా పనిచేస్తాయని చెప్పారు. ట్రెజరీ లేదా పోలీస్ స్టేషన్ లేని 43 పరీక్షా కేంద్రాలకు ఎంఈఓలు లేదా సీనియర్ హెడ్మాస్టర్లు ఉదయం ప్రశ్నాపత్రాలను తీసుకెళ్లి పరీక్ష అనంతరం ఆన్సర్ పత్రాలను తిరిగి స్ట్రాంగ్ రూములకు తరలించే విధంగా ప్రత్యేక విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 129 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 129 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను, 12,010 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. సమస్యాత్మకంగా గుర్తించిన 12 పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి కఠిన పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈసారి విద్యార్థుల హాల్ టికెట్లలో క్యూఆర్ కోడ్ ముద్రించడం ద్వారా పరీక్షా కేంద్రం వివరాలను సులభంగా తెలుసుకునే విధంగా సాంకేతిక సదుపాయం కల్పించినట్లు తెలిపారు. హాల్ టికెట్‌ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం చిరునామా, ఇతర వివరాలు విద్యార్థులకు వెంటనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని కూడా తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులను ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలని, ఇతర అనుమానాస్పద వస్తువులు తీసుకురాకూడదని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కఠిన పర్యవేక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద శాంతి భద్రతల కోసం 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులకు తాగునీరు, అవసరమైన వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలుగా ఉపయోగించే పాఠశాలల్లో ఉదయం తరగతులకు సెలవులు ప్రకటించి, పరీక్షలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని తెలిపారు. పరీక్షల్లో పాస్ చేయిస్తామని, మాస్ కాపీయింగ్ చేయిస్తామని చెప్పి డబ్బులు తీసుకునే దళారీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని డీఈఓ విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. అలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరు ఇలాంటి ప్రయత్నాలు చేసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *