ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ గడువులో గందరగోళం
35 రోజుల నిబంధనపై వినియోగదారుల్లో ఆందోళన
కేవైసీ చేసిన వినియోగదారులకు మాత్రమే గ్యాస్
సంవత్సరానికి 12 సిలిండర్లు మాత్రమే
ప్రత్యామ్నాయ మార్గాలలో వైపు వినియోగదారులు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
విదేశాల నుంచి వంటగ్యాసును దిగుమతి చేసుకుంటున్నామని వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ప్రజలకు నమ్మ బుద్ధి కావడం లేదు. ప్రభుత్వం రోజుకు ఒక నిబంధనలను గ్యాస్ బుకింగ్ విషయంలో తీసుకొని వస్తుంది. ఈ నిబంధనలు వినియోగదారులను గందరగోళంలో పడేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పట్టణ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌పై 35 రోజుల గడువు అనే వార్తలు పట్టణ వినియోగదారుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ముఖ్యంగా డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నవారు ఇకపై 35 రోజుల తర్వాతే గ్యాస్ బుక్ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. అలాగే ఉజ్వల పథకం లబ్ధిదారులకు 45 రోజుల గడువు విధించారన్న సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందడంతో ప్రజల్లో భయం నెలకొంది. గతంలో కేవైసీ నిబంధన రాములు లేకపోయినా ప్రస్తుతం కేవైసీ నిబంధనలను తీసుకుని వచ్చారు. కేవైసీ చేయకుంటే గ్యాస్ సరఫరాను నిలుపుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ వివరణలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి కొంత భిన్నంగా ఉందని స్పష్టమవుతోంది. ఏది నమ్మాలో తెలియక వినియోగదారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వాడుతున్న గ్యాస్ సిలిండర్ అయిపోతే తిరిగి వస్తుందన్న నమ్మకం వినియోగదారులలో కనిపించడం లేదు. ఫలితంగా ప్రత్యామ్నాయలైన కరెంట్ స్టవ్, కిరోసిన్ స్టాప్, కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారిక నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు కనీస గడువు 25 రోజులు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో అది 45 రోజులు. ఈ విధానంలో ఎలాంటి మార్పు అధికారికంగా ప్రకటించలేదని ప్రభుత్వం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో సరఫరా ఒత్తిడి కారణంగా తాత్కాలికంగా గడువులను పెంచే ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలోనే 25 రోజుల గడువును డబుల్ సిలిండర్ ఉన్నవారికి 35 రోజులకు పెంచినట్టు సమాచారం. ఈ పరిణామాల వల్ల వినియోగదారుల్లో అయోమయం పెరిగింది. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ పరిస్థితికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడం, రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరగడం వల్ల గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. అయినప్పటికీ దేశంలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ సరఫరాను సమతుల్యం చేయడం, దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం కొన్ని కఠిన చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. గ్యాస్ బుకింగ్ గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశ్యం నిల్వలను జాగ్రత్తగా వాడుకోవడం, నల్లబజారు కార్యకలాపాలను నియంత్రించడం. అదనంగా ప్రతి వినియోగదారుడు ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ పరిచయ ధృవీకరణ) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. కేవైసీ పూర్తి చేయని వారి బుకింగ్‌లు రద్దు అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ డెలివరీ సమయంలో వినియోగదారుడి నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ డెలివరీ సిబ్బందికి ఇవ్వడం తప్పనిసరి చేశారు. సబ్సిడీ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ మార్పులు చేయలేదు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 12 సబ్సిడీ సిలిండర్లు పొందే హక్కు యథాతథంగా ఉంది. అయితే 12 సిలిండర్లు పూర్తయిన తర్వాత 13వ సిలిండర్ కోసం వినియోగదారులు అదనపు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంట్లో సభ్యుల సంఖ్య, అతిథుల రాక, శుభకార్యాల వివరాలను బట్టి గ్యాస్ సంస్థలు అదనపు సిలిండర్ ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయి.
ఈ మార్పులు మరియు వదంతుల ప్రభావంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టణాల్లో విద్యుత్ పొయ్యిల వినియోగం పెరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు, కిరోసిన్ పొయ్యిల వినియోగం మళ్లీ పెరుగుతోంది. గ్యాస్ సకాలంలో అందుతుందా లేదా అన్న అనుమానం వినియోగదారుల్లో పెరుగుతోంది. ఇక మరోవైపు, గ్యాస్ కొరతపై భయాన్ని ఉపయోగించుకుని మోసాలు కూడా పెరుగుతున్నాయి. నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాలు, కేవైసీ పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అందువల్ల వినియోగదారులు అధికారిక యాప్‌లు, గుర్తింపు పొందిన మార్గాల ద్వారానే బుకింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే, 35 రోజుల గడువు ప్రస్తుతం అధికారికంగా అమల్లో లేకపోయినా, పరిస్థితులు మారితే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ వినియోగం, సరఫరా వ్యవస్థ అన్నీ కలిపి గ్యాస్ విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే ఆధారంగా తీసుకోవడం అవసరం.

