కమ్యూనిటీ పనులకు నిల్… వ్యక్తిగత పనులకు ఫుల్
ఉపాధి హామీ పనుల్లో ఫేషియల్ అటెండెన్స్ ప్రభావం
జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల మాయాజాలం !
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చిన ఫేషియల్ అటెండెన్స్ విధానం గ్రామీణ ఉపాధి వ్యవస్థలో అనూహ్య మార్పులకు దారి తీసింది. సోమవారం నుంచి దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించిన అధికారులు తొలిదశలో కమ్యూనిటీ పనులకు మాత్రమే ఈ విధానాన్ని వర్తింపజేశారు. అయితే అమలులోకి వచ్చిన రెండు రోజులకే కమ్యూనిటీ పనుల వద్ద కూలీల హాజరు గణనీయంగా తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. ఫీల్డ్ అసిస్టెంట్లు అందిస్తున్న వివరాల ప్రకారం సామాజిక పనులకు హాజరు సగానికి పైగా పడిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వ్యక్తిగత పనుల్లో మాత్రం హాజరు సంఖ్యలు పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వ్యక్తిగత పనులకు ప్రస్తుతం ఫేషియల్ అటెండెన్స్ అవసరం లేకపోవడం కారణంగా తెలుస్తుంది.
జిల్లాలో మొత్తం 2,50,138 ఉపాధి హామీ జాబ్ కార్డులు నమోదయ్యాయి. అందులో 2,01,991 కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 1,14,307 మందికి ఉపాధి కల్పించగా, కేవలం 6,528 కుటుంబాలు మాత్రమే వంద రోజుల పనిని పూర్తి చేశాయి. ఈ గణాంకాలు గ్రామీణ ఉపాధి వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు అధికారులను ఆలోచనలో పడేశాయి. ఫేషియల్ అటెండెన్స్ ప్రవేశపెట్టడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని భావించినా, కమ్యూనిటీ పనులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కమ్యూనిటీ పనులు గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడేలా చేపడతారు. చెరువుల పునరుద్ధరణ, పూడిక తొలగింపు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, సాగు కాలువల శుభ్రపరిచే పనులు, గ్రామ సి.సి. రోడ్లు, మట్టి రోడ్లు, వైకుంఠధామాల నిర్మాణం, పాఠశాలల కంపౌండ్ వాల్స్, పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి వంటి పనులు గ్రామానికి శాశ్వత ఆస్తులు సృష్టిస్తాయి. ఈ పనులే గ్రామీణ మౌలిక సదుపాయాలకు పునాది. కానీ ఇప్పుడు ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి కావడంతో కొంతమంది కూలీలు బయోమెట్రిక్ సమస్యలు, సాంకేతిక లోపాలు, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు వంటి కారణాలతో కమ్యూనిటీ పనులకు దూరమవుతున్నట్లు సమాచారం.
దీనికి విరుద్ధంగా వ్యక్తిగత పనులు మాత్రం ఊపందుకున్నాయి. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర అర్హుల భూముల్లో చేపట్టే ఫామ్ పాండ్స్ తవ్వకం, పండ్ల తోటల పెంపకం, భూమి సమతలీకరణ, పశువుల షెడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, కంపోస్ట్ పిట్స్ వంటి పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్లు ఫీల్డ్ స్థాయి సమాచారం చెబుతోంది. ఫేషియల్ అటెండెన్స్ లేకపోవడం వల్ల ఈ పనుల్లో నమోదు సులభంగా జరుగుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో మరికొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కమ్యూనిటీ పనుల్లో హాజరు తగ్గడంతో గణాంకాలను సమతుల్యం చేయడానికి వ్యక్తిగత పనుల్లో అధిక హాజరు చూపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేషియల్ అటెండెన్స్ విధానం కమ్యూనిటీ పనులకు మాత్రమే పరిమితం కావడం వల్ల ఈ అసమతుల్యత ఏర్పడిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. దశలవారీ అమలు నిర్ణయం సక్రమంగా పర్యవేక్షించకపోతే పథకం అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఉపాధి హామీ పథకం కేవలం రోజువారీ కూలీ చెల్లింపులకే పరిమితం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణం, నీటి వనరుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, జీవనోపాధి మెరుగుదల వంటి లక్ష్యాలతో ఇది అమలవుతోంది. కమ్యూనిటీ పనులు గ్రామాభివృద్ధికి పునాది అయితే, వ్యక్తిగత పనులు రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడతాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత అవసరం. ఒకదానికి కఠిన నిబంధనలు, మరొకదానికి సడలింపులు ఉంటే సమగ్ర అభివృద్ధి లక్ష్యం సాకారం కావడం కష్టమే.
ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని పారదర్శకత కోసం ప్రవేశపెట్టినా, అమలు విధానంలో సాంకేతిక సమస్యలు, ఫీల్డ్ స్థాయి అవగాహన లోపాలు, మౌలిక వసతుల కొరత వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కమ్యూనిటీ పనులు నిలిచిపోయి, వ్యక్తిగత పనులు మాత్రమే కొనసాగుతున్న పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది. గణాంకాల్లో ఉపాధి ఫుల్ గా కనిపించినా, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నిల్ పరిస్థితి ఏర్పడకూడదంటే అధికారులు తక్షణమే సమీక్షలు నిర్వహించి తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ అభివృద్ధి, ఉపాధి భద్రత, పారదర్శకత అనే మూడు లక్ష్యాలు సమన్వయంతో నడిస్తేనే ఉపాధి హామీ పథకం అసలు ఉద్దేశం నెరవేరుతుంది.
గంగ 1 ఉపాధి హామీ పనులు

