పశువులకు సబ్సిడీ మీద దాణా, గడ్డి కోత యంత్రాలు
రోజుకు 22 లక్షల లీటర్ల పాల దిగుబడి లక్ష్యం
పశుగణనలో జిల్లాలో 149 లక్షలు సంపద
మూడు మండలాల్లో ట్యాంకర్ల ద్వారా పశువులకు నీటి సరఫరా
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాను పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా పశుసంవర్ధక శాఖ పటిష్ట ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 32 మండలాల్లో పశుసంవర్ధక శాఖ పరిధిలో సుమారు 1 లక్ష 28 వేల మంది పాల ఉత్పత్తిదారులు ఉన్నారు. రోజుకు సగటున 18 నుంచి 20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. రాబోయే రెండేళ్లలో ఈ ఉత్పత్తిని 20 నుంచి 22 లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొని అనుసరణ ప్రణాళికలు, సాంకేతిక చర్యలు చేపడుతున్నారు. పాల దిగుబడిని పెంచేందుకు పశువుల సంరక్షణ, ఆహారం, ఆరోగ్య సేవలు, మెరుగైన జాతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా లింగ నిర్ధారణ పద్ధతి ద్వారా మెరుగైన జాతి దూడలను పెంపొందించడం, పశువులకు సమయానికి టీకాలు, వైద్య సేవలు అందించడం, పోషకాహార దాణా సరఫరా వంటి చర్యలు కొనసాగుతున్నాయి. 1962 పశు ఆరోగ్య సేవ ద్వారా అత్యవసర సమయంలో 13 అంబులెన్స్ వాహనాల ద్వారా ఇప్పటివరకు 34,198 పశువులకు వైద్య సేవలు అందించబడటం కూడా పాల ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడుతోంది.
రానున్న వేసవిలో పశువులకు మేత కొరత తలెత్తకుండా పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. పశువులకు అవసరమైన దాణాను సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 2025–26 సంవత్సరానికి గాను 50 శాతం సబ్సిడీతో మెరుగైన పశు దాణాను రైతులకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు 1579 మెట్రిక్ టన్నుల దాణా పంపిణీ చేయబడగా, ఇంకా 725 మెట్రిక్ టన్నుల దాణాను సరఫరా చేయడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో 75 శాతం సబ్సిడీతో కూడా దాణా అందించే చర్యలు చేపడుతున్నారు. గడ్డి కొరత సమస్యను అధిగమించేందుకు గడ్డి కోత యంత్రాలను కూడా 50 శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా రైతులు గడ్డిని సులభంగా కోసుకుని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇది వేసవిలో మేత కొరత రాకుండా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసిన కారణంగా జిల్లాలో పచ్చిక విస్తీర్ణం పెరిగి, పశువులకు మేత కొరత పెద్దగా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడైనా సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి, కుప్పం, శాంతిపురం తదితర నాలుగు మండలాల్లోని ఏడు గ్రామాల్లో పశువులకు తాగునీటి కొరత ఉండే అవకాశం ఉందని గుర్తించారు. ఈ ప్రాంతాలకు 758 ట్యాంకర్ ట్రిప్పుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు.
*జిల్లాలో 149లో లక్షల పశు సంపద*
అదనంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పశుగణనలో భాగంగా గత సంవత్సరం నిర్వహించిన లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 1,49,24,131 పశుసంపద ఉన్నట్లు తేలింది. ఇందులో 4,97,172 పాడి ఆవులు, 28,600 బర్రెలు, 38,60,031 గొర్రెలు, 1,79,866 మేకలు, 1,557 పందులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ గణాంకాలను ఆధారంగా తీసుకొని మండలాల వారీగా పశువుల దాణా, గడ్డి కోత యంత్రాలు, టీకా మందుల సరఫరాను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా పశుసంవర్ధక రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. 70–90 శాతం సబ్సిడీతో 2942 గోశాలల నిర్మాణం, 1200 ఎకరాల్లో పశుగ్రాసం సాగు, 779 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 1835 మంది పశుపాలకులకు ఆర్థిక సాయం అందించబడింది. అలాగే పశు బీమా పథకం కింద 963 పశువులకు బీమా కల్పించారు. ఈ సమగ్ర చర్యలతో చిత్తూరు జిల్లాను పాల ఉత్పత్తిలో ముందంజలో నిలబెట్టడమే కాకుండా, పశుపోషణను రైతులకు లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ కృషి కొనసాగిస్తోంది. రానున్న కాలంలో పాల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.

