4, మార్చి 2026, బుధవారం

ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

చిత్తూరు జిల్లాలో ‘సింథటిక్’ పాల దందా
ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియా
ఏది ఆసలో ఏది కల్తీయో తెలియక ప్రజల తికమక


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

దేశంలోనే ప్రముఖ పాల ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా ఇప్పుడు ‘సింథటిక్’ పాలు, కల్తీ పాల దందాపై వెలుగులోకి వస్తున్న అంశాలతో కలవరపెడుతోంది. ఇటీవల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి అనారోగ్య ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత శాఖ, పోలీసు శాఖలు ముమ్మర తనిఖీలు చేపట్టింది. దీంతో చిత్తూరు జిల్లా పరిధిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర స్థాయి పాల కల్తీ వ్యవహారం సంచలనంగా మారింది. పాలు, పాల పదార్థాల నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గతంలో కూడా పలుమార్లు కల్తీ పాల తయారీ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు పట్టణంలో కూడా గతంలో ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో జరుగుతున్న కల్తీ వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఫిబ్రవరి 2026లో చిత్తూరు జిల్లా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా పరిధి కేజీఎఫ్ అండర్సన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బళ్లగిరి గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించగా భారీ స్థాయిలో నకిలీ పాలు తయారీ ముఠా గుట్టు రట్టు అయింది. విచారణలో లోకేష్ అనే వ్యక్తి ఫామ్ హౌస్‌ను లీజుకు తీసుకుని వెంకటేష్, అతని కుమారుడు బాలాజీతో కలిసి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ముఠా కర్ణాటక ప్రభుత్వ మిల్క్ పౌడర్, మార్కెట్‌లో లభించే పాలపొడి, పామ్ ఆయిల్, ఇతర రసాయన పదార్థాలను ఉపయోగించి కృత్రిమంగా పాల మాదిరి ద్రవాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో వెంకటేష్, బాలాజీతో పాటు గుడిపల్లి మండలానికి చెందిన దిలీప్, రామకుప్పం మండలానికి చెందిన బాలరాజు, కర్ణాటకకు చెందిన మనోహర్‌ను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ట్రాన్స్‌పోర్టర్లుగా మనోజ్ కుమార్, బంగారు తిరుపతి, మంజునాథ్, కార్తీ వంటి వ్యక్తులను గుర్తించగా, మిల్క్ పౌడర్ సరఫరాదారులుగా హర్షబ్ ఖాన్ మరియు రాజారెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. విచారణలో ఇది అంతర్రాష్ట్ర ముఠా కుట్రగా బయటపడటం మరింత సంచలనంగా మారింది. అత్యంత కీలక అంశం ఏమిటంటే ఈ కల్తీ పాలు తయారీ పూర్తిగా కర్ణాటక రాష్ట్ర పరిధిలోనే జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. కుప్పం నియోజకవర్గంలో నకిలీ పాలు తయారీ లేదా విక్రయాలు జరిగాయన్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నది. అధికారుల ప్రకారం, ఈ ముఠా తయారు చేసిన సింథటిక్ పాలను కొన్ని డెయిరీలు, చిల్లర వ్యాపారుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశోధనలో బయటపడిన మరో ఆందోళనకర అంశం కల్తీ పాల తయారీలో వాడుతున్న ప్రమాదకర పదార్థాలు. పాలను చిక్కగా చేయడానికి మాల్టోడెక్స్ట్రిన్, నిల్వ కాలం ముగిసిన పాలపొడి, పామ్ ఆయిల్ వంటి పదార్థాలు వాడుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో పాలు విరగకుండా ఉండేందుకు యూరియా, కాస్టిక్ సోడా వంటి రసాయనాలను తక్కువ మోతాదులో కలుపుతున్నట్లు తనిఖీల్లో తేలినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పశువుల నుంచి ఎక్కువ పాలు పితకడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వినియోగంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆహార భద్రత శాఖ అధికారులు ఇటీవల జిల్లాలోని పలు చిల్లింగ్ సెంటర్లు, ప్రైవేట్ డెయిరీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పాల నమూనాలను సేకరించి హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్‌లకు పరీక్షల కోసం పంపారు. కొన్ని నమూనాల్లో నాణ్యత లోపాలు, అనుమానాస్పద రసాయనాల ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి కలెక్షన్ కేంద్రాల ద్వారా సరఫరా అవుతున్న పాలపై ప్రత్యేక నిఘా పెట్టారు..డెయిరీ రంగం విస్తృతంగా ఉన్న చిత్తూరు జిల్లాలో కల్తీదారులు మూడు విధాలుగా మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 100 లీటర్ల పాలలో నీరు, రసాయనాలు కలిపి పరిమాణం పెంచడం, ఫ్యాట్ శాతం ఎక్కువగా కనిపించేందుకు వెజిటబుల్ ఆయిల్స్ కలపడం, నిల్వ కాలం పెంచేందుకు ప్రిజర్వేటివ్ రసాయనాలు వినియోగించడం వంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. డిమాండ్ అధికంగా ఉండటం, లాభాపేక్షతో కొందరు వ్యాపారులు నాణ్యతను పక్కనబెట్టి కల్తీ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య నిపుణులు కల్తీ పాల వినియోగంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యూరియా, డిటర్జెంట్, స్టార్చ్, హానికర రసాయనాలు కలిసిన పాలు తాగితే జీర్ణ సమస్యలు, కిడ్నీ వైఫల్యం, హార్మోన్ల అసమతుల్యత, పిల్లల్లో పోషకాహార లోపం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఇలాంటి పాలను వినియోగిస్తే ప్రాణాపాయం కూడా కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పాలను కాచినప్పుడు అసహజమైన వాసన, రంగు మార్పులు కనిపిస్తే అనుమానించాలి. ప్యాకేజింగ్, ఎక్స్‌పైరీ తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద పాలను కొనుగోలు చేయకుండా గుర్తింపు పొందిన డెయిరీల నుంచే పాలను వినియోగించాలని ఆహార భద్రత నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. కుప్పం ప్రాంతంలో కల్తీ పాలు తయారీ జరిగిందన్న వార్తలు వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కల్తీ పాల దందాలో ఎవరైనా ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి ఆస్తులను జప్తు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మొత్తం మీద చిత్తూరు జిల్లా కేంద్రంగా అంతర్రాష్ట్ర స్థాయిలో సాగుతున్న సింథటిక్ పాల దందా బయటపడటం ప్రజల ఆరోగ్య భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతుండగా, సమగ్ర దర్యాప్తు, కఠిన చర్యల ద్వారానే ఈ కల్తీ మాఫియాను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం అత్యవసరంగా మారింది.

గంగ 1 పాల

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *