అకాల వర్షంతో రాలిన మామిడి పూత, మామిడి పిందెలు
మామిడి రైతులకు నష్టాన్ని కలగజేసిన అకాల వర్షం
రైతులకు నష్టం లేదంటున్న వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు
పంట నష్టంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
చిత్తూరు జిల్లాలో ఈనెల 19వ తేదీన కురిసిన అకాల వర్షాలు రైతాంగాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. సాధారణ పంటలకు ఊరటనిచ్చిన ఈ వర్షాలు, జిల్లాలో ప్రధాన ఉద్యానవన పంట అయిన మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపి రైతులను ఆందోళనకు గురిచేశాయి. వసంతకాలంలో కీలక దశలో ఉన్న మామిడి తోటల్లో పూత, పిందెలు భారీగా రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. అకాల వర్షం కారణంగా జిల్లాలో జరిగిన పంటను గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అయితే జిల్లాలో ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు తెలియజేశారు.
వర్షపాతం వివరాలను పరిశీలిస్తే, గంగవరం మండలం 39.4 మిల్లీమీటర్లతో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. పలమనేరు మండలంలో 37.8 మి.మీ, యాదమరి మండలంలో 28.0 మి.మీ వర్షపాతం నమోదైంది. రోంపిచెర్ల, పూతలపట్టు మండలాల్లో తలో 24.2 మి.మీ, పెనుమూరు మండలంలో 23.2 మి.మీ, వెదురుకుప్పం మండలంలో 22.2 మి.మీ, ఐరాల మండలంలో 20.0 మి.మీ వర్షం కురిసింది. బైరెడ్డిపల్లె మండలంలో 17.2 మి.మీ, గుడిపాల మండలంలో 12.4 మి.మీ, పాలసముద్రం, విజయపురం మండలాల్లో తలో 12.2 మి.మీ, తవణంపల్లె మండలంలో 11.8 మి.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు రూరల్‌లో 10.6 మి.మీ, చిత్తూరు అర్బన్‌లో 10.2 మి.మీ, బంగారుపాళెంలో 9.8 మి.మీ, పులిచెర్లలో 9.6 మి.మీ వర్షం కురిసింది. శ్రీరంగరాజపురంలో 7.4 మి.మీ, పెద్దపంజాణిలో 3.2 మి.మీ, నిండ్ర లో 2.6 మి.మీ, నగరి, గంగాధరనెల్లూరు మండలాల్లో 2.4 మి.మీ నమోదయ్యాయి. శాంతిపురంలో 1.8 మి.మీ, రామకుప్పంలో 1.2 మి.మీ, కార్వేటినగర్‌లో 1.0 మి.మీ, కుప్పంలో 0.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వెంకటగిరికోట, గుడుపల్లె మండలాల్లో మాత్రం వర్షపాతం నమోదుకాలేదు.
ఈ వర్షాలు పంటలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, ప్రధాన వ్యవసాయ పంటలకు ఎటువంటి గణనీయమైన నష్టం సంభవించలేదని తెలిపారు. అలాగే ఉద్యానవన శాఖ అధికారులు కూడా సాధారణంగా ఉద్యాన పంటలకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నారు. అయితే మామిడి రైతుల పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అకాల వర్షం, గాలులతో కలిసి మామిడి పూత భారీగా రాలిపోవడంతో పాటు, ఇప్పటికే ఏర్పడిన పిందెలు కూడా నేలకూలాయి. పూత దశలో ఉన్న చెట్లు గాలికి తట్టుకోలేక పుష్పాలు ఊడిపోవడం వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా వాతావరణ మార్పుల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న మామిడి రైతులకు ఈసారి కూడా పరిస్థితి అనుకూలంగా కనిపించడం లేదు. ఈ ఏడాది మామిడి చెట్లకు విస్తారంగా పూత వచ్చినప్పటికీ, అది నిలవకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. పూత రెండు మూడు దఫాలుగా రావడం, కొంత భాగం పిందె దశలో ఉండగా మరికొన్ని చెట్లు మళ్లీ పూతకు రావడం వంటి పరిణామాలు రైతుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే ఉద్యానవన శాఖ అధికారులు మాత్రం కొంత భరోసా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు భూమిలో తేమను పెంచి చెట్లకు ఉపయోగపడతాయని, తద్వారా పిందె దశలో ఉన్న మామిడికాయలు కొంతమేర పెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు. అలాగే పది నుంచి పదిహేను రోజుల వరకు నీటిపారుదల అవసరం లేకుండా ఈ తేమ సహకరిస్తుందని పేర్కొన్నారు. అయితే రైతులు మాత్రం ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కష్టమని చెబుతున్నారు. పూత, చిన్న కాయలు రాలిపోవడం వల్ల తుదిదిగుబడిపై ప్రభావం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకుని రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలో కురిసిన ఈ అకాల వర్షాలు వ్యవసాయానికి కొంత ఊరటనిచ్చినా, మామిడి రైతులకు మాత్రం గట్టిదెబ్బగా మారాయి. ఒకవైపు భూమికి తేమ, చెట్లకు పోషకత కలిగించినా, మరోవైపు పూత, పిందెలు రాలిపోవడం ద్వారా రైతుల ఆశలను కొట్టివేశాయి. దీంతో ఈ సీజన్‌లో మామిడి దిగుబడి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

